mt_logo

తెలంగాణ ఓ న్యాయమైన డిమాండ్

By: – నాగేందర్ చిందం

జనవరి 28వ తేదీలోగా తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటన తెలంగాణ ప్రజల్లో ఆశలను ద్విగుణీకృతం చేసింది. తెలంగాణపై కేంద్రం అనుకూలమైన నిర్ణయం ప్రకటిస్తుందని ఆశించారు. ఆ రకంగా ఇది చారిత్రకమైన మాసం అయి ఉండేది.

దురదృష్టవశాత్తు మంత్రులతో సహా సీమాంధ్ర నాయకులు, శాసనసభ్యులు సమైక్యాంధ్ర కోసం భేటీలకు, లాబీయింగుకు పూనుకున్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి బదులు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని సూచిస్తున్నారు. 1969లోనూ 2009లోనూ ఇచ్చిన హామీలు, రక్షణలు తెలంగాణకు సంబంధించి అమలుకాలేదు. అందువల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవేవీ తీర్చలేకపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అంతిమ పరిష్కారంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ రాజధానిగా 1956 వరకు తెలంగాణ విడిగానే ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుని 1956లో తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్రావతరణ జరిగిన వెంటనే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం ప్రారంభించారు. ఉల్లంఘనలకు గురైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి..

1. ప్రాంతీయ స్టాండింగ్ కమిటీ
2. హైదరాబాద్ ముల్కీ నిబంధనలను
3. దామాషా ప్రకారం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు నిధుల పంపిణీ
4. మంత్రివర్గ కూర్పు

ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంతో 1969లో పెద్ద యెత్తున ఉద్యమం తలెత్తింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా, ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ప్రాణాలర్పించారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి బదులు కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఉదాహరణకు – జలాల పంపకంలో, ఉద్యోగావకాశాల్లో న్యాయబద్దమైన వాటాను ఇవ్వడం. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఉల్లంఘించారు. అమలుకు నోచుకోని హామీలు ఈ విధంగా ఉన్నాయి.

1. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు.
2. ఆరు సూత్రాల పథకం (1973)
3. 371 -డి ఆర్టికల్ కు 32వ రాజ్యాంగ సవరణ
4. ఎపి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రాష్ట్రపతి ఉత్తర్వులు

వాటితో పాటు పలు హామీల ఉల్లంఘన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంతానికి నదీజలాలు రావని కొంత మంది నాయకులు వాదిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు. రాష్ట్ర విభజన ద్వారా మాత్రమే నదీజలాల పంపకం న్యాయబద్ధంగా జరుగుతుందనేది ప్రస్తుత పరిస్థితి తెలియజేస్తోంది.

హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొంత మంది నాయకులు అంటున్నారు. కానీ, అది సాధ్యమయ్యేది కాదు. అది పూర్తిగా అర్థం లేని వాదన. రాజ్యాంగం ప్రకారం హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. హైదరాబాదు కూడా బొంబాయి, బెంగుళూర్ వంటి మెట్రోపాలిటన్ నగరమే. అది తెలంగాణకు ఉత్తమమైన రాజధాని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది.

రాష్ట్ర విభజన వల్ల జరగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇరు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని, కొత్త మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల పెంపు వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

రాష్ట్ర విభజన చేసి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత విశాఖప్టనం లేదా విజయవాడ భారతదేశంలోని మరో ఆధునిక, అభివృద్ధి చెందిన నగరంగా రూపుదిద్దుకుంటుంది. తద్వారా దక్షిణ భారతందేశంలో మరో ఆధునిక నగరం విలసిల్లుతుంది. కొత్త రాజధాని పారిశ్రామికంగా, ఇతరత్రా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *