mt_logo

తెలుగు సినిమాకున్న రోగం కొత్తదీ కాదు… మానేదీ కాదు

 

By: సవాల్ రెడ్డి 

(ఆర్టికల్ లో స్వల్ప మార్పులు చేశాం – 12 ఫిబ్రవరి 2013)

1966

సినిమా: కన్నె మనసులు
దర్శకుడు: ఆదుర్తి.

ఓ సీను: హీరోయిన్ కుటుంబం ఏదో రిసార్టో ఎస్టేట్ కో పోద్ది. హీరో ఆవిడను కలిసేందుకు మారు వేషంలో పెద్ద మీసాలు పెట్టుకుని వస్తాడు. రైలు దిగిన హీరోయిన్ కుటుంబం తాలూకు సామాను తీసుకువేళుతుంటాడు. ఈ సందర్భంగా ఆ హీరో గలగలా మాట్లాడేస్తాడు హీరోయిన్ బృందాన్ని ఇంప్రెస్ చేయడానికి…వాడేది తెలంగాణ భాష.

తండ్రి అడుగుతాడు “ఏ ఊర్రా నీది” అని.

హీరో చెబుతాడు “నైజాం నుంచి వచ్చినా దొర” అంటూ.

“మొత్తానికి, చంపుతున్నావ్ కదరా నీ భాషతో” అంటాడు తండ్రి

హీరోయిన్ బృందం తనివితీరా నవ్వుకుంటారు.

మొత్తానికి ఆనాటి అనాగరిక తెలంగాణ భాష,నాగరీక ఆంధ్రులను చంపేసే స్థాయిలో ఉందనేది కాన్సెప్ట్.

ఆ సినిమాకు కథ అందించింది ముళ్లపూడి వెంకటరమణ అయితే స్ర్కీన్ ప్లే ఆచార్య ఆత్రేయది. మాటలు రాసింది మాత్రం ఎన్ఆర్ నంది.

ఈ ముగ్గురిలో ఈ “తెలంగాణ భాషతో చంపేసే కాన్సెప్ట్” ఎవరి మేధస్సులో పుట్టిందో తెలీదు. కానీ ఆనాటి సినిమా కల్చర్ ప్రకారం సినిమా పూర్తయ్యేదాకా అన్నింటా అందరి సమష్టి కృషి ఉండటం రివాజు కాబట్టి ఇది అందరికీ తెలిసే జరిగిందనేది వాస్తవం.

 

1988

చిత్రం: వారసుడొచ్చాడు

దర్శకుడు: మోహన్ గాంధి

నిర్మాత: రవికిశోర్

ఊరు ఆంధ్రలోని ఓ గ్రామం..భర్తలేని ఇంటికి ఇద్దరు అల్లుళ్లు చేరి ఆమె ఆస్తి కాజేయాలని చూస్తుంటారు..ఓ అల్లుడు కోటశ్రీనివాస రావుది తెలంగాణ. మరొకడు గొల్లపూడి మారుతీ రావుది ఆంధ్ర.

ఆ ఇంటి అసలు వారసుడి వేషంలో వచ్చిన హీరో ఓ సందర్భంలో ఆ మామలకు ఆస్తి కాజేసే గొప్ప ఐడియా చెబుతాడు.. అది విన్న గొల్లపూడి, కోట తమకు ఆ ఐడియా రానందుకు ఇచ్చే ఎక్స్ ప్రెషన్ మాటలు…

గొల్లపుడి మాటలు “అయ్యో మాకా ఐడియా రాలేదే” అన్న అర్థం వస్తాయి…

కానీ తెలంగాణ యాస మాట్లాడే కోట మాత్రం… “మోకాల్లో మెదడుండడం అంటే ఇదేనేమో” అంటూ చాలా కాలంగా ఆంధ్రులు తెలంగాణ వాళ్ల గురించి వాడే ఓ వెకిలి ఉపమానాన్ని చెబుతాడు.

ఈ మాటలు రాసింది… గత దశాబ్ద కాలంగా తెలంగాణ కేరెక్టర్ల పేరు చెప్పుకుని కూడు తింటున్న తనికెళ్ల భరణి.

1991

చిత్రం: నిర్ణయం
దర్శకుడు: ప్రియదర్శన్
నిర్మాత: మురళీమోహన్

ఓ సీను: హీరో ఆంధ్రలోని ఏదో ఊళ్లోంచి హైదరాబాద్ బయలుదేరుతుంటే తల్లి అంటుంది

“తొందరగా తిరిగిరా…..నీకు చక్కటి పిల్లను చూసి పెళ్లి చేస్తననని”

కొడుకు అడుగుతాడు మరి హైదరాబాద్ లో ఎవరైనా దొరుకుతారేయో వెతకనా? అని.

తల్లి అసహ్యంగా ముఖం పెట్టి వద్దురా! ఆ తెలంగాణ వాళ్ల భాష నాకు అర్థమై చావదు అనేస్తే

కొడుకు మనస్ఫూర్తిగా హహహ అంటూ నవ్వేస్తాడు.

కొడుకు పాత్రలో ఉన్న ఆ మహా నటుడు అక్కినేని నాగార్జున.అయితే తెలంగాణ భాష అర్థమై చావని ఆ తల్లి నటి అన్నపూర్ణ.

సినిమా తీసింది తెలుగుజాతి సమైక్యతా, సమగ్రతా, గౌరవం అంటూ తెలుగుజాతి ఐక్యతకోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని కబుర్లు చెప్పే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు మురళీమోహన్.

మాటలు రాసింది విశాలాంధ్ర నినాదాలిచ్చిన కమ్యూనిస్టు రచయిత.అభ్యదయ సినిమాల కథలు, కథనాల కేసరి – గణేష్ పాత్రో

1996

సినిమా: సంప్రదాయం

బ్రహ్మానందంది అంధ్ర, వేణుమాధవ్ ది తెలంగాణ.

వేణు హోటల్ కు బ్రహ్మానందం వచ్చి అడుగుతాడు.

తినడానికేమున్నాయని.

వేణుమాధవ్ జవాబు: ఈడ్లు.

బ్రహ్మానందం: ఈడ్లేంటి?

వేణుమాధవ్: గద్దెల్వదా?.ఇంతపిండి ముద్దతీస్కొని ఆవిరిపడతరు

బ్రహ్మానందం: అవ్వా వాట్ని ఇడ్లీ అంటారమ్మా ఈడ్లుకాదు.ఏంటి? ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి.

వేణుమాధవ్ : ఓడలు….

బ్రహ్మానందం: ఆ!..

వేణుమాధవ్ : ఓడలు…

బ్రహ్మానందం: ఓడలు సముద్రంలో ఉంటాయయ్యా!హోటల్లో ఎందుకుంటాయి?

వేణుమాధవ్ : గద్దెల్వదా…గింతగింత పిండిముద్దలు తీస్కొని మధ్యల ఇంత బొక్కపెట్టి నూనెల ఎయ్యరా ఓడలు…

బ్రహ్మానందం: అవి ఓడలు కాదయ్యా వడలు…

ఇలా నడుస్తుంటుంది ఆ సీను…

మొత్తానికి ఆ తెలంగాణ వాడికి ఇడ్లీ అనడం రాదు. జిలేబీ అని కానీ….వడ అని అనలేడు…మాటలు రావా అంటే బాగా వస్తాయి. అయితే ఈ పదార్థాల పేర్లు ఆ తెలంగాణ అర్భకుడికి తెలియవు.వాటిని వేణుమాధవ్ వికృతంగా పలుకుతుంటే…బ్రహ్మానందం వాటిని ఏడుపుగొట్టు గొంతుతో సరిచేసి కావాల్సినంత ఆనందం(?) పంచుతాడు. అంటే తెలంగాణ వాళ్లకు టిఫిన్లు తెలీవనేది కాన్సెప్ట్.

సినిమా తీసింది…. ఎస్వీ కృష్టారెడ్డి… మాటలు దివాకర్ బాబు (?)

తెలుగువాళ్లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఆ భావన పచ్చి పచ్చిగానే ఉన్న సమయంలో వచ్చింది “పాలమనసులు” సినిమా. అప్పటికి ఎంతో ఉదారంగా అక్కున చేర్చుకున్న తెలంగాణపై ఆంధ్రుల అభిప్రాయం ఏమిటో ఆత్రేయ గారి కలంనుంచి వెలువడ్డ ఆణిముత్యాలు పాలమనసులులో కనిపిస్తాయి. అదేదో కొత్తలో ఇలాంటి భావన ఉంటే ఉందేమో అనుకుందాం. 1980 నాటికి కూడా ఆ రోగం మానలేదని తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరకు కూడా కొనసాగిందనేది… తణికెళ్ల భరణి…మాటల్లో “వారసుడొచ్చాడు” చిత్రం ద్వారా స్పష్టమవుతుంది. ఆ రోగం మరీ ముదిరే ఉందని ఆంధ్రులకు ఏమాత్రం తెలంగాణ భాషమీద కనీస గౌరవం కూడా లేదనేది “నిర్ణయం” చిత్రంలో అభ్యుదయ రచయిత గణేష్ పాత్రో మాటలతో అర్థమవుతుంది.

ఇక విలన్ పాత్రధారులతో…. కమెడియన్ పాత్రధారులతో తెలంగాణ భాష….. నిజానికి తెలంగాణలో ఎక్కడా వినిపించని వికృత రూపంలో మాట్లాడిస్తూ తమ రాక్షసానందాన్ని తీర్చుకున్న సినిమాలు ఎన్నో ఎన్నెన్నో…బహుశా ప్రపంచంలో ఏ ఇతర భాష ఇంత దారుణమైన దాడులకు అవహేళనలకు గురైన సందర్భాలు లేకపోవొచ్చు.

అప్పటికీ ఇప్పటికీ వాళ్లది అదే పద్దతి.. అదే తీరు… అదే ఆధిక్యభావన అనే రాక్షసానందం. వాళ్లు మారతారని వాళ్లేదో అన్నదమ్ములు,ఆత్మీయులనే సన్నాయి నొక్కుడు మాటలు భావనలు అన్నీ వృధా.

1969 ఉద్యమంలో “ఆంధ్రోళ్లు మనకు సముద్రం రాకుండా చేసిండ్రు అని ప్రజలను తెలంగాణ నాయకులు రెచ్చగొట్టారట……” అని ఇప్పటికీ ఆంధ్రవాళ్లు నవ్వుకుంటారు. అదీ తెలంగాణ వాళ్ల మీద ఇక్కడి ప్రజల భౌగోళిక జ్ఞానం మీద వాళ్లకు ఉన్న అభిప్రాయం.

ఇది మారేదేనా? కలిసి ఉండడం, కలిసిపోవడం ఆత్మీయుల్లా ఉండడం సాధ్యమయ్యేదేనా?

***
తెలుగు సినిమా తెలంగాణపై చూపిన వివక్ష గురించి లోతుగా తెలుసుకోవాలంటే దేశపతి శ్రీనివాస్ రాసిన మాయ తెర వ్యాసం చదవండి

***

ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే తెలంగాణపై విషం చిమ్మిన కందిరీగ సినిమా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *