mt_logo

సమైక్య అరాచకం!

నమస్తే తెలంగాణ ఆత్మీయ రథంపై విరుచుకుపాటు…
వత్తాసు పలికిన ట్రాఫిక్ పోలీసు
సిబ్బందిని చితకబాదిన దుండగులు …
వ్యాను ధ్వంసం.. వేల ప్రతుల దహనం

నాలుగు రోజులుగా కోస్తాంధ్రలో దిగ్విజయంగా సాగుతున్న నమస్తే తెలంగాణ ఆత్మీయ యాత్రపై తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కొందరు సమైక్యవాదుల ప్రేరణతో అల్లరిమూకలు దాడి చేశాయి. పాత్రికేయులను చితకబాదిన దుండగులు.. వాహనం డ్రైవర్లపైనా దాడికి దిగారు. నమస్తే తెలంగాణ ఆత్మీయ రథాన్ని కొంతదూరం తీసుకు ధ్వంసం చేశారు. ‘విభజన వికాసానికే’ శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రచురించిన ప్రత్యేక సంచిక వేల ప్రతులను దహనం చేశారు. గత నాలుగు రోజులుగా నమస్తే తెలంగాణ రథం సీమాంధ్రలో పర్యటిస్తూ.. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి కలిగే లాభాలను వివరిస్తూ ప్రజల ఆదరణ చూరగొంటున్నది. వారితో అభిప్రాయాలను పంచుకుంటున్నది. కృష్ణా జిల్లాలో పోలీసు ఓవర్ యాక్షన్, పశ్చిమగోదావరి జిల్లాల్లో చిన్నాపాటి ఘటనలు ఉన్నా.. ముందుకే కదిలిన రథానికి ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది. తాము సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నామని అభిప్రాయాలు చెప్పినవారూ ఉన్నారు. విడిపోతే తమకు అధిక లాభాలు ఉన్నాయని అంగీకరించినవారూ ఉన్నారు.

అనేక అభిప్రాయాలను ప్రోదిచేస్తూ సుహృద్భావ వాతావరణంలోనే ఇప్పటిదాకా యాత్ర సాగుతూ వచ్చింది. ఇదే స్ఫూర్తితో మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. ఉదయం రాజోలు నుంచి బయల్దేరిన ఆత్మీయ యాత్ర.. పదిన్నర గంటల సమయంలో అమలాపురం చేరుకుంది. ఆత్మీయ యాత్రను ఆసక్తిగా గమనించిన స్థానికులు.. సిబ్బంది పంచిపెట్టిన ప్రత్యేక సంచికలను అంతే ఆసక్తిగా చదివారు. బస్టాండ్, పట్టణ పోలీస్ స్టేషన్, గాంధీచౌక్ ప్రాంతాల్లో సుమారు రెండువేల మందికి ప్రత్యేక సంచికలను నమస్తే సిబ్బంది అందజేశారు. ఆత్మీయ యాత్ర వెళ్లిన ప్రతిచోటా ప్రజలు దాని చుట్టూ గుమిగూడటం.. విభజన వికాసానికే అన్న శీర్షికతో ఉన్న పత్రికలు పట్టణంలో ప్రతిచోటా కనిపించడంతో కొందరు సమైక్యవాదులు జీర్ణించుకోలేకపోయారు.

ఎలాగైనా ఆత్మీయయాత్రను అడ్డుకోవాలని తీర్మానించుకున్న ఆ దుండగులు.. పట్టణంలోని హైస్కూల్ రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద పత్రికలు పంచుతున్న సమయంలో నమస్తే సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చౌరస్తాలో ఉన్న కొందరు కుర్రాళ్లను చేరదీసిన దుండగులు.. వారిని ఆత్మీయ యాత్రపైకి రెచ్చగొట్టారు. తెలంగాణ పత్రికను ఇక్కడ ఎలా పంచుతారంటూ ఉసిగొల్పారు. వాళ్లు వెనుక ఉండి.. మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సైతం సమైక్యవాదులకు వత్తాసు పలకడంతో వారు కూడా ముందుకు వచ్చారు. పోలీసుల అండ కూడా దొరకడంతో విర్రవీగిపోయారు. పత్రికలు పంపిణీ చేస్తున్న నమస్తే విలేకరులు, వ్యాను డ్రైవర్లపై దాడి చేసి గాయపరిచారు. డ్రైవర్లలో శ్రీనివాస్ మోచేతికి గాయమైంది. విజయ్‌కి ఛాతీపై గట్టి దెబ్బలు తగిలాయి. వాహనంపై దాడి చేసి సైడ్ మిర్రర్ పగులకొట్టారు.

వాహనంలో ఉన్న పత్రికలను రోడ్డు మీద పడేసి చిందర వందర చేశారు. నిప్పు పెట్టి తమ పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్నారు. అ మంటలు దారి వెంట వెళ్లే ఇతర వాహనాలకు సైతం అంటుకున్నాయి. అంతా అయిపోయిన తరువాత పోలీసులు నెమ్మదిగా వచ్చారు. ఈ దాడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ అంకబాబుకు నమస్తే తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అయితే ఇంత వరకూ ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేయలేదు. ఫిర్యాదును స్వీకరించినట్లు ఎకనాలెద్జ్మెంట్ మాత్రం ఇచ్చారు. మంగళవారం అమలాపురంలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్టమంత్రి విశ్వరూప్ పర్యటన ఉన్న రోజునే ఈ సంఘటన చోటుచేసుకుంది.

-ఇది అప్రజాస్వామికం

-నమస్తే రథంపై దాడికి పత్రిక ఎడిటర్,సీఎండీ, సీఈవో ఖండన

హైదరాబాద్: ‘విభజన ఇరు ప్రాంతాల వికాసానికే’ అంటూ నమస్తే తెలంగాణ దినపవూతిక తలపెట్టిన ఆత్మీయయాత్రపై మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో అల్లరి మూకలు చేసిన దాడిని నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ సీఎల్ రాజం, ఎడిటర్ అల్లం నారాయణ, సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమలాపురం పట్టణంలోని వైఎస్ విగ్రహం సెంటర్ వద్దకు చేరుకున్న ఆత్మీయరథంపై దాడి చేసి, ఏడు వేల నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను తగులపెట్టడమే కాకుండా సిబ్బందిపై చేయి చేసుకున్నారని, వాహనాన్ని ధ్వంసం చేశారని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర పత్రికలు ఏ ఆటంకం లేకుండా పాఠకులకు ప్రతి రోజూ అందుతుండగా, సీమాంధ్రలో తెలంగాణ పత్రికను పంచనివ్వకపోవడం అప్రజాస్వామికం, అన్యాయం, అసమంజసమని అన్నారు. దాడికి కారకలైనవారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని, ఆత్మీయ యాత్ర ఆటంకాలు లేకుండా సాగేందుకు సుహృద్భావ వాతావరణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *