mt_logo

తెలంగాణ వాణి ఈ “వీణ”


పిట్ట కొంచెం – కూత ఘనం
ఉద్యమ పాటలే ప్రాణంగా…
ధూంధాంలో దుమ్మురేపుతున్న వీణ

మేడ్చల్ (టీ మీడియా): పేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థిని తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. మలి విడత ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ ధూంధాంలో చురుగ్గా పాల్గొంటూ తెలంగాణ అవశ్యకత గురించి పాటల రూపంలో తెలియజేస్తోంది. వయస్సులో చిన్నదైనా తెలంగాణ ప్రజల గుండెకోతను వివరిస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది. మేడ్చల్‌లో ప్రారంభమైన ఆమె ఆటా పాట నేడు తెలంగాణ పది జిల్లాల్లో పాల్గొనే స్థాయికి ఎదగింది. ఉద్యమ ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్ ప్రోత్సాహంతో ఇప్పుడిప్పుడే సుస్థిర స్థానం సంపాదించుకుంటోంది మేడ్చల్‌కు చెందిన వీణ. పట్టణంలో వీకర్ సెక్షన్ కాలనీలో నివసించే క్రిష్ణ-ప్రమీలకు ఐదుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు ఇద్దరు కుమారులు. తండ్రి క్రిష్ణ రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అందరిలో చిన్నదైన చిన్న కూతురే ఈ వీణ. వీరిది సొంత ఊరు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కూచారం గ్రామం. బతుకు దెరువు కోసం మేడ్చల్ మండలానికి వలస వచ్చారు.

ఆర్థిక స్థోమత లేక ఇతరుల సాయంతో పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణురాలై సత్తా చాటింది. మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది వీణ. తెలంగాణ ఉద్యమంపై ఆసక్తి పెంచుకుంది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, వలస పాలకులకు తెలంగాణపై ఉన్న వివక్షను గుర్తించింది. తెలంగాణ ధూంధాం పాటలను ఆలకించింది. తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాన్ని పాటల్లో వర్ణించేది. పిల్లల నుంచి పెద్దల వరకు తన గాత్రంతో ఇట్టే ఆకట్టుకుంటోంది. ఒకవైపు విద్యలో రాణిస్తూనే మరోవైపు ఉద్యమానికి నడుంబిగించింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా పాటలపై దృష్టి సారించింది. ఎక్కడ ఆ పాటలు వినిపిస్తే అక్కడకు వెళ్లేది. అప్పటి నుంచి తెలంగాణ కోసం ఎక్కడ ధూం ధాం జరిగిన అక్కడ దర్శనమిచ్చేది. జేఏసీ, పలు రాజకీయ పార్టీలు నిర్వహించే ధూంధాం కార్యక్రమంలో పాల్గొంటూ ఉద్యమానికి ఊపిరిపోస్తోంది. ఉద్యమ పాటల రచయితలతో పరిచయం ఏర్పర్చుకొని వారిలో ఒకరిగా ఉంటూ అందరి మన్ననలు పొందుతోంది.

ధూంధాంలో…

మేడ్చల్‌లో డిసెంబర్ 17న జరిగిన భారీ బహిరంగ సభకు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా జరిగిన ధూంధాంలో వీణ పాల్గొంది. 43 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెలో కీలకంగా పాల్గొంది. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాద్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు తోడుగా నిలిచింది. తెలంగాణ ఆటా పాటలను జోడించింది. ప్రతి రోజు ఉద్యమంలో పాల్గొని ఉద్యమ కారుల్లో బాధ్యత పెంచింది. ఉద్యమంలో భాగంగా మండలం కేంద్రంలోతో పాటు ఆయా గ్రామాల్లో ఎక్కడ ఉద్యమ కార్యక్రమాలు జరిగినా అక్కడ వీణ పాట తప్పనిసరి.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *