తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. అనన్య త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయినా.. కొందరికి అంతులేని అనుమానాలు, ధర్మసందేహాలు.. వీటన్నింటికీ సమాధానాలన్నట్లుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సమస్య-కొన్ని ప్రశ్నలు, వాటికి జవాబులు వ్యాసంలో వివరించారు…
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో భూ సంస్కరణలు సాధ్యమేనా? మళ్లీ భూస్వాముల పెత్తనమే కొనసాగదా?
ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకష్ణారావు ప్రభుత్వం ఆమోదించిన భూసంస్కరణల చట్టం ఆరోజే ఒక విప్లవాత్మక విధానంగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకపోతే ఆ చట్టం అమలులోకి వచ్చి తెలంగాణ ప్రాంతపు భూమి పంపిణీలో గణనీయమైన మార్పులు వచ్చి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం వల్ల ఆంధ్ర ప్రాంత భూస్వామ్య వర్గాలు తెలంగాణ ప్రాంత భూస్వాములతో కుమ్మక్కై ఆ చట్టం అమలు కాకుండా చూశాయి. 1971-72లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసంస్కరణలు ఒక కంటితుడుపు చర్యగానే మిగిలిపోయాయి. ఈ సంస్కరణల పేరుతో ప్రవేశపెట్టిన చట్టాల వలన భూస్వాములకు తమ భూములు పోతాయనే భయం, భూమిలేని వారికి భూములు వస్తాయనే ఆశ కల్గడం తప్ప చెప్పుకోతగ్గ మేరకు ఉన్నవారి భూములు పోలేదు. లేని వారికి భూములు రాలేదు. కోస్తా జిల్లాల ధనిక భూస్వామ్య వర్గాల ప్రభావం ఉన్నంతవరకు ఈ రాష్ట్రంలో భూసంస్కరణలు సాధ్యం కావు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత కాలం పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే అభ్యుదయ ప్రగతిశీల శక్తులకు ప్రాధాన్యం లభిస్తుంది. అటువంటి వాతావరణంలోనే అర్థవంతమైన భూసంస్కరణలు సాధ్యమవుతాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దళితులకు, బలహీనవర్గాలకు ఒరిగేదేముంది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు దళితులకు, ఇతర బలహీన వర్గాలకు జరిగిన మేలేమిటి? గత నలభై మూడు సంవత్సరాల కాలంలో, కొద్ది మాసాలు సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండడం తప్ప. ఎప్పుడు ఏ ప్రాంతపు ఏ బలహీనవర్గాల వారికి పాలనాధికారం లభించింది? ఇప్పుడున్న రాజకీయ పార్టీల(కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు)స్వరూపస్వభావాలు ఎలా ఉన్నాయి? వీటిలో బలహీనవర్గాల నాయకత్వానికున్న ప్రాధాన్యం ఏమిటి? బలహీనవర్గాల విషయంలోనే కాదు,ఇతర వర్గాలలో కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకత్వం ఎదిగే అవకాశాలు ఉన్నాయా?
దళితులకు, ఇతర బలహీనవర్గాలకు రాజకీయ ప్రక్రియతో పాటు ఇతర అన్ని రంగాలలో న్యాయబద్ధమైన వాటా హక్కుగా చెందాలి. అది ఆ వర్గాలలో చైతన్యం, పోరాట పటిమ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న అనేక పోరాటాల వలన తెలంగాణ ప్రాంతపు బలహీన వర్గాలలో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ చైతన్యం వచ్చింది. వారిలో ఎంత చైతన్యం ఉన్నప్పటికి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నంత కాలం ఆంధ్ర ప్రాంతపు ధనిక వర్గాలు తెలంగాణ ప్రాంతపు బలహీన వర్గాలనే కాదు, ఏ వర్గాలను కూడా ఎదగనీయవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బలహీనవర్గాలకు అధికారం హక్కుగా లభించే వాతావరణం ఉంటుంది. దానికొరకు ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే అవసరం ఉండదు.
రాష్ట్ర రాజధాని నగరంలో జరిగిన అభివద్ధి తెలంగాణ ప్రాంతపు అభివద్ధి కాదా?
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర రాజధాని విషయంలో ఎన్ని ఇబ్బందుల పాలైందో ఎవరికి తెలియదు? విశాలాంధ్ర ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన కారణం అది వరకే బాగా అభివద్ధి చెందిన హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలపై ఆంధ్రులు వేసిన కన్నుకాదా? ఈ సత్యాన్ని ఫజల్ అలీ కమిషన్ కూడా ధృవీకరించిన విషయం జ్ఞాపకం లేదా? హైదరాబాద్ సికిందరాబాద్ నగరాల అభివద్ధి వెనుక నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఈ జంట నగరాలను నిజాం నవాబులు జిల్లాలను కొల్లగొట్టి అభివృద్ధి పర్చడం జరిగింది. అయినా రాజధాని నగరంలో కల్పించబడిన వసతులన్నీ తెలంగాణ ప్రాంతపు ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఎన్ని రక్షణలు కల్పించినప్పటికీ ఇతర ప్రాంతాల వారు ఆ వసతులను కాజేయడం ప్రారంభమయింది. చివరికి ఆరు సూత్రాల పథకం తెలంగాణ వారికి ఒక గొడ్డలిపెట్టుగా మారింది. ఈ పథకం పుణ్యమా అంటూ తమ పూర్వీకుల చెమట, రక్తంతో పెంచి పోషింపబడిన తమ రాజధాని నగరంలోనే తెలంగాణ వారు పరాయివారయిపోయారు, పరాయివారు స్థానికులైపోయారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి ఫలితాలు ఎవరికి దక్కుతున్నవి?
హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాలలో నెలకొల్పబడిన పరిశ్రమలకు ఉచితంగానో, లేక స్వల్ప ధరలకో కేటాయించిన భూమి ఎవరిది? నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కర్షకుల నోళ్ళుకొట్టి సింగూరు, మంజీరా నదీ జలాలను ఈ పరిశ్రమలకు అందించడం లేదా? తెలంగాణ ప్రాంతపు రైతాంగం కరెంట్ కోతతో సతమతమై, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయిన కరెంటును హైదరాబాద్‌లో ఎవరి పరిశ్రమలకు అందిస్తున్నారు? ఈ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టి లాభాలను గడించే వారిలో 90 శాతానికిపైగా స్థానికేతరులు కాదా? ఈ పరిశ్రమల వలన స్థానికులకు కనీసం ఉపాధి సౌకర్యాలు కూడా లభించలేదన్న విషయం ఎవరికి తెలియదు? ఏ పరిశ్రమలో తెలంగాణ ఉద్యోగులు పది శాతం కంటే ఎక్కువ ఉన్నారు? అది కూడా అంటెండర్లు, స్వీపర్లు, స్కావెంజర్ల వంటి కిందిస్థాయి ఉద్యోగాల వరకే పరిమితం కాలేదా?
రాజధాని నగరంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధి వలన ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు మాత్రమే సంక్రమించింది కాలుష్యం. భయంకర కాలుష్యం వలన జంటనగరాలే కాక పరిసర ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వ్యవసాయం చేయడానికి వీలులేకుండా పాడయిపోతున్నాయి. తాగునీరు విషపూరితమైపోతున్నది. మూసీనది పొడవునా వందలాది గ్రామాల్లో భయంకర పరిస్థితులేర్పడుతున్నాయి. ఇంకా కొద్దిరోజుల్లో ఈ ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యే ప్రమాదముంది. ఇవన్నీ రాజధాని నగర పారిశ్రామికాభివద్ధి వల్ల తెలంగాణ ప్రాంతపు ప్రజలకు అందిన కానుకలు.
చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరం కేంద్రంగా ఎదిగిన మాట వాస్తవమే. కానీ ఈ పరిశ్రమ ఎవరి చేతుల్లో వుంది? దీనికి కావలసిన భూమి నామమాత్రపు ధరకు ఇచ్చిన స్థలాలు ఎవరివి? ఈ పరిశ్రమలకిచ్చిన రాయితీల భారం తెలంగాణ ప్రజలపై కూడా పడలేదా? అయితే ఈ పరిశ్రమ అభివృద్ధి వలన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటి? ఈ రాష్ట్రంలో తీయబడే చలనచిత్రాలలో తెలంగాణ కళాకారులకు లభించే ఆదరణ ఎంత? ఈ చిత్రాలలో తెలంగాణ ప్రాంతపు భాషకు, యాసకు, నుడికారానికి, సంస్కృతికి అవహేళన తప్ప ఇంకేం దక్కింది? రాజధాని నగరంలోనే కాక దాని చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపు వంద కిలోమీటర్ల దూరం వరకు భయంకరంగా విస్తరించిన, యింకా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరి చేతుల్లో వుంది? ఫిల్మ్‌సిటీలు, హైటెక్‌సిటీలు, వినోద స్థలాల పేరుతో పెరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వలన ఎంతమంది నిరుపేద, నిస్సహాయ స్థానికులు నిర్వాసితులవుతున్నారో ఎవరైనా అంచనాలు వేశారా? రాజధాని నగరంలో వెలసిన, వెలుస్తున్న స్టార్ హోటళ్లు, స్టార్ సంస్కృతి గల నర్సింగ్ హోంలు, వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేట్ విద్యాసంస్థలు, బడా వ్యాపార సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నందనవనాల వలన నిర్వాసితులవుతున్న వారెవరు? వందలాది కోట్ల ఖర్చుతో నిర్మించే ఫ్లై ఓవర్లు ఎవరి సౌకర్యం కోసం? ఆ అప్పు భారాన్ని ఎవరు మోయాలి? ఎవరు తీర్చాలి?
హైదరాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయాలు, పార్కులు, నివాస కాలనీలు, రోడ్లు, భవనాల పేర్లు మార్చి వాటికి ఆంధ్ర ప్రాంత నాయకుల పేర్లు పెడుతూ ఉన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాము లు పేరు పెట్టారు. నిజానికి ఈ విశ్వవిద్యాలయానికి శ్రీరాములకు ఏమిటి సంబంధం? ఈ విశ్వవిద్యాలయానికి ఒక మనిషి పేరు పెట్టవలసి వస్తే నిజాం కాలంలో తెలుగు భాషా సంస్కృతులను కాపాడిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టవచ్చు కదా! హైదరాబాద్ రాష్ట్రంలో అంకురార్పణ జరిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్.జి.రంగా పేరు పెట్టారు. ఈ విశ్వవిద్యాలయ స్థాపనకు దోహం చేసిన తెలంగాణ ప్రముఖుల పేర్లు ఈ ప్రభుత్వానికి తెలియవా?
సంజీవరెడ్డినగర్, పొట్టి శ్రీరాములునగర్, వెంగళరావునగర్, బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు, సంజీవయ్య పార్కు, అయ్యదేవర కాళేశ్వరరావు భవన్ ఎటుచూసినా ఇటువంటివే కనిపిస్తాయి. హైదరాబాద్ నగరం నిండా తెలంగాణ ప్రాంతంలో ఏ సంబంధం లేని ఆంధ్ర ప్రాంతపు రాజకీయ నాయకులు-టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్.టి.ఆర్ విగ్రహాలే కనపడతాయి. తెలంగాణకు చెందిన బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, దాశరథి కష్ణమాచార్య, షోయబుల్లాఖాన్, రావి నారాయణరెడ్డి వంటి ప్రముఖులను మరిచిపోయారా?
ఇక శ్రీశైలం ఆనకట్ట అకస్మాత్తుగా నీలం సంజీవరెడ్డి జలాశయంగా మారిపోయింది. ఇవన్నీ చాలనట్టు.. నగరం నడిబొడ్డున ఉన్న ప్రశస్తమైన విశాల భూభాగాలను స్మశాన వాటికలుగా మారుస్తున్నారు. టాంక్‌బండ్‌పై ఎన్.టి.ఆర్‌కు దహన సంస్కారం, టాంక్‌బండ్ కింద చెన్నారెడ్డి దహన సంస్కారం. కోర్టు అడ్డుపడకపోతే ఈ పరంపర ఇంకా కొనసాగేది…
(తల్లడిల్లుతున్న తెలంగాణ పుస్తకంలోని తెలంగాణ సమస్య-కొన్ని ప్రశ్నలు, వాటికి జవాబులువ్యాసంలోని కొన్ని భాగాలు..)
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]