mt_logo

తెలంగాణలో దయనీయ స్థితిలో కాంగ్రెస్, తెదేపాలు


కార్టూనిస్ట్: శంకర్

***
ఉప ఎన్నికల ఫలితాలు ఇంకా రాలేదు. కానీ ఎక్జిట్ పోల్స్ ను బట్టి, వివిధ రాజకీయ పార్టీల నాయకుల విశ్లేషణలను బట్టి చూస్తే అటు సీమాంధ్రలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

వందేళ్లకు పైబడిన చరిత్ర ఉండి, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెసుకు, మూడుపదుల వయసు ఉండి, పదిహేనేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రాంతంలో ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి.

పరకాలలో కాంగ్రెస్ అభ్యర్ధి సమ్మారావుకు, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డికి నాలుగు, అయిదు స్థానాలు దక్కనున్నాయనే వార్తలు తెలంగాణలో ఆ రెండు పార్టీలు ఎంత దిగజారిపోయాయో సూచిస్తున్నాయి.

మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ ఎన్నికలో తెలంగాణవాదంపై అటు తెరాస, ఇటు భాజపా రెండు పార్టీలు తలపడ్డా, కాంగ్రెస్, తెదేపాలు మూడు, నాలుగు స్థానాల్లోనే వచ్చాయి. ఒకరినొకరు కాపాడుకుందామని గత ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగుకు పాల్పడినా ఈ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించారు ప్రజలు.

ఇక ఇప్పుడు పరకాలలో తెలంగాణలో పెద్దగా బలమూ బలగమూ లేని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, భాజపా కన్నా కూడా వెనుక నిలబడే దుస్థితికి దిగజారాయి. ఈ పరిస్థితికి కారణం తెలుసుకోవడం పెద్దగా కష్టమేమీ కాదు. డిసెంబర్ 9, 2009 ప్రకటన దరిమిలా ఈ రెండు పార్టీలు వ్యవహరించిన తీరును తెలంగాణ ప్రాంత ప్రజలు అసహ్యించుకోవడమే దీనికి కారణం.

రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ తెలుగుదేశం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే కాంగ్రెస్ పార్టీలంటేనే తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రజాగ్రహానికి మాడి మసి అవుతామేమో అని ఈ రెండు పార్టీల్లోని ఎం.ఎల్.యేలు. ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు వణికిపోతున్నారు. పర్యవసానంగానే ఈ రెండు పార్టీల్లోంచి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే తెలుగుదేశంలోంచి చెన్నమనేని రమేశ్ (వేములవాడ) , పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్స్ వాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి), జోగు రామన్న (ఆదిలాబాద్), నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూల్) బయటికి రాగా, జూపల్లి కృష్ణా రావు (కొల్లాపూర్), డాక్టర్ రాజయ్య ( స్టేషన్ ఘన్ పూర్), సోమారపు సత్య నారాయణ (రామగుండం) కాంగ్రెస్ పార్టీని వీడారు.

తెదేపా ఎం.ఎల్.యేలు వేణుగోపాలా చారి, హరీశ్వర రెడ్డి ఇప్పటికే పార్టికి దూరం ఉంటుండగా, కాంగ్రెస్ లో కోమటిరెడ్డి సోదరులు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తిరుగుబాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రేపు ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇంకా అనేక మంది కాంగ్రెస్, తెదేపా శాసనసభ్యులు, ఎంపీలు తమతమ పార్టీలకు రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. వెరసి మాట తప్పిన పాపానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *