mt_logo

వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధాన్యం : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 25: పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న  ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా  ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని  చాటిచెప్పేలా..పండుగ వాతావరణంలో జరుపాలని సిఎం అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో…దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలగురించి సీఎం వివరించారు. అదే సందర్భంలో…గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సీఎం ప్రకటించారు. దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా.. ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సీఎం కేసీఆర్ రంగాల వారిగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయారోజు చేపట్టే శాఖలు అవిసాధించిన అభివృద్ధిని వివరిస్తూ…అందుకు రాష్ట్ర  ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సీఎం కేసీఆర్ అర్థం చేయించారు.

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో  కలెక్టర్లకు సీఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని వివరించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో  వాటి నిర్వహణ గురించి సీఎం కేసీఆర్ సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.  పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సీఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం విద్యుత్తు సాగునీరు ఆర్ అండ్ బీ తదితర శాఖల మంత్రులను అధికారులను సీఎం అభినందించగా సమావేశం చప్పట్లతో హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…‘‘ కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నాం. నేడు తెలంగాణ వ్యవసాయం ఐటీ పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో వున్నది. నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చిన్నాడు కేవలం 8 లక్షల టన్నులు గా వున్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నం. ఒక పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువలను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శనిక విధానాలతోనే ఇది సాధ్యమైంది. ఒకనాడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరు లో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నది. ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ ను దాటేసి పోతున్నం.’’  అని సీఎం వివరించారు.

ఉద్యమ నాయకత్వమే స్వయంగా పాలన చేస్తే ప్రగతి సాధించడం కష్టం అనే అపోహను పటాపంచలు చేస్తూ ఎటువంటి భావోద్వేగాలకు గురికాకుండా పరిపాలనను నిర్థిష్ట లక్ష్యంతో ముందుకు కొనసాగించడం జరిగిందన్నారు. తత్పలితంగా దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించగలిగామని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు విద్యా వైద్య రంగాల్లో తెలంగాణ అత్యద్భుత ఫలితాలను అందుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ విద్యార్థుల నీట్ , ఐఎఎస్ పోటీ పరీక్షల్లో దేశంలోనే ముందువరసలో ర్యాంకులు సాధిస్తూ తెలంగాణ కీర్తిని చాటుతుండడం పట్ల సీఎం హర్షం వక్తం చేశారు. 

వానాకాలం నారు రోహిణీ కార్తెలో.. యాసంగి నారు అనురాథ కార్తెలో :

గత పాలకులు నిర్లక్ష్యానికి కునారిల్లిపోయిన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతోనే వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రధమ ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సీఎం అన్నారు. అందులో భాగంగా వ్యవసాయానికి సపోర్టు వ్యవస్థలయిన చెరువులు విద్యుత్తు సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామన్నారు. తత్ఫలితమే నేడు మనం చూస్తున్న దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి’’ అని సీఎం అన్నారు. నేడు తెలంగాణలో ధాన్యం దిగుబడి 3 కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన చర్యలను  రైతులను సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు చేపట్టాలని సీఎం అన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగండ్ల వానలు పర్యవసానంగా జరిగిన పంట నష్టం రైతుకు కలిగిన కష్టాలను గుణపాఘంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరమున్నదని సీఎం అన్నారు.