mt_logo

సింగినాదం.. జీలకర్ర!

By: సవాల్ రెడ్డి

అద్దెకు తెచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా? అని పాతకాలం సామెత.. ఈ మధ్య రాధాకృష్ణకు తనకు శక్తి చాలక అద్దె గుర్రాలను తోడు తెచ్చుకున్నట్టు కనిపిస్తున్నది. తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు గానీ కాస్త పరిగెత్తే గుర్రాలనన్నా తెచ్చుకోవాల్సింది.. ఔట్ డేటెడ్ గుర్రాలతో అయ్యేది పొయ్యేది ఏముంటుంది?

పరాపవాదేనాత్మోత్కర్షం మన్యతే నీచః..
ఖలుడు ఇతరులను గురించి చెడ్డగా చెప్పడం ద్వారా తనకేదో గొప్పతనం వస్తుందనుకుంటాడు.
– సోమదేవుని నీతివాక్యామృతం
గతంలో ఎలాఉన్నా గత ఒకటి రెండు దశాబ్దాలుగా సీమాంధ్ర మీడియా వ్యక్తిత్వ హననం అనే ఏకైక కార్యక్రమాన్ని అమలుచేస్తూ వస్తున్నది. మనకు చెప్పుకోవడానికి ఏం లేనపుడు ఎదుటివాడి మీద బురద చల్లటం అనేది ఇందులో సూత్రం. ఈ కళలో నోబెల్ బహుమతి అందుకోదగిన పాత్రికేయుడు ఎవరన్నా ఉన్నాడంటే అది రాధాకృష్ణ ఒక్కడే అని ఖాయంగా చెప్పవచ్చు. బట్టకాల్చి మీద వేయటంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండరు. దాన్ని దమ్ము, దగ్గు, పడిశెం అంటూ గొప్పగా కూడా చెప్పుకోగలరు.

తాజా కొత్తపలుకు చూడండి. అయిపోయింది.. కేసీఆర్ ఏడాదిన్నరకే ప్రజావ్యతిరేకి అయిపోయాడు. ప్రజలకు ఆయన నిజస్వరూపం తెలిసిపోయింది. సెంటిమెంటు పటాపంచలైంది. భ్రమలు కూడా తునాతునకలయ్యాయి. మేధావులు విస్తుపోతున్నారు. టీఆర్‌ఎస్ వాళ్లు మాకు క్యాంపు ఆఫీసులో కాఫీలు ఇవ్వట్లేదు అని కంటికీ మంటికీ ధారగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే పాపం రాధాకృష్ణే వాళ్ల కన్నీళ్లు తుడిచి కాఫీలు అవీ ఇప్పిస్తున్నాడు. రాధాకృష్ణే చెప్పిన జానా బెత్తెడు జానారెడ్డి కూడా తల తిప్పేశారు. కోదండరాం తన పదవీ విరమణతో పాటు కేసీఆర్ మీద విశ్వాసాన్ని కూడా విరమించుకున్నారు.. అంతేనా? పుష్కర కాలం పోరాడి ముచ్చట పడి తెచ్చుకున్న తెలంగాణ ఏడాదిలోనే అయిపోయింది. తెలంగాణ సమాజపు స్వప్నం అపుడే చెదిరిపోయింది..వగైరా వగైరా.. అంతా సింగినాదం.. జీలకర్ర!

పొరుగింటి కలహం వినవేడుక అని సామెత. రాధాకృష్ణ ప్రస్తుతం ఆ వేడుకల్లో మునిగి తేలుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ క్రమంలో కడుపులో ఉన్నదంతా కక్కేశాడు రాధాకృష్ణ. తెలంగాణ తెచ్చుకుంటారా?… మా బాగా అయ్యింది అనటం తప్ప అన్నీ అనేశాడు. కేసీఆర్ ఎవరి మాట వినరు. అహం బ్రహ్మస్మి అంటారు.. అనేది రాధాకృష్ణ అభ్యంతరం. అణువణువునా అహంకారం జీర్ణించుకున్న వారికి పరాజయం తప్పదు అని శపించాడు కూడా. చలిచీమల చేత అంటూ ఓ పద్యం కూడా పాడాడు.

రాధాక్రిష్ణో, మరొకరో ఇలా కేసీఆర్ మీద నియంత ముద్ర వేయటం ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. టీఆర్‌ఎస్ స్థాపించి పుంజుకున్నప్పటి నుంచీ దాడి సాగుతూనే ఉంది. నాకొచ్చిన సమస్యే అది. మాది పంచకూట కషాయం. ఒక్కొక్కళ్లదీ ఒక్కో ఆలోచన. బట్ ఎవ్రీబడీ ఎక్స్‌పెక్ట్స్ మై యాక్షన్ ఆర్ మై వర్డ్స్ ఆర్ మై డెసిషన్…ఇన్ దేర్ ఓన్ ఆంగిల్.. విచ్ ఈజ్ జస్ట్ ఇంపాసిబుల్ ఫర్ కేసీఆర్. వాళ్లు చెప్పినవన్నీ వినాలంటే నేను సర్కస్ అయిపోత. లిటరల్లీ ఐ విల్ బికమ్ ఏ సర్కస్. వినకపోతే క్రిటిసిజమ్. భిన్న ధృవాలతో పనిచేసే క్రమంలో డెఫినెట్‌గ నా మీద క్రిటిసిజమ్ వస్తది. అది నియంత అనే కావచ్చు. వ్యక్తి కేంద్ర విధానం అనే కావచ్చు అని ఆయనే అనేకసార్లు చెప్పారు.

కొత్తపలుకులో పరిచిన అబద్ధాలకు అంతూ పొంతూ లేదు. ఇతరుల అభిప్రాయాలు నేను వినటం ఏమిటి? అని కేసీఆర్ అంటారని.. ఒకేసారి మాఫీ సాధ్యపడదని ప్రతిపక్షాలకు నచ్చచెప్పి ఉండాల్సిందనే తీర్పుతో మొదలుపెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలమీద రెండు రోజులు జరిగిన చర్చను చూసిన వారెవరన్నా దీన్ని ఒప్పుకుంటారా? ప్రతిపక్షాలు నచ్చచెబితే వినే విధంగానే ప్రవర్తించాయా? అసెంబ్లీ లోపలా బయట మీడియా పాయింట్ వద్ద.. కాంగ్రెస్ టీడీపీ భీషణ ప్రతిజ్ఞలేమిటో ఆలకించే ఇది రాశారా? చెప్పాల్సిన పనిలేదు. రాధాకృష్ణ ఉద్దేశమేమిటో అర్థమవుతూనే ఉంది.

యద్భావం తద్భవతి అని.. రాధాకృష్ణకు తెలంగాణలో చెదిరిపోతున్న స్వప్నాలు కనిపిస్తూ ఉండవచ్చు… ఏడాదిన్నరకే భ్రమలు పోతున్నట్టూ కనిపించ వచ్చు. కానీ ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. ఒకనాటి మీడియా వార్తల వెల్లువలో కొట్టుకుపోయే తెలంగాణ ఇపుడు లేదు. ఎవడు ఏ వార్త ఎందుకు రాస్తున్నాడో, ఏ నాయకుడు ఎందుకు బట్టలు చింపుకుంటున్నాడో వారికి తెలుసు. తెలంగాణ వచ్చి ఏం సాధించింది? అంటాడు రాధాకృష్ణ. కానీ ఏం సాధించిందో ప్రజలకు తెలుసు. వారి అనుభవంలోకి వచ్చిన అనుభూతులకు తెలుసు. అరవై ఏండ్ల ఆంధ్ర దరిద్రం వదలడం వారికి అనుభవంలోకి వచ్చింది. గత రెండు తరాలు తమ జీవితంలో ఏనాడూ కనివిని ఎరుగని విధంగా వేల సంఖ్యలో వస్తున్న ఉద్యోగ ప్రకటనలు చూసి తెలంగాణ వచ్చి ఏం సాధించిందో అర్థం చేసుకుంటున్నారు. ఉద్యోగులు పోరాటాల ఫలితంలోని ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. దసరా పండుగ ముందు రోజు ఊరుకి, మరుసటి రోజు డ్యూటీకి అంటూ ఆపసోపాలు పడే కాలంలో ఎంత దరిద్రంగా గడిపామో నెమరు వేసుకుంటున్నారు. మారుమూల పల్లెలో పుట్టిన దళిత బిడ్డ ఇవాళ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ చైర్మన్ కావడాన్ని చూస్తున్నారు. చెప్రాసి పోస్టుతో జీవితం ప్రారంభించి చట్ట సభల అధ్యక్షుడుగా సగర్వంగా కూర్చున్న తెలంగాణ బిడ్డను చూస్తున్నారు. దొరల పశువుల కసువు తీసిన పాటగాడు క్యాబినెట్ స్థాయికి ఎదగడాన్ని చూస్తున్నారు.

కృష్ణ, గోదావరి అంటే ఏమిటో తెలియని వాళ్లు ఇవాళ ఆ నదిలో టీఎంసీలను క్యూసెక్కులను, వాటిని మళ్లించే భగీరథ యత్నాలను చూస్తూ తెలంగాణ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బంగారు భవిష్యత్తు మీద చెదరని నమ్మకంతో ఉన్నారు. ఉంటాయి.. కష్టాలు ఉంటాయి. సుఖాలు ఉంటాయి. రైతు ఆత్మహత్యలు అనే విషాదం వారికీ ఉంది. అంత మాత్రాన వర్షాభావానికి ప్రభుత్వ బాధ్యత ఉందో లేదో తెలియని మూర్ఖులా ప్రజలు. ఆ ఒక్క సమస్య అడ్డం పెట్టి ఏదో చేద్దామని రాధాకృష్ణ ఆయన గ్యాంగులు భావిస్తే మూర్ఖత్వమే అవుతుంది.

-ఇవేం ఇగోలు?..
పాత్రికేయుల రిపోర్టు సరిగ్గా ఉందో లేదో తెలియదుగానీ ఓ పత్రికలో కేసీఆర్ ప్రతిపక్షాలను ప్రజాసంఘాలను లెక్క చేయనందువల్లనే బంద్ నిర్వహించాల్సి వచ్చిందని ఓ మేధావి అన్నట్టు వార్త వచ్చింది. కొందరు తమను లెక్కచేయనందువల్ల బంద్‌లను తీసుకువచ్చి ప్రజలపై రుద్దడం ఏమేరకు సబబో అర్థం కాదు. దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటారో తెలియదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎవరి ఇగోలనో సంతృప్తిపరచడానికో నడవవు. ప్రజల ఆశయాల మేరకు నడుస్తాయి. ఆయా ప్రభుత్వాలు నడిపే పార్టీలు తాము ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు అందుబాటులో ఉన్న వనరుల మేరకు పని చేస్తాయి. ఎవరికైనా అంత ఇగోలు ఉంటే ఇంట్లో సిలక్కొయ్యకు తగిలించుకోవాలి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని కొందరి ఇగోలకు బలికావలిన దుస్థితి రాకూడదు. ఆ మాటకు వస్తే టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో శ్రేయోభిలాషులున్నారు. ఉద్యమంతో పాటు గత ఎన్నికల్లో సైతం వాళ్లు జేబుల్లో డబ్బులు పెట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు.

అయినా వాళ్లెవరూ ప్రభుత్వంనుంచి ప్రయోజనాలు ఆశించలేదు. తమకేదో ఎర్రతీవాచీలు పరిచి ఆహ్వానాలు పలకాలని కోరుకో లేదు. మేమిచ్చే సలహాలే పాటించాలి అని కూడా అనుకోవటం లేదు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆ శ్రేయోభిలాషులే తప్ప ఈ మేధో వర్గమేదీ బహిరంగంగా ప్రచారంలో పాల్గొనలేదు. అలాగని అలా చేయటం తప్పేం కాదు. ఎవరి పరిధులు వారికి ఉంటాయి. అర్థం చేసుకోవచ్చు. అయితే కేసీఆర్ స్వయంగా ఓ ఆలోచనాపరుడు. తన మార్గం మీద తనకంటూ స్పష్టత ఉన్నవాడు. సుదీర్ఘకాలంలో ప్రజాజీవితంలో ఉన్నవాడు. ప్రజల నాడి తెలిసిన వాడు. దానికితోడు అనేక అంశాలమీద పరిజ్ఞానం.. ఉద్యమ సమయంలో పలువురు మేధావులతో కలసి జరిపిన చర్చలు విశ్లేషణల తాలూకు అవగాహన ఉన్నవాడు. ఆయనకో రోడ్ మ్యాప్ ఉంది. ఒంటి చేత్తో పార్టీని గెలిపించుకున్న ఆయనకు తన రోడ్‌మ్యాప్‌ను అమలు పరుచుకునే స్వాతంత్య్రం ఉంది. ఆయన స్వాతంత్య్రాన్ని భంగపరచకండి.

-అద్దె గుర్రాలు…
అద్దెకు తెచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా? అని పాతకాలం సామెత… ఈ మధ్య రాధాకృష్ణకు తనకు శక్తి చాలక అద్దె గుర్రాలను తోడు తెచ్చుకున్నట్టు కనిపిస్తున్నది. తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు గానీ కాస్త పరిగెత్తే గుర్రాలనన్నా తెచ్చుకోవాల్సింది.. ఔట్ డేటెడ్ గుర్రాలతో అయ్యేది పొయ్యేది ఏముంటుంది. ఏమైనా పుట్ట కదిలి చీమలు వెలికి వస్తున్నట్టు ఒక్కరొక్కరే బయటపడుతున్నారు. సీమాంధ్ర నెట్‌వర్క్ ఎలా ఉంటుందో, అన్ని మర్యాదలు పక్కనబెట్టి పరస్పర ప్రయోజనాలను ఎలా పరిరక్షించుకుంటారో నగ్నంగా బహిరంగ పడుతున్నది. ఇక్కడ విషయం ఏముంది? ఒక పత్రికో.. పత్రికాధిపతో ఏదో రాశాడు. దానిపై అభ్యంతరం ఉన్న వాళ్లు మరో పత్రికలో రాస్తున్నారు. అది వారి వారి సమస్య. మధ్యలో రాజకీయ పాత్రికేయులకు ఎందుకంత దురద? సదరు పత్రికాధిపతిని విమర్శిస్తే వీరు గిలగిలలాడి పోవడం ఎందుకు? మధ్యలో దూరి సరుకు గిరుకు అంటూ దురంహంకార ప్రదర్శనలెందుకు? వానప్రస్తాశ్రమానికి నారచీరెలు సిద్ధపరుచుకుంటున్న వారి మీద పరుష వ్యాఖ్యలకు దిగడం సబబు అవునో కాదోనన్న మీమాంస కొంత వెనక్కి లాగినా సరుకు అంటూ వెక్కిరించే స్థాయికి వాచాలత విస్తరించాక ఇంక మర్యాదేమిటి.. మన్నన ఏమిటి?

సరుకు లేదులేదంటూనే ఓ పావుపేజీ నిండా నిందలు, నిష్ఠూరాలు మోపడానికి బదులు ఏ సైద్ధాంతిక ప్రాతిపదికన రాధాకృష్ణ అంగరక్షకత్వ బాధ్యత తీసుకున్నారో కాస్త వివరించి ఉంటే బాగుండేది. సరుకుందో లేదో ఎవరికి వారే వీరతాళ్లు వేసుకుంటే ఎట్లా? అది పాఠకులు చెప్పాలి. పత్రికలో మన కాలమ్ కనపడగానే ఎగబడి చదువుతున్నారా? పేజీ తిప్పేస్తున్నారా ..టీవీలో మన ముఖం కనిపించగానే ప్రేక్షకుడు ఎగబడి చూస్తున్నాడా? ఠక్కున చానెల్ మార్చేస్తున్నాడా మనకేం తెలుసు? జెండాలు, నెట్‌వర్క్‌లతో టీవీ స్టూడియోల్లో సీట్ల మీద దస్తీలు వేసుకోవచ్చుగానీ.. ప్రేక్షకుడితో బలవంతంగా చూపించలేం కదా! సీపీఎం తెలంగాణ మీద విధానపరమైన నిర్ణయం తీసుకుందట.. కట్టుబడి ఉందట. విధానపర నిర్ణయమంటే ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వారిమీద దాడులు చేయడమా? ఇక్కడ 1969లోనే కాదు.. అక్కడ జై ఆంధ్ర ఉద్యమ సమయంలో అక్కడా లాఠీ దండులతో దాడులు చేశారు కదా? దాన్నే దృష్టితో చూడాలి? మలిదశ ఉద్యమంలో ఓ వైపు తెలంగాణ యువత బలిదానాలు చేసుకుంటున్న కాలంలోనూ టీవీ స్టూడియోల్లో కూర్చుని తెలంగాణ రాదండీ అంటూ మీరు చేసిన ప్రచారాలనేమనాలి? వందలమంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డపుడు ఒక్క కన్నీటి చుక్కా రాల్చని పార్టీలకు, వాటి పరివ్రాజకులకు ఇవాళ రాధాకృష్ణల మీద.. రైతుల మీద మాత్రం ఎక్కడలేని ప్రేమలు పుట్టుకు రావడం వెనుక ఏముందో ఎవరికి తెలియదుకుంటే ఎలాగా. మీరు చచ్చి గీ పెట్టినా తెలంగాణకు సంబంధించి మీ చరిత్ర ముగిసిపోయిన అధ్యాయం.

జెండాలు, నెట్‌వర్క్‌లు, పైరవీలతో ఎడిట్ పేజీల కాలమ్‌లు, టీవీ స్టూడియోల్లో సీట్లు మేనేజ్ చేసుకుని తెల్లారిలేస్తే ధర్మపన్నాలు చెప్పుకునే నాటకాలు దశాబ్దాలుగా సాగించారు. యూనియన్లను గుప్పిట్లో పెట్టుకుని మేనేజ్‌మెంట్లతో మ్యాచ్‌ఫిక్సింగ్ డ్రామాలు ఆడారు. పోటీ యూనియన్ల పీకలు నొక్కారు. ఇంకా అవే అవే డ్రామాలు కొనసాగిస్తాం అనుకుంటే చెల్లదు. మీ సింగినాదం జీలకర్రలకు కాలం చెల్లింది. తెలంగాణ ఇపుడు మేల్కొన్న బెబ్బులి. వీధికో వీర తెలంగాణ వాది ఉన్నాడు. వాళ్లంతా రాయటం మొదలు పెడితే..మనసు పెట్టి మాట్లాడడం మొదలు పెడితే.. తట్టుకోవడానికి మీ తాతలు దిగిరావాలి!
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *