mt_logo

టీ జేఏసీపై కక్షగట్టిన సీమాంధ్ర మీడియా

హైదరాబాద్, ఆగస్టు 17 (టీ మీడియా):‘ తెలంగాణ ఉద్యమంపై ఓ వర్గం మీడియా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. అప్రజాస్వామికంగా పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నది. టీ జేఏసీని శల్యపరీక్ష చేస్తున్నది. తెలంగాణ ప్రజల మనోభావాలను అల్లకల్లోలం చేస్తూ.. ప్రతి విషయంలో గందరగోళం సృష్టిస్తూ వికృతానందాన్ని అనుభవిస్తున్నారు’అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విరుచుకుపడ్డారు. అవాస్తవ, నిరాధార, నిర్హేతుక కథనాలు రాస్తూ టీ జేఏసీ నాయకుల్లో విభేదాలు, విద్వేషాలు పెంచేలా కుటిలయత్నాలు చేస్తున్నారని, మీడియా వైఖరి బాధాకరమని.. ఖండనార్హమని పేర్కొన్నారు. మీడియా భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూనే, ప్రజాస్వామ్య సంప్రదాయ విలువలను అంగీకరిస్తూనే, ప్రతీ మాటను ఆచితూచి ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం తర్వాత కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. బాధతో, ఆగ్రహంతో సీమాంధ్ర మీడియా వైఖరిని విమర్శించారు.

తన సహజశైలికి భిన్నంగా కాసేపు అనునయిస్తూ, మరికాసేపు కోపాన్ని ప్రదర్శిస్తూ సీమాంధ్ర మీడియా వైఖరిని కడిగిపారేశారు. ‘టీ జేఏసీలో విస్తృతంగా చర్చించాక.. ఎన్‌టీవీ వ్యవహరిస్తున్న తీరును నిశితంగా పరిశీలించిన తర్వాతనే ఆ చానల్‌పై నిషేధాన్ని విధించాం. తెలంగాణ ప్రజలను అవహేళన చేసే.. అవమానపరిచే చానల్‌ను బహిష్కరించే హక్కు తెలంగాణ ప్రజలకు ఉంటుంది’ అని స్పష్టం చేశారు. సీమాంధ్ర చానళ్లు, పత్రికలు ఇదే వైఖరితో వ్యవహరిస్తున్నాయని ధుమధుమలాడారు.

నిష్పక్షపాతంగా, వాస్తవం కత్తి అంచుల నుంచి బాధ్యతాయుతంగా ప్రజలకు వార్తలు, కథనాలను ప్రచురించాల్సిన మీడియా తప్పుడు ధోరణితో గాడితప్పడాన్ని ఖండిస్తున్నామని జేఏసీ చైర్మన్ విస్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షయే ఏకైక ఎజెండాగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునాదుల మీద ఏర్పడిన జేఏసీనిపై ఆధారాలు లేని, సత్యదూరమైన వార్తాకథనాలు రాస్తూ జేఏసీ నాయకులను, ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీ జేఏసీ నిర్ణయాలు, క్రమశిక్షణ, ఆలోచనకు భిన్నంగా వ్యవహరిస్తే, కోదండరాంను కూడా జేఏసీ చీల్చి చెండాడుతుందన్న క్రమశిక్షణా నిబంధనల గురించి మీడియాకు తెలియకపోవడం విచారకరమని అసహనం ప్రకటించారు.

‘పార్లమెంటులోతెలంగాణ బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో వారం రోజులుగా, తెలంగాణవ్యాప్తంగా శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో, సంఘటితంగా సద్భావనా శాంతి ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్షికమాలను ఒక్క టీవీ చానల్ కూడా చూపించడం లేదు. అదే సమయంలో సీమాంధ్ర సమైక్య కృత్రిమ ఉద్యమాన్ని మాత్రం ఉవ్వెతున ఎగిసిపడుతున్నట్లుగా చిత్రీకరిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. ఇది ఏ ప్రజాస్వామ్య విలువల సంప్రదాయమని.. సీమాంధ్ర మీడియాని తూర్పారపట్టారు. ‘సీమాంధ్ర ఉద్యమంలో 11 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనడం లేదు. ఈ వాస్తవాన్ని ఏ మీడియా కూడా రాయలేదు.

తెలంగాణ ఉద్యమంలో ఏ చిన్న దురదృష్టకర సంఘటన జరిగినా.. దానిని భూతద్దంలో చూపించి రాక్షసానందాన్ని అనుభవించారు’ అని ఘాటుగా విమర్శించారు. జేఏసీపై వార్తాకథనాలు రాసే సందర్భంలో జేఏసీ బాధ్యుల అభివూపాయాలను విధిగా ప్రచురించాలని, ఈ కనీస బాధ్యతను విస్మరించవద్దని హితవు చెప్పారు. ‘సంస్థాగతంగానే కొన్ని సీమాంధ్ర చానళ్లు తెలంగాణ ప్రజల సంఘటిత ప్రజాస్వామిక ఉద్యమంపై విషం కుమ్మరిస్తున్నాయి. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్హేతుక వార్తాకథనాలకు బాధ్యులు కారని తాము నమ్ముతున్నాము’ అని పేర్కొన్నారు.

ఆహ్వానం వస్తేనే సంప్రదింపులు

‘టీ జేఏసీ చైర్మన్ హోదాలో కోదండరాం సోనియాగాంధీతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కోదండరాం కాంగ్రెస్‌లో కలుస్తున్నారా? లేదా జేఏసీ నాయకత్వంలో ఆంటోనీ కమిటీని కలుస్తున్నారా?’ అంటూ విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ ప్రతీ ప్రశ్నకు కోదండరాం స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ‘సోనియాగాంధీ, ఆంటోనీ కమిటీల నుంచి ఆహ్వానం వస్తేనే వారితో సంప్రదింపులు జరుపుతాం. జేఏసీ ప్రత్యేకంగా వారిని కలిసేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. ఇది టీ జేఏసీ నిశ్చితాభిప్రాయం. దీనిపై అసత్య వార్తాకథనాలను రాసి తెలంగాణ ప్రజలను గందరగోళ పరచవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. సోనియాగాంధీకి విజ్ఞాపన పంపించిన మాట వాస్తవమేనని ఈ విషయాన్ని చాలాసార్లు మీడియాలో ప్రకటించామని ఆయన చెప్పారు. సోనియాగాంధీ నుంచి ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తామని వివరించారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *