mt_logo

అమరుల శవాలమీద పదవులు ఏరుకునే మరుగుజ్జు మనస్కులు

“2014లో కూడా మీరే ముఖ్యమంత్రి. మీ వెనుకే మేమున్నాం”

– సూర్యాపేట సభలో కిరణ్ కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన రాంరెడ్డి దామోదర రెడ్డి.

నిజమే దామన్నా!
ఆనాటి నిజాం పరిపాలన నుండి,
ఈనాటి సీమాంధ్రుల పరిపాలన వరకు,
మీరు ఎవరి వెనకాల ఉండాలో వారి వెనకాలనే ఉన్నారు.
తెలంగాణ ప్రజలకే కాస్త ఆలస్యంగా అర్థమైంది,
ఇన్నాళ్లూ తాము తప్పుడు మనుషుల వెనుక నిలబడ్డామని.

ఉస్మానియాలో తెలంగాణ కొరకు మసిబొగ్గులా మారిన
వేణుగోపాల రెడ్డి శవం మీద చేసిన బాసలు
ఇవ్వాళ పదవి, డబ్బు యావలో నువ్వు మరిచిపోయుండొచ్చు.
2000 సంవత్సరంలో నీకు ఏ పదవీ లేని నాడు
నీ చుట్టు నలుగురు మనుషులు కూడా లేని విషయం కూడా
నువ్వు మర్చిపోయి ఉండొచ్చు.
“ఒంగోలు గిత్తల” వ్యామోహంలో పడి నీకివ్వాళ
తెలంగాణ ప్రజల ప్రాణాలు కనపడకపోవచ్చు.

కానీ మర్చిపోకు దామన్నా!
డబ్బులు, పదవి శాశ్వతం కాదు.

ఇవ్వాళ ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రిని
ఈ భానుపురి గడ్డమీదకు తెచ్చి
అతనికి వంగివంగి సలాములు చేసి,
తెలంగాణ ప్రజల గుండెను గాయపరచావు నువ్వు.

రేపు రాయబోయే తెలంగాణ చరిత్రలో
అమరుల శవాల మీద పదవులు ఏరుకున్న
మరుగుజ్జు మనస్కుల జాబితాలో నీ పేరు ఎక్కడం మాత్రం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *