[జనం సాక్షి సౌజన్యంతో]
తెలుగువాళ్లకు రెండు రాష్ట్రాలు కావాలని, రెండు వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ మాకొద్దని సీమాంధ్ర ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ‘రాష్ట్ర విభజను ఆహ్వానిద్దాం-ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య శాంతి, సుహృద్భావాన్ని కాపాడుకుందాం, మూడు ప్రాంతాల ప్రజల అభివృద్ధికి కృషి చేద్దాం, వినాశకర, విధ్వంసర స్వార్థ రాజకీయ ఎత్తుగడలను తిప్పికొడుదాం’ అనే రాజకీయ ప్రకటనతో సీమాంధ్ర డెవలప్‌మెంట్ ఫోరమ్, ఆంధ్ర జర్నలిస్టు ఫోరం, బహుజన కెరటాలు, కావడి కుండలు, మట్టిపూలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రచయిత్రుల వేదిక, హర్యాలీ ముస్లిం రచయితల వేదిక, సావిత్రీబాయిపూలే అధ్యయన వేదిక, హైదరాబాద్ ఫోరమ్ ఫర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ వంద మంది సభ్యులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడాలి. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సామాన్య ప్రజల అవసరాలు, ఆకాంక్షల కేంద్రంగా జరగాలి. పార్లమెంట్‌లో వెంటనే బిల్లు ప్రవేవపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను ఆహ్వానిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రజల, ప్రాంతాల అభివృద్ధి, హక్కులపై పనిచేస్తున్న దళిత బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజాసంఘాల గొంతుకలను, బయటకు రాకుండా ఆపుతున్న ప్రయత్నాలను, దానికి పోలీసులు, మీడియా సహకారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో మీడియా పది శాతం ప్రజల ఆందోళనలని మాత్రమే పెద్దగా చూపుతూ 90 శాతం ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించట్లేదు. ప్రజల అభిప్రాయాన్ని ప్రజాస్వామికంగా ప్రతిబింబించాలి. రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర విభజనపై తాము ప్రకటించిన వైఖరికి కట్టుబడి విభజన ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహరించాలని కోరారు. ప్రజల్లో అనేక అపోహలకు దారితీస్తున్న విద్యావకాశాలు, ఉద్యోగాలు, జల వనరులు, రాజధానులపై అపోహలు తొలగించి సహజ న్యాయం జరిపించడానికి రాయలసీమ, తెలంగాణ, కోస్తా ప్రాంతాల నుంచి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తెలంగాణలోనూ, హైదరాబాద్‌లోనూ ఎన్నో దశాబ్దాల నుంచి నివశిస్తున్న రాయలసీమ, ఆంధ్ర ప్రజలలో అనవసర భయాలను రేకెత్తించే నాయకులు ప్రకటనలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడే రాజధానిలో విద్యా, ఉద్యోగ, పరిశ్రమల వికేంద్రీకరణ జరిగేలా నిర్ణయం తీసుకోవాలి. రాజధానిని అత్యంత త్వరగా ప్రకటించి నిధులు విడుదల చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశానికి కొనసాగింపుగా ఈనెల 23న విజయవాడలో మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రాయలసీమ, తెలంగాణ ప్రజాసంఘాల సమన్వయ కమిటీగా వివిధ ప్రాంతాల్లో ఈ చర్చ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తాగి కొట్టుకొని చనిపోయిన వాళ్లు సమైక్యాంధ్ర కోసం బలిదానాలు చేసుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం తొలి కోడికూత లాంటి సహజమైనదైతే, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అలారం మోతలాంటి కృత్రిమమైనదని పేర్కొన్నారు. కుటుంబంగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని పిలపునిచ్చారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి సీఎం కిరణే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ధి కలుగుతుందని తెలిపారు. సమావేశంలో పల్నాటి శ్రీరాములు, కాట్రగడ్డ ప్రసన్న, పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, విద్యాసాగర్‌రావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ భూమన్, ప్రొఫెసర్ పవన్, సాంబశివరావు, నందిని సిధారెడ్డి, పులి కవిత తదితరులు పాల్గొన్నారు.