mt_logo

ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే మన సమస్యల గురించి పోరాటం చేస్తారు: షాద్‌నగర్‌లో హరీష్ రావు

షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ప్రాణాలు త్యాగం చేసిన రోజు నేడు.. నిప్పు అంటించుకొని అమరుడు అయ్యాడు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాట ఫలితం నేటి తెలంగాణ.. వారికి జోహార్లు. చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తెలంగాణ అమరవీరులకు ఒక్క నాడు పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు జై తెలంగాణ అని వ్యక్తి సీఎం అయ్యాడు అని పేర్కొన్నారు.

ఉద్యమకారులపైకి తుపాకి పట్టుకొని వెళ్లిన వ్యక్తి సీఎం అయ్యాడు. గుర్తు చేసుకొని బాధ అనిపించింది. షాద్‌నగర్ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంది.. బీఆర్ఎస్ పార్టీకి కూడా అండగా ఉంది. మొన్న 7 వేల ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటు వేశారు.గెలుపు ఓటములు ఉంటాయి.. అధికారం, ప్రతిపక్షం అయినా మనం ప్రజల పక్షం ఉందాం. వారి వెంట పడి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం.. కార్యకర్తలకు ఇబ్బంది ఉంటే ఒక్క ఫోన్ కొట్టండి గంటలో ఉంటాం అని హరీష్ రావు తెలిపారు

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చినం.. ఏనాడు జై తెలంగాణ అని వారు కాంగ్రెస్ పార్టీ. మార్పు అని ఎన్ని మాటలు చెప్పారు. ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు.. ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్లీ స్పీడ్ అందుకుంటాం అని స్పష్టం చేశారు

కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించారు.. కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆరు గ్యారెంటీల్లో 13 గ్యారెంటీలు ఉన్నాయి.. రెండు అయిపోయాయని ప్రచారం చేసుకుంటున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలు కోటి 50 లక్షల మంది ఉన్నారు..వారికి నెలకు 2500 ఇవ్వడం లేదు.. బడ్జెట్‌లో నిధులు పెట్టలేదు.. గ్యారెంటీలు నమ్మాలని బాండ్ పేపర్లు రాసిచ్చారు. కానీ మోసం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో హామీల పేరిట మోసం చేశారు. ప్రమాణ స్వీకారం మాత్రం త్వరగా చేశాడు, హామీల అమలు మాత్రం చేయడం లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు దుయ్యబట్టారు.

కరోనా సమయంలో అధికారులు, ఎమ్మెల్యేలకు పైసలు ఆపి రైతులకు ఇచ్చాడు. కరోనా అప్పుడు మేము రైతు బంధు ఇచ్చాం, కానీ ఇప్పుడు ఏ సమస్య లేకున్నా ఎందుకు రైతు బంధు ఇవ్వడం లేదు.. రైతులకు పంట బోనస్ ఇవ్వాల్సిందే.. పార్లమెంట్ ఎన్నికల్లో మన రైతుల సత్తా చూపిద్దాం.. ఉద్యోగాల విషయంలో సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు.. ఒక్క పోస్ట్ నింపలేదు.. అవి బీఆర్ఎస్ పాలనవే.. హామీల గురించి అడిగితే అసెంబ్లీలో తప్పుడు శ్వేతపత్రాలతో డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవాలు బయటపెడితే, తిట్టడం మొదలు పెట్టారు.. అబద్ధాలు తప్ప నిబద్ధత లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనివి కూడా మేము చేశాం, వాళ్ళు చెప్పినవి కూడా చేయడం లేదు అని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్, తెలుగు దేశం పాలకులు 1984 నుండి 2014 దాకా ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ద్వారా నీళ్ళు ఇవ్వలేదు.. వారు 27,300 ఎకరాలకు నీళ్ళు ఇస్తే, మేము పదేళ్లలో 6.36 లక్షల ఎకరాలుకు నీళ్ళు ఇచ్చాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పనులు పూర్తి అయ్యాయి.. కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు ఆ పని పూర్తి చేయాలి.. నీళ్ళు ఇవ్వాలి.. బీజేపీ, కాంగ్రెస్ రెండు పాలమురును మోసం చేశాయి.. జాతీయ ప్రాజెక్ట్ తేవడంలో రెండు పార్టీలు విఫలం అయ్యాయి.. బీఆర్ఎస్ వచ్చాకనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది అని తెలిపారు.

21 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు.. నెలకు 10 వేలు వారికి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు.. వ్యంగం బంద్ చేసి, భూతులు బంద్ చేసి రైతుల మీద ప్రేమ చూపాలి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు.. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారు.. మహబూబ్‌నగర్ ఎంపీ బీఆర్ఎస్ గెలవాలి.. భవిష్యత్తు మనదే.. కార్యకర్తలు కష్టపడాలి అని దిశానిర్దేశం చేశారు.