mt_logo

రైతన్నల కోసం ‘ఈచ్ వన్ అడాప్ట్ వన్’!

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి ఇప్పుడు రైతులకు భరోసా కల్పించేందుకు ప్రతి ఒక్కరు ఒక్కో కుటుంబాన్ని దత్తత(ఈచ్ వన్ అడాప్ట్ వన్) తీసుకునే కార్యక్రమాన్ని చేపడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలు, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాదులు, జాగృతి, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆమె కోరారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రైతు సంక్షేమం- తెలంగాణ రాష్ట్రం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అధ్యక్షతన సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సామాజికవేత్తలు, వ్యవసాయ పరిశోధకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, అన్ని రంగాలు వారికి అండగా నిలుస్తాయని ఈ సందర్భంగా వారు రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను జాగృతి యువత దత్తత తీసుకుని వారి పిల్లల చదువును కొనసాగించేలా చర్యలు తీసుకుంటారని, రైతులెవరూ నిరాశ చెందొద్దని, కష్టపడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుందామని అన్నారు. మీరు లేకపోతే బంగారు తెలంగాణ సార్ధకం కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా రైతు అయినందున సన్న, చిన్నకారు రైతుల సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలు తెలుసని, సమగ్ర వ్యవసాయ విధానాన్ని పకడ్బందీగా రూపొందిస్తున్నారని కవిత పేర్కొన్నారు.

పంటలు ఎండిపోయిన రైతులకు 2009 నుండి నష్టపరిహారం అందలేదని, ఈ బకాయిల మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రూ. 480 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ఇచ్చిందని కవిత గుర్తుచేశారు. గత ఏడాది, ఇటీవల జరిగిన పంట నష్టాలకు సంబంధించిన పరిహారం రెండుమూడు రోజుల్లో విడుదలయ్యే అవకాశముందని, తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీని అమలు చేస్తుందని, ఇప్పటికే రూ. 8వేల కోట్లను బ్యాంకులకు చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుందని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం పెంచాలనే డిమాండును ప్రభుత్వానికి నివేదిస్తామని కవిత హామీ ఇచ్చారు.

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం మాట్లాడుతూ, ఆత్మహత్యలు వద్దు.. మీరు చనిపోతే అది కేవలం మీ కుటుంబానికే కాదు, తెలంగాణ సమాజానికంతటికీ బాధ కలిగించే విషయమని అన్నారు. రైతులకు మేమున్నాం.. ఆత్మహత్యలు జరగకుండా నిరోధిస్తాం అనే భరోసాను ప్రభుత్వం ఇవ్వాలని, ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. అనంతరం టీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన చైతన్యంతో రాష్ట్రంలోని రైతాంగాన్ని కాపాడుకుంటామని, ఈ చైతన్యంతోనే రైతుల దగ్గరకు ప్రభుత్వం వెళ్లి మీకు మేమున్నామనే భరోసా ఇస్తుందని తెలిపారు. 60కి పైగా కమిటీలు ఇచ్చిన సిఫారసులు కేంద్రం అమలు చేయలేదని అన్నారు. వచ్చే ఖరీఫ్ నుండి జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా భూసార  పరీక్షలు, అందులో వేయాల్సిన పంటల విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *