mt_logo

బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలి: సత్యవతి రాథోడ్

బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలి అని, ఇందుకోసం అధికార యంత్రాంగం సమష్టి కృషితో పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. నేడు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్య, వైద్య – ఆరోగ్య శాఖలపై సమీక్ష చేశారు.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చాలా రోజులుగా విద్యా సంస్థలు మూతబడి ఉన్నందున తాగునీటి ట్యాంకులను శుద్ది చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా, మరుగుదొడ్లకు నిరంతరాయ నీటి సరఫరా ఉండేలా చూడాలన్నారు. శానిటేషన్ పనులు పూర్తి చేయాలని, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు.

హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టులో ములుగు జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినందుకు సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు అన్నారు. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్దం చేయాలన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డు అత్యవసర సమయంలో చాలా ఉపయోగపడుతుంది అన్నారు.

అంగన్వాడీ కేంద్రాలు కూడా ప్రారంభం అవుతున్నందున పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలోని 35700 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కోదానికి 1000 రూపాయాల చొప్పున ఇస్తున్నాం అన్నారు.

ములుగు జిల్లాలో చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీరు అందేలా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు వెంటనే పూర్తి చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వల్ల ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి సంబంధించిన కాలువలు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి, సుందరీకరణ చేయాలన్నారు. గోదావరి ఫ్లడ్ బ్యాంక్ కరకట్టల పనులు వెంటనే పక్కగా చేపట్టి మరింత నష్టం జరగకుండా చూడాలని చెప్పారు.

అనంతరం దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు, బైక్ లు, బ్యాటరీతో నడిచే వాహనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీమతి కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్లు ఆదర్శ సురభి, రిజ్వాన్ పాషా, ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *