mt_logo

ప్రసవ వేదనలో తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి ప్రస్తుతం ప్రసవ వేదన పడుతున్నదని, సుందరమైన రాష్ట్రాన్ని కనబోతున్నదని బీజేపీ సీనియర్ నాయకురాలు, లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ భావోద్వేగంతో అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌ రెడ్డి ఢిల్లీలో మూడురోజుల పాటు చేపట్టిన తెలంగాణ పోరు దీక్ష ముగింపు రోజున ఆమె దీక్ష శిబిరాన్ని సందర్శించారు. స్టేజీ ఎక్కే ముందు అక్కడే కాళ్లకు, చేతులకు కట్లతో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన సుష్మాస్వరాజ్.. ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..’ అంటూ సురేందర్ అనే గాయకుడు పాడిన పాట విని చలించిపోయారు. తన ప్రసంగంలో ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఓ దశలో కంటతడి పెట్టారు.

“తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. మరెన్నోసార్లు ఢిల్లీకి వచ్చి తమ ఆకాంక్షలను వినిపించారు. అయినా అ మూగ ప్రభుత్వం చెవికి అవి సోకలేదు. తెలంగాణలోనే కాదు ఢిల్లీలో కూడా వదిలిపెట్టకుండా పోలీసుల చేత యూపీఏ ప్రభుత్వం లాఠీచార్జి చేయించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించడం దారుణం. గాయపడ్డ కార్యకర్తల పరిస్థితి చూసి నాకు నోట మాట రాలేదు. కళాకారుడు పాట పాడుతూ తల్లి గర్భశోకం గురించి వివరించాడు. ప్రసవ వేదన ఎలా ఉంటుందో ఒక తల్లిగా నాకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ తల్లి పజలు రాష్ట్రం అనే బిడ్డను కనడానికి ప్రసవవేదన పడుతున్న సమయం. నేను ఆశావాదిని. వేదన ఎంత కఠినమైనా.. అప్పుడే పుట్టిన బిడ్డను తన పొత్తిళ్లలో చూసుకొన్న తల్లి ఎంతో సంతోషిస్తుంది. సుందరమైన తన బిడ్డను తడిమి చూసుకొని, తన కష్టాన్నంతా మరిచిపోతుంది. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల సుందర స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం త్వరలోనే సాకారం కానుంది. తెలంగాణ బిడ్డ జన్మ తథ్యం” అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

ఆమె మాట్లాడినంతసేపు ఉద్వేగానికి లోనయిన కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేస్తూనే ఉన్నారు. సుష్మాస్వరాజ్ ‘తమ ఆడబిడ్డ’ అంటూ నినదించారు. అరవై ఏళ్లుగా తెలంగాణ ఎదుర్కొంటున్న కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని సుష్మ విమర్శించారు. “2009 డిసెంబర్ 9నాడు సోనియా జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు. డాన్సులు, మిఠాయిలతో సంబరాలు చేసుకున్న తెలంగాణ ప్రజలు జ్ఞాపకాల తడి ఆరకముందే 21 రోజుల్లోపే ఏర్పాటు ప్రకటనను వాపసు తీసుకున్నారు” అని ఆమె దుయ్యబట్టారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లోపల, బయట పోరాడుతున్న బీజేపీ.. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

“సకల జనుల సమ్మె సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు, రైళ్లు, బస్సులు సకలం బంద్ అయినా, కొన్ని మాత్రమే నడిచాయి. లాఠీలు, గోలీలు మాత్రం ఆగకుండా ప్రజలపై నిరంతరం పని చేశాయి. అయితే ఆ లాఠీలు, గోలీలు ఢిల్లీ కూడా వస్తాయని నేను ఊహించలేదు” అంటూ మంగళవారం నాటి తెలంగాణమార్చ్‌పై ఢిల్లీ పోలీసుల దాష్టీకాన్ని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది మధ్యంతరమేనని, లేకుంటే 2014 తరువాత ఎన్డీయే అధికారంలోకి తప్పక వస్తుందని సుష్మ చెప్పారు. గాయపడ్డ కార్యకర్తలకు తన సానుభూతిని ప్రకటించారు.

మూడు రోజులుగా తెలంగాణ ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిన దీక్షకకు ఆ పార్టీ అగ్రనేతలందరూ హాజరయ్యారు. బుధవారం ఉదయం పదకొండు గంటలకు సుష్మాస్వరాజ్ దీక్ష శిబిరానికి చేరుకున్నప్పుడు ఆమెకు ఘనస్వాగం లభించింది. మిట్టపల్లి సురేందర్ కళాబృందం సుష్మాస్వరాజ్‌ను ఆహ్వానిస్తూ, ఆమె గుణగణాలను కీర్తిస్తూ పాటిన పాటకు సభా ప్రాంగణంలోని కార్యకర్తలు చప్పట్లతో, జై తెలంగాణ నినాదాలతో స్పందించారు. [నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *