mt_logo

‘తెలంగాణలో ఒక కాళరాత్రి’

(2010, ఫిబ్రవరి 14 రాత్రి.. ఉస్మానియా యూనివర్సిటీకి ఓ కాళరాత్రి . ఆ కాళరాత్రి ఏం.. జరిగిందో తమిళనాడుకు చెందిన జర్నలిస్టు రిపోర్టు చేసిన ఘటనా విషయాలే..‘తెలంగాణలో ఒక కాళరాత్రి’.  

ఈ కథనాన్ని ఇంగ్లీషులో One Night in Telangana అనే పేరిట గోవింద్ కృష్ణన్ రాయగా ఫౌంటెన్ ఇంక్ వెబ్ మ్యాగజీన్ వారు ప్రచురించారు. దీనిని తెలుగులోకి కొణతం దిలీప్ అనువదించారు. ఈ పుస్తకంలోని కొన్ని భాగాలు కింద ఇస్తున్నాం)

***

అణచివేత తెలంగాణ ప్రజలకు కొత్తకాదు. ఆరు దశాబ్దాలుగా అనేక రూపాల్లో వారిమీద నిత్యం రాజ్యహింస కొనసాగుతూనే ఉన్నది. మలిదశ ఉద్యమంలో విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనడం, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను గడగడలాడించి డిసెంబర్ 9 ప్రకటనను సాధించడం రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయి. అయితే ఈ పోరాటంలో అందరికన్నా ఎక్కువ అణచివేతను ఎదుర్కొన్నది తెలంగాణ విద్యార్థి లోకమే.

***

సమస్య చాలా అనూహ్యంగా మొదలైంది. పోలీసులతో మాట్లాడుతున్న కొంతమంది విద్యార్థులు వారిని క్యాంపస్ వదిలివెళ్లమని అడిగారు. అందులో కొంతమంది ఈ విషయం గురించి ఎస్పీ రామచందర్, ఉస్మానియా పోలీస్‌స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అంజయ్యతో మాట్లాడుతుండగానే, ఆవేశపరులైన కొందరు విద్యార్థులు సిఆర్‌పిఎఫ్ జవాన్లను ఉద్దేశించి ‘క్యాంపును ఎత్తేయాలి’ అని నినాదాలు మొదలుపెట్టారు. ఇంతలో కొంతమంది విద్యార్థులు తార్నాకవైపు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు.

‘చలో తార్నాక’ అని అరుస్తూ ‘బి’ హాస్టల్ ముంద న్న ముళ్లకంచెల వైపు, దాని వెనక ఉన్న గేటువైపుకు వడివడిగా నడవడం మొదలుపెట్టారు. వారు ‘బి’ హాస్ట ల్ ముందున్న రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి రోడ్దు రెండుగా చీలి కుడివైపు తార్నాకకు ఎడమవైపు ఇతర హాస్టల్స్‌కు వెళ్తుంది. ఇప్పుడు దుర్గం భాస్కర్ వెళ్లాలనుకున్నది ఆ ఎడమవైపు ఉన్న ఇంకో హాస్టల్‌కే. మొదటి దెబ్బలు భాస్కర్, అతని మిత్రుడు విఠల్ వైనే పడ్డాయి.

“బహుశా పొలీసులు మేము కూడా తార్నాక వైపుకే పోతున్నమని అనుకుని ఉంటరు. కానీ మమ్మల్ని ఆ బ్యారీకేడ్ల వద్ద ఆపొచ్చు కదా. అట్ల చేయకుండా మామీద దాడి ఎందుకు చేసిండ్రో నాకు తెలవదు”

ముగ్గురు పోలీసులు తనని చుట్టుముట్టి లాఠీ దెబ్బల వర్షం కురిపించినది గుర్తుకు తెచ్చుకుంటూ దుర్గం భాస్కర్ అన్నాడు. చేతులను తలకు రక్షణగా కప్పుకున్న భాస్కర్ ఆ దెబ్బలను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే స్పాండిలైటిస్ అనే తీవ్రమైన వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు భాస్కర్.

ఒకవైపు తన కపాలాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తూ, మరోవైపు వెన్నెముక దెబ్బతినకుండా కాచుకుంటూ భాస్కర్ వెనకకు ఉరికాడు. విఠల్ మీద అప్పటికే అయిదుగురు పోలీసులు దాడిచేసి విపరీతంగా కొట్టారు. అదే సమయంలో జర్నలిస్టులు రంగంలోకి దిగారు. స్థానిక వార్తా చానెళ్లకు చెందిన కెమెరామెన్లు, రిపోర్టర్లు విద్యార్థుల వెంట, పోలీసుల వెంటా ఉరుకులుబెట్టారు.

ఒక సీనియర్ పోలీసు అధికారి రిపోర్టర్ గణేశ్ మెడపట్టుకుని నేలకు అదిమి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. గణేశ్ ఎలాగోలా లేచి నిలబడి భాస్కర్, విఠల్ వెనకాలే ఆర్ట్స్ కాలేజీ భవంతిలోకి తలదాచుకోవడానికి ఉరికాడు.

మిగతా విద్యార్థులు బస్టాండ్ వెనుక దాక్కోవడానికి ఉరికితే పోలీసులు వెంటబడ్డారు. ఏ కవ్వింపూ లేకుండానే తమపై ఇలా దాడి చేయడంపై కొంతమంది విద్యార్థులు ఆగ్రహంగా పోలీసు అధికారులతో వాదిస్తున్నారు. అక్కడ కుమారస్వామి, మందాల భాస్కర్ కూడా ఉన్నారు. పరిస్థితి చేయిదాటిపోతుందని మందా ల భాస్కర్‌కు తెలుసు. అందుకే అతను ఇరువర్గాలు శాంతింపజేసే పనిలోపడ్డాడు.

“మీ వాళ్లను అదుపులో ఉంచుకోండి. నేను విద్యార్థుల నుంచి ఏమీకాకుండా చూస్తాను” అని పోలీసులకు చెప్పాడతను….

క్షణకాలంలోనే దాదాపు వందమంది సిఆర్‌పిఎఫ్ సివిల్ పోలీసులు విద్యార్థులపై పడ్డారు. మందాల భాస్కర్ తలపగిలింది. అతను కుప్పకూలిపోయాడు. విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ వైపుకు ఉరుకులుపెట్టారు. పోలీసులు యూనివర్సిటీ ప్రధాన రహదారిపై పొజిషన్లు తీసుకున్నారు.

గత రెండు నెలల్లో ఇరువర్గాలు అనేకసార్లు ఎదుదురుగా తలపడ్డాయి. దాడి చేయడానికి కీలకమైన తావులెక్కడున్నాయో, ఆ దాడిని కాచుకోవడానికి ఎక్కడ తలదాచుకోవాలో వారికి తెలుసు. ఈ రెండు వర్గాలూ యుద్ధవ్యూహాలు కూడా రూపొందించుకున్నాయి.

చాలామంది విద్యార్ధులు తప్పించుకుపోవడంతో పోలీసుల ఆగ్రహం ఈ లాఠీచార్జీని చిత్రీకరిస్తున్న శ్రీనివాస్‌పైకి మళ్లింది. అతని చుట్టూ డజన్లకొద్దీ పోలీసులు – తలపై లాఠీతో మోదారెవరో. తాను జర్నలిస్టునని, తానేమీ చేయలేదని మొత్తుకున్నట్టు తరువాత శ్రీనివాస్ చెప్పాడు. తననెందుకు కొడుతున్నారని అడిగినట్టు కూడా అతనికి గుర్తుంది. తిట్లు, దెబ్బల మధ్య వారి జవాబు లీలగా వినిపించిందట

‘అవును. కొట్టాలి మీ మీడియా నా కొడుకులని. మీరే కదా మమ్మల్ని విలన్లుగా చూపిస్తూ ఆ పోరల్ని హీరోలు చేసేది’.

‘బి’ హాస్టల్ ముందు విద్యార్థులు, పోలీసులు మరోసారి హోరాహోరి తలపడ్డారు. ఈసారి క్యాంపస్‌లోకి మీడియాను రానివ్వలేదు పోలీసులు. యూనివర్సిటీలో ఘర్షణను చిత్రీకరించేంచుకు ప్రయత్నిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి నర్సింగరావుపై విచక్షణారహింగా దాడిచేశాయి సాయుధబలగాలు. అతని బైకును తగులబెట్టారు పోలీసులు. అంతేకాదు విద్యార్థులు విసురుతున్న రాళ్ల నుండి తమనితాము కాపాడుకోవడానికి నర్సింగరావును మానవకవచంలా వాడుకున్నారు.

ఫిబ్రవరి 14 నాడు పోలీసుల దాడిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు గాయపడ్డారో తెలియదు. కానీ ఈ సంఖ్య కనీసం 100 వరకు ఉంటుందని అంచనా. బాలలక్ష్మి, ఆగమణి సహా మొత్తం 17 మంది విద్యార్థినులు గాయపడ్డారు. క్రిషాంక్, కుమారస్వామితో పాటు 15-20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారస్వామి తలకు 12 కుట్లు పడ్డాయి. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రి బయట మఫ్టీలో ఉన్న పోలీసులు తమ మిత్రులను పరామర్శించడానికి వచ్చిన అనేకమంది విద్యార్థులను అరెస్టు చేశారు.ఈ సంఘటనల దృష్ట్యా ఫిబ్రవరి 16 నుంచి యూనివర్సిటీలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు.

మరునాడు క్యాంపస్ నుంచి పోలీసు, పారామిలిటరీ బలగాలను తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పీలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూనే విద్యార్థులపై గ్రే హౌండ్స్ బలగాలను వాడినందుకు సంజాయిషీ కోరింది సుప్రీంకోర్టు. పోలీసుల దాడిలో 28 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. వారికి చెందిన 19 వాహనాలు ధ్వంసమయ్యా యి.

ఈ సంఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన విచారణ కమిటీ ముందు హాజరైన నగర పోలీస్ కమిషనర్ ఎ.కె. ఖాన్ విద్యార్థులపై కానీ, మీడియాపై కానీ తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని చెప్పుకొచ్చాడు.

ప్రెస్ కౌన్సిల్ వారి విచారణ కమిటీ పోలీసుల వాదన తోసిపుచ్చుతూ ‘ఫిబ్రవరి 14, 15 తేదీ ల్లో జర్నలిస్టులపై పోలీసులు ఎటువంటి కవ్వింపు లేకుండా, ఉద్దేశపూర్వకంగా దాడి జరిపారు. వీడియో ఫుటేజ్‌తో సహా ఇతర సాక్ష్యాలు పరిశీలిస్తే క్యాంపస్‌లో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని ఉపయోగించుకుని, ఉన్నతాధికారుల సూచనమేరకు, ఎంచుకున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేశారని స్పష్టమవుతుంది’ అని పేర్కొంది.

(ప్రచురణ: తెలంగాణ ఆత్మగౌరవ వేదిక, పేజీలు 32, వెల రు.20. ప్రతులకు దిశ పుస్తక కేంద్రం, చిక్కడపల్లి, ఫోన్: 9866559868) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *