mt_logo

ల‌క్ష‌ణంగా రైతు బీమా.. అన్న‌దాత కుటుంబానికి తెలంగాణ స‌ర్కారు దీమా

  • రాష్ట్రంలో ల‌క్ష‌మంది అన్న‌దాత‌ల 
  • కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున అందజేత‌
  • ఐదేండ్లలో రూ. 5,039 కోట్ల పరిహారం
  • అన్న‌దాత ఏ కార‌ణంతో మృతిచెందినా
  • బీమా వ‌ర్తింప‌జేసిన తెలంగాణ స‌ర్కారు

కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల్లో ఆ ఇంటికి రూ. 5 లక్షల చెక్కు వస్తుంది. నా జీవితంలో నేను చేసిన అత్యంత గొప్ప పనిగా దీనిని భావిస్తున్నా ఇవీ రైతు బీమా ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు. ఆ వ్యాఖ్య‌ల‌కు త‌గ్గ‌ట్టే నేడు అన్న‌దాత కుటుంబం ఆగంకాకుండా ఆదుకొన్న‌రు. అక్ష‌రాల ల‌క్ష కుటుంబాల‌కు రూ.5 ల‌క్షల చొప్పున అంద‌జేసి, రైత‌న్న‌ల కుటుంబాల‌కు తెలంగాణ స‌ర్కారు భ‌రోసాగా నిలిచింది. మ‌న‌కు అన్నంపెట్టే రైత‌న్న కుటుంబం ఆ ఇంటిపెద్ద‌కు ఏదైనా జ‌రిగితే ఆగంకావొద్ద‌ని సీఎం కేసీఆర్ తీసుకొన్న సంక‌ల్పం నేడు ఆ కుటుంబాల‌కు ఆద‌రువుగా నిలుస్తున్న‌ది. రైతు బీమా ల‌క్ష మార్కును దాటిన సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం..

అన్నదాత కష్టజీవి.. ఆరుగాలం శ్రమిస్తేగానీ తన కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి. అలాంటి రైతు ఆకస్మికంగా తనువు చాలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి బతుకుదెరువు ఎలా? ఆర్థిక కష్టాల నుంచి వారిని గట్టెక్కించేదెవరు? ఈ ప్రశ్నల్లోనుంచి పుట్టిందే రైతుబీమా పథకం. ఇంటి పెద్దదిక్కైన రైతు మరణిస్తే ఆ కుటుంబం పడే కష్టాలను దగ్గర నుంచి చూసిన సీఎం కేసీఆర్‌.. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలని తలంచారు. ‘రైతుబీమా’ పథకాన్ని తీసుకొచ్చారు. దేశానికి అన్నంపెట్టే అన్నదాత ఏవిధంగా మరణించినా అతడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించే రైతుబీమా ఇప్పుడు లక్ష మార్కును దాటడం ఒక రికార్డు. 2018లో మొదలైన ఈ పథకం కింద ఇప్పటి వరకూ 1,00,782 కుటుంబాలకు రూ.5,039 కోట్ల పరిహారం లభించింది. రైతుల నుంచి పైసా ప్రీమియం వసూలు చేయకుండా, వారు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించే రైతుబీమా వంటి పథకం మన దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ బీమా పథకాన్ని ప్రారంభించిన నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన జీవితంలో తాను చేసిన అత్యంత గొప్ప పనిగా దీనిని భావిస్తున్నానని చెప్పారు. అప్పుల భారంతో నలిగిపోయిన రైతు కుటుంబాలు, పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు రోడ్డున పడే దుస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. తెలంగాణ వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశ అది. దానిని కళ్లారా చూసిన కేసీఆర్‌ ఆ పరిస్థితిని సమూలంగా నిర్మూలించాలని నిర్ణయించుకొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రైతు సంక్షేమమే కేంద్రంగా చేపట్టిన కార్యక్రమాలన్నీ దీంట్లో భాగమే.

తెలంగాణ స‌ర్కారు.. కిసాన్ స‌ర్కార్‌

స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మొద‌ట అన్న‌దాత‌ల‌కే ప్రాధాన్య‌తనిచ్చారు. వ్య‌వ‌సాయ రంగాన్ని బాగుచేస్తే ఆటోమేటిక్‌గా రాష్ట్రం అభివృద్ధి బాట‌ప‌డుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సించారు. తెలంగాణలో రైతురాజ్యాన్ని నెలకొల్పటం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు పరిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరంను కేవలం మూడేండ్లలో నిర్మించింది. మిషన్‌ కాకతీయతో చెరువులకు మ‌ర్మ‌తులు చేసింది. దీంతో తెలంగాణలో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పెరిగాయి. వాటిని తోడుకోవటానికి వీలుగా 24 గంటల పాటు ఉచిత కరెంటును రైతులకు అందించింది. పెట్టుబడి కోసం రైతన్నలు అప్పుల పాలు కాకుండా రైతుబంధును తీసుకొచ్చింది. కల్తీ విత్తనాలు, పురుగుమందులపై ఉక్కుపాదం మోపి, నాణ్యమైనవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. రైతులు వ్య‌వ‌సాయంలో మార్పులపై తెలుసుకొని అనుస‌రించేందుకుగానూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవటానికి వీలుగా రైతు వేదికలు నిర్మించింది. ధాన్యం ఆరబోతకు కళ్లాలను ఏర్పాటు చేసింది.  మ‌న వ‌రిని కేంద్రం కొన‌బోన‌ని మొండికేసినా.. ప్ర‌తి గింజాకొని తెలంగాణ రైతుల‌ను ఆదుకొన్న‌ది.  రైతు కేంద్రబిందువుగా జరిగిన ఈ సమగ్ర కార్యాచరణలో మరో అడుగు.. రైతుబీమా. తెలంగాణ వచ్చిన తర్వాత తెరిపినపడ్డ కర్షక కుటుంబాల్లో ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే, మళ్లీ ఆ కుటుంబం పరిస్థితి మొదటికి రాకూడదన్న సదుద్దేశంతో దీనిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

రైతు ఏ కార‌ణంతో మ‌ర‌ణించినా ప‌రిహారం

సాధారణంగా రైతుబీమా పథకాలు ప్రమాద బీమాలుగానే ఉంటా యి. ఏదైనా ప్రమాదం బారిన పడి రైతు మరణించినప్పుడు ఇవి వర్తిస్తాయి. నాటి వ్యవసాయశాఖ మంత్రి కూడా సీఎం కేసీఆర్‌కు ఇదే ప్రతిపాదన చేశారు. ఈ పద్ధతిలో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం చాలా తక్కువ. కానీ, సీఎం అందుకు అంగీకరించకుండా, జీవిత బీమా కల్పిద్దామని, అప్పుడే రైతు కుటుంబాలకు పూర్తి భరోసా ఉంటుందని చెప్పారు. రైతుల బాధలను తీర్చాలనే ఆర్తి ఎంత ఉంటే ఈ మాట వస్తుంది! ఇలా మొదలైన రైతుబీమా లక్ష కుటుంబాలకు అండగా నిలిచింది. నేడు ఈ పథకం పరిధిలో ఉన్న 37.77 లక్షల మంది రైతుల్లో అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. తమ సంస్థ చరిత్రలో రైతుబీమా ఒక రికార్డని, ఇన్ని లక్షలమందికి సామూహికంగా జీవిత బీమా కల్పించిన ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదని తెలంగాణ సర్కారుతో ఎంఓయూ సందర్భంగా ఎల్‌ఐసీ ప్రతినిధులు హర్షం వెలిబుచ్చ‌డం గొప్ప విష‌యం. ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’ పేరిట ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ గుర్తించిన 700 ఆవిష్కరణల్లో టాప్‌-20లో రైతుబంధు, రైతుబీమా నిలిచాయి. తెలంగాణ మాడల్‌ను దేశానికి ఆదర్శంగా నిలిపిన మణిపూసల్లో రైతుబీమా ఒకటి.