mt_logo

తెలంగాణ కలంపై కత్తి

–  అల్లం నారాయణ 

వెలికి బలయ్యాం మేము.. తెలంగాణ జర్నలిస్టులం. తెలంగాణ యాజమాన్యాలు నెలకొల్పిన మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లం. ప్రభుత్వం గుర్తింపు పొందిన అధికారిక పత్రాలు ఉన్న వాళ్లం. ప్రధాని మన్మోహన్‌సింగ్ సాక్షాత్ సర్వసత్తాక గణతంత్ర దేశానికి ప్రధాని. ఆయన జీవవైవిధ్యం కోసం హాజరైన సమావేశంలో పాల్గొనడానికి కూడా అధికారికంగా ‘పాసు’లు ఉన్న వాళ్లం. దేశదేశాల నుంచి చెట్టూ పుట్ట, సమస్త జీవరాసుల సంగతులు మాట్లాడుకుంటున్న సమావేశాల్లోకి అన్ని అనుమతులు ఉండీ ప్రవేశం దొరకక గేటు వద్ద అవమాన భారంతో మిగిలిపోయినవాళ్లం. శ్వేతజాతి దురహంకార రాజ్యాల్లో నల్లవారిలాగా, భారతదేశంలో దళితుల్లాగా మేం ఒక ప్రాంతంలో పుట్టిన వాళ్లమయినందుకు, ఈ నేల మీద ఎదిగివచ్చిన యాజమాన్యాలు పెట్టిన మీడియాలో పని చేస్తున్నందుకు వివక్షకు గురయినవాళ్లం. గాంధీని దక్షిణాఫ్రికా దురహంకారులు రైలు దించేసి అవమానించి దాదాపు వందేళ్లు గడిచిన తర్వాత, స్వతంత్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు గడిచిన తర్వాత ఏ అసమానతలు, వెలి, అవమానాలు లేని స్వతంత్ర దేశమని అంబేద్కర్ రాజ్యాంగం హామీ పడిన తర్వాత, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాలో ఉన్నప్పటికీ తెలంగాణ వాళ్లం కనుక, మేము ఇతర ప్రాంతాల మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకన్నా, ఇతర ప్రాంతాల జర్నలిస్టుల కన్నా తక్కువ వాళ్లంగా భావించిన ఆధిపత్య అహంకారంతో మమ్మల్ని వెలివేశారు. తెలంగాణ జర్నలిస్టులపై కత్తిగట్టారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జర్నలిస్టులకు చోటులేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. పత్రికాస్వేచ్ఛను, అన్ని అనుమతులున్నా జర్నలిస్టుల సంచారంపై నిషేధాన్ని, ఎన్నో కోర్టు తీర్పులలో పదే పదే చెప్పిన పత్రికా స్వేచ్ఛను, భావవూపకటనా స్వేచ్చను ఒక పోలీసు అధికారి హరించగలడని, నియంతృత్వం, నిరంకుశ ప్రభుత్వం పడగ నీడన బతుకుతున్నామని మాకు అర్థం అయింది. తెలంగాణకు వ్యతిరేకంగా శ్రీకుట్ర కమిటీ 8వ చీకటి అధ్యాయంలో రచించిన కుట్ర ప్రకారమే ఇలా జరిగిందని భావిస్తున్నాం.

అవమాన భారంతో గుండెలు మండిపోయి, మానేల మీద, మా హైదరాబాద్‌లో మేమే వెలి అయిన వాళ్లుగా తెలంగాణ సమాజంతో సంభాషిస్తున్నాం మేము. రాజ్యాంగం హామీ పడిన భావ ప్రకటనా స్వేచ్చ, పత్రికా స్వేచ్చ, కేవలం ఒక కానిస్టేబుల్ దాష్టీకం ముందు ఉత్త బోలు, పనికిరాని మాటలుగా తేలిన దిగ్భ్రాంతితో మాట్లాడుతున్నాం. నిస్సహాయులుగా మిగిలి దాష్టీకం కరకు బూట్లు కరాళ నృత్యం చేసి మా ప్రాంతంలో మమ్మల్ని వేరు చేసిన ఆధిపత్యం ముందు పట్టరాని ఆగ్రహం మమ్మల్ని నిలు దహిస్తున్నా కూడా మేము విద్వేషాన్ని మాట్లాడడంలేదు. నమస్తే తెలంగాణ పత్రికా ప్రతినిధి, ఫోటోగ్రఫర్, టీ న్యూస్, వీ6, హెచ్‌ఎమ్‌టీవీ, మున్సిఫ్ చానల్ ప్రతినిధులు, కెమెరామెన్‌ల తరఫున మాట్లాడ్తున్నాను. సీమాంధ్ర ఆధిపత్య ప్రభుత్వం.. వారి పోలీసులు మమ్మల్ని గేటు బయట ఉంచి ఒక ప్రాంతం పట్ల వారి విద్వేషాన్ని, విషాన్ని కక్కారు. అయినా మేము విద్వేషంతో మాట్లాడడంలేదు. అసలిది ప్రజాస్వామ్య దేశమేనా? ఇక్కడ మనుషులకు పౌరహక్కులున్నాయా? భావప్రకటనా స్వేచ్ఛలాంటి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులున్నాయా? ఇప్పుడు ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సి ఉన్నది.

అవును మేము దగాపడిన ఒక భూమి తెలంగాణ బిడ్డలం. తెలంగాణ ప్రతినిధులం. వివక్షను, అవమానాలను, అవహేళనలను, వనరుల దోపిడీని, జీవన విధ్వంసాన్ని అనుభవించి, పలవరిస్తున్న తెలంగాణ బిడ్డలం. నిజమే మేము ఈ భూమి పుత్రులం. ఈ భూమికోసం, నేల మీద కాలూని నిలబడ్డవాళ్లం. కానీ మేము వృత్తికారులం. జర్నలిజానికే వన్నె తెచ్చిన అన్ని ప్రాంతాల యాజమాన్యాల మీడియా సంస్థలకు సంపాదకులను అందించిన తెలంగాణ ప్రాంతంవాళ్లం. ఒక ప్రాంతం జర్నలిస్టులను వేరు చేసి, వెలివేసి, బహిష్కరించిన ఈ సందర్భాన దేశ ప్రధాని సాక్షిగా జరిగిన పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛల హననానికి జవాబు కోరుతున్నాం. ఒక ప్రాంతాన్ని విభజించారు మీరు. విద్వేషం రెచ్చగొట్టి మమ్మల్ని ప్రాంతాలుగా విడగొట్టిన మీకు ఐక్యత గురించి, సమైక్యత గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఉందా? అని అడుగుతున్నాం. ఏ చట్టాల ప్రకారం.. ఏ రాజ్యాంగ సూత్రాల ప్రకారం.. ఏ ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం.. కేవలం తెలంగాణ జర్నలిస్టులను, తెలంగాణ యాజమాన్యాల మీడియా సంస్థలను ప్రధాని సమావేశానికి హాజరు కాకుండా నిరోధించారు? సమాధానం చెప్పాల్సింది మీరు. ప్రాంతాలకు అతీతమైంది వృత్తి. మేము తెలంగాణ జర్నలిస్టులమే అయినా ఆ వృత్తిని, ఆ వృత్తి నైతికతను, ఆ వృత్తి విలువలను ప్రేమించే వాళ్లం.

అందుకే జర్నలిస్టు మిత్రులందరికీ, సంపాదకులందరికీ, మీడియా మిత్రులందరికీ ప్రాంతాలకు అతీతంగా ఒక విన్నపం. ఇది ఒక ప్రాంతం జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై జరిగిన దాడి మాత్రమే కాదు. మొత్తం పత్రికా స్వేచ్ఛమీద, భావ ప్రకటనా స్వేచ్ఛమీద భావదారివూద్యంతో కొట్టుమిట్టాడుతున్న నిరంకుశ ప్రభుత్వం చేసిన దాడి. ఇప్పుడు బాధితులం మేం. రేపు మీరు కావచ్చు. అందుకే పత్రికా స్వేచ్ఛను కాపాడుకునే వరకు ఉద్యమిద్దాం. అణచివేతలకు, వెలికి వ్యతిరేకంగా పత్రికా స్వేచ్ఛకోసం జరిగే ఉద్యమంలో కలిసిరండి. ప్రజాస్వామ్యం గురించి, తెలుగు జాతి గురించి వినసొంపుగా మాట్లాడే మేధావులారా! ఇదీ సందర్భం.. గమనించండి. ఇప్పటికైనా మాట్లాడండి.

తెలంగాణ పౌర సమాజానికి, తెలంగాణ ప్రాంతపు ప్రజా ప్రతినిధులకు పార్టీలేవైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఈ నిరంకుశ, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కలిసిరండి. ఇది జర్నలిస్టులకు మాత్రమే జరిగిన అన్యాయం కాదు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అవమానం. స్పందించండి. మేము మీ భూమి పుత్రులం. అవమాన భారంతో నిలబడ్డాం. నిర్ణయం మీదే. స్పందించండి. ‘నీవు చెబుతున్న విషయాన్ని నేను అంగీకరించకపోవచ్చు. కానీ నీకున్న మాట్లాడే హక్కును రక్షించడానికి చావడానికైనా సిద్ధం’ అన్న వోల్టేర్‌ను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ… నిరంకుశ, నియంతృత్వ పోకడలకు ఇది కాలంగాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అవమానభారంతోనూ, వెలివేయబడిన క్షోభతోనూ, ధర్మాగ్రహంలోనూ.. నిరంకుశత్వంపై, అణచివేతపై కలాలను, గళాలను ఎక్కుపెడతాం. నియంతలు మట్టికరిచారు. నిరంకుశ రాజ్యాలు ప్రజల ముందు తలవాల్చాయి. ఏలికలు ఈ చరిత్ర గుణపాఠాలను స్వీకరిస్తారో? ఫలితాలను అనుభవిస్తారో? తేల్చుకోవాల్సి ఉన్నది. మా ప్రాంతంలో మమ్మల్ని వెలి వేసిన మీ విద్వేషాన్ని నిజాయితీతో, వృత్తిబలంతో, అక్షరోద్యమంతో ఎదుర్కొంటాం. మేం మీ తాటాకు చప్పుళ్లకు భయపడం. ధిక్కరిస్తాం. పత్రికా స్వేచ్ఛ కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిటారుగా నిలబడతాం.

 

వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు
తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు
తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు
నేను కార్మిక నాయకుడిని కాదు కాబట్టి మాట్లాడలేదు
తర్వాత వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు
నేను పొటెస్టెంట్‌ను కాబట్టి మాట్లాడలేదు
చివరకు వాళ్లు నా కోసం వచ్చారు
అప్పటికి నాకోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు.

– జర్మనీలో నాజీల పాలన గురించి
మార్టిన్ నీమోల్లర్ అనే మత గురువు చెప్పిన మాటలు.

(నమస్తే తెలంగాణ నుండి )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *