mt_logo

తెలంగాణతో…రంగారెడ్డి జిల్లా భూములు… బంగారు గనులు

ఫొటో: కెవీ రంగారెడ్డి విగ్రహావిష్కరణ అనంతరం నమస్కరిస్తున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం రూ.2 కోట్లు ఉన్న భూమి రూ.20 కోట్లు చేరుకోనుందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు నెలకొల్పుతామన్నారు. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని గుర్గావ్, నోయిడా ప్రాంతాల్లా చేవెళ్ల అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతం వ్యవసాయ భూముల సాగుకోసం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాజలాలు తీసుకొస్తామన్నారు. మహాబూబ్‌నగర్ జిల్లా కోడూరు మండలంలో 100 టీఎంసీలతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి నీళ్లు తేవొచ్చన్నారు. చేవెళ్ల ప్రాణహిత పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు పంచేందుకే మోసపూరితమైన హామీలిస్తుందన్నారు.

600 కిలోమీటర్ల ఉన్న గోదావరి జలాలు తేవడం కంటే 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణ జలాలను తేవడం సులభతరమన్నారు. జాతీయ పార్టీ అని చెపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం పట్టించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరుకే జాతీయపార్టీ అని ఆ పార్టీలో సీమాంధ్రుల పెత్తనమే కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పార్టీకి చెందిన వారు ఒక్కరు కూడా సీఎం కావడం లేదన్నారు. ప్రస్తుతం సీమాంవూధకు చెందిన వారు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్, శాసనమండలి స్పీకర్‌లు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారన్నారు. తెలంగాణ ప్రాంతం వారికి ఒక్క కీలక పదవి కూడా కట్టబెట్టడం లేదన్నారు.

రంగారెడ్డి జిల్లా మట్టిలోనే పోరాటపటిమ ఉందన్నారు. ఈ ప్రాంత వాసియైన కేవీ. రంగారెడ్డి విగ్రహం జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేయకపోవడం సీమాంధ్ర పాలకుల వివక్షకు నిదర్శనమన్నారు. ఆలాంటి మహానీయుడైన రంగారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టమని కేసీఆర్ చెప్పారు.

రంగారెడ్డి సింహంలాంటి వ్యక్తి అని కొనియాడారు. రంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉద్యమాన్ని ముందుండి నడిపేవిధంగా ఉంటాడన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి పార్లమెంట్‌లో కొండా వెంకటరంగారెడ్డి వారసునిగా, మూడోతరం వ్యక్తిగా తన వాణిని వినిపిస్తాడన్నారు.కేవీ రంగారెడ్డి తెలంగాణ ఉద్యమ జీవితాన్ని జిల్లా ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తూ వస్తున్నాడని, రంగారెడ్డి ఆశయాలన సాధించే దిశగా ప్రజలు కదిలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గులాబీజెండాను జిల్లాలో ఎగరవేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు.

పైన ఉరుములు… కింద ఉద్యమ పిడికిళ్లు బిగిస్తున్నాయి: కేకే

చేవెళ్ల సభలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకు డు కే.కేశవరావు ప్రసగించేందుకు లేచిన సమయంలోనే మేఘాలు మేఘావృతమై ఉరుములు ఉరుమడంతో పైన ఉరుములు… కింద ఉద్య మ పిడికిళ్లు బిగిస్తున్నాయంటూ చమత్కరించా రు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధన కోసం అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు. కొండా తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు కోసం కన్నకలలు రానున్న రోజుల్లో నిజం కాబోతాయన్న నమ్మకం నాలో కలుగుతుదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎంపీ వివేక్, శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్,ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, హరీశ్వర్‌డ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంగుల కమాలకర్, రాజయ్య, సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు వినోద్, చంద్రశేఖర్, మాజీ ఎంపీ జిత్తేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహ్మరెడ్డి, ప్రకాష్‌రావు, ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్, పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *