mt_logo

మా ‘బాపు’ చెప్పిన ముచ్చట

తెల్లవారుజామున నాలుగయ్యింది. పక్కలో బాబు ఏడ్పుకు మేలికొచ్చింది. పాలిస్తే వాడు పడుకున్నడు. నాకు నిద్ర తేలిపోయింది. వాకిట్ల బాపు చలిమం నిద్ర రావ నేను కూడ చలిమంట కాడ కూసున్న. ‘బాలింతవు చలికి వాకిట్లకు పోకని’ అమ్మ తిట్టుకుంటనే నిద్రపోయింది. బాపు మెల్లగ తన యాది పుస్తకం తెరిసిండు.

‘‘1921ల ప్రపంచమంత కరువొచ్చిందట బిడ్డా! ఆ కరువుల మా తాత, మా నాయిన కలిసి వందెకరాలు నాలుగొందల రూపాయలు, ఒక గొర్రెపిల్లకు అమ్ముకున్నరంట. ఆ నాలుగొందలు పెట్టి నాలుగేండ్లు బతికివూనట మా వోళ్లు. ఇంగ అప్పట్నుంచి మనకు అందరికీ కలిపి మిగిలిన ఆస్తి ఇరవై ఎకరాల లోపే’’ కాసేపు ఆగి మళ్లీ మొదలు పెట్టిండు.

‘‘నేను 1933లో పుట్టిన. ‘అలిఫ్. లే. బే.పె’ అనుకుంట ఉర్దూ ఇంత, తెలుగింత ఏదో సదివిన. స్వతంత్రం వచ్చేటప్పటికీ నాకు తొమ్మిదేండ్లు. అటు స్వతంత్రం ప్రకటించగానే ఇటు రజాకార్లు ఊర్లమీద పడ్డరు. అప్పటికే మన బతుకులు మధ్యతరగతి కన్నా అధమంగనే ఉన్నయి. జనానికీ మనకు ఒకటే తేడా! మనకు ఇరవై అడుగుల ప్రహరీ గోడతోటి పెద్ద ఇల్లున్నది. వాళ్లకు అదీ లేదు. రజాకార్లు ఊర్ల కొస్తే కాపాడుకుంటనని ఊరి జనానికి అభయమిచ్చిండ్రు మా నాయన, చిన్నాయన.’’

‘‘ఒక ఏడు పండినట్టూ, ఒక ఏడు ఎండినట్టూ ఇంకోవైపు రజాకార్ల భయం. రానురానూ పరిస్థితి దిగజారుకొచ్చింది. మా నాయన ఏమనుకున్నడో ఒక నమ్మకమైన మనిషిని వెంట ఇచ్చి నన్ను, మా అన్ననూ అడవి దేవులపల్లి దగ్గర కృష్ణానది దాటిచ్చి గుంటూరుజిల్లా పంపించిండు. ఏదెట్ల జరిగినా మేమన్న బతికి ఉంటమనుకున్నడేమో.’’

‘‘మూడు రాత్రులు, మూడు పగళ్లు నడవంగ, నడవంగ తెనాలి దగ్గర ఏదో ఒక పల్లెల ఒక రైతింట్ల విడిచి పెట్టి వచ్చిండా మనిషి. ఏం చెప్పిండో తెల్వదు. అప్పుడు గుంటూరు జిల్లాలకూడ కరువే ఉన్నది. వాళ్లు కూడ జొన్నలు, సజ్జలు పండించేది. ఆ ఇంటామె ఎన్నడు ఇంత వరి బువ్వ పెట్టేది కాదు. నాకేమో జొన్నకూడు, సజ్జకూడు మింగుడు పడకపొయ్యేది. ఊకె దెబ్బలు, తిట్లు పడేవి తినమని, పని చెయ్యమని.

‘మరి మన దగ్గరేం తినేది బాపూ’’ మధ్యలో అడ్డం తగిలిన.

‘‘ఎంత కరువున్నా బాయి కింద ఎకరం భూమిల బుడమొడ్లన్న అలికిపిచ్చేది తాత. మా కోసం రోజిన్ని బుడమొడ్లు దంపిచ్చి ఎస గంజితాగెటోళ్లు గంజితాగేది, బువ్వ తినెటోళ్లు బువ్వ తినేది.’’

‘‘ఆ గుంటూరు పల్లెలల్ల కూడ కరువే అని చెప్పినగద. లోతు బాయిలంగ నీళ్లు చేదమంటే నాకు చేతకాకపో పొయ్యేది. నేను బర్లు కాస్తె మా అన్న ఇంటికి సరిపోయే నీళ్లు మోస్తుండే. ఏనాడు కడుపు నిండ తిన్నది లేదు. పైంగ నేను ఊకె ఏడ్చేది. మల్ల రావటానికి బాట తెల్వదుగద బిడ్డా! మా అన్న ధైర్యంగనే ఉండేది. తిండి సరిగలేక ఆ రెండేండ్లు నేను ఒక అంగుళం పొడుగుగూడ పెరగలే. పైంగ ఉన్న బరువుల సగం తక్కువైన. అప్పుడు బక్కగైననంటే ఇప్పటికట్లనే ఉన్న.’’

అవును, బాపు బక్క పల్చటి మనిషి.

‘‘1966ల నాగార్జునసాగర్ పూర్తయి మనకు ఎడమ కాల్వకు నీళ్ళొచ్చి నంక కూడుకు, గుడ్డకు లోటు లేకుండ బతుకుతున్నం గానీ, అంతకు ముందు పండిన్నాడు పండినట్టు. ఎండిన్నాడు ఎండినట్టూ.’’

‘‘కాటన్ దొర కట్టిన ధవళేశ్వరం ఆనకట్టకు గోదావరి జిల్లాలు బాగుపడ్డయిగానీ కృష్ణ, గుంటూర్లల్ల ఏమి లేకుండె. మనకు ఎడమకాల్వను మీదికి చేసి, ఆంధ్రోళ్లు కుడి కాల్వ వాళ్ల బొందంత లోతుకు తవ్వుకుని బాగుపడ్డరు గానీ, అంతకు ముందు వాళ్ల బతుకులొక బతుకులా’’ యాది పుస్తకం తాత్కాలికంగా మూసిండు బాపు.
త్త్త్
బాపు ఈ ముచ్చట చెప్పిన తర్వాత ఐదారేండ్లకు సాహిత్యం మీద ఆసక్తితోటి ఎం.ఎ (దూరవిద్య) తెలుగుల చేరిన. అందుల ఒక పేపరు ప్రాచీన సాహిత్యం. ప్రాచీన కవులలో పోతనదీ, శ్రీనాథునిదీ విశిష్టశైలి. విరుద్ధ జీవన విధానాలు. ఇద్దరి మీదా ప్రత్యేక ఆసక్తి.

పోతన మన వాడు. నిరాడంబరుడు.

శ్రీ నాథుడు కొండవీడు ప్రాంతం వాడు. స్వాతిశయం నిండిన యాత్రికుని వలె ఆడంబరమైన జీవితం గడిపిన వాడు. తన ప్రాంతం గురించి తానే చెప్పుకున్న వ్యంగ్య బాణాలివే.

‘‘రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన నేకులె వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.

అంగడి యూరలేదు, వరియన్నము లేదు, శుచిత్వమేమి లే
దంగన లింపులేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ పాల్పడు కృపాపరుపూవ్వరు లేరు దాతలె
న్నంగను సున్న అట్టి పలనాటికి మాటికి బోవ నేటికిన్’’
ఇంకా…

చిన్నచిన్న రాళ్లు చిల్లర దేవుళ్లు
నాగులేటి నీళ్లు నాపరాళ్లు
సజ్జజొన్న కూళ్లు సర్పములు తేళ్లు
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు.

అబ్బా! బాపు చెప్పింది ఎంత నిజం. చేతిలో ఉన్నది కూడా పెట్టడానికి సయించని వాళ్లు. అందుకే శ్రీనాథుడు ‘దాతపూన్నంగను సున్న’ అన్నాడు. ‘అట్టి పల్నాటికి మాటికి పోవనేటికిన్’ అన్నాడు. పైగా ‘కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా నేను శ్రీనాథుడన్’ అని కన్నడ దేశం పోయి కంచుఢక్కను పగులగొట్టి భోగ జీవితాన్ని అనుభవించాడు.

‘‘సిరిగల వానికి చెల్లును
తరుణుల పదియాఱువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్’
అని పల్నాటి నీటి కరువును గడుసుగా చెప్పాడు.
శ్రీనాథుడు పదమూడో శతాబ్దంలో చెప్పిందీ, ఇరవైయవ శతాబ్దంలో మా బాపు చూసింది ఒకటే సీన్. ‘దాత లెన్నంగ సున్న’.

ఆంధ్రోడు దోచుకునెటోడేగానీ, పెట్టెటోడుకాదు.

నాగార్జునసాగర్ నీళ్లను అడ్డంగ దోచినంక గుంటురోళ్లకు ‘నడమంత్రపు సిరి’ సలపరం పెడుతుందే కానీ మొదట్నుండీ ఉన్నా లేకున్నా దాతలేమీ కారు.
రెండు మూడు రోజులకు మళ్లీ అదే దృశ్యం.

బాపు-నేను-చలిమంట- అమ్మ తిట్లు!

యాది పుస్తకం తెరిసిండు బాపు. ఆయనకు సినిమాలంటే ఇష్టం.

ఆ ఇష్టం తోటి తనకు తెలిసిన మద్రాసు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు.

‘‘తొలి తెలుగు పుస్తకం బైబిల్ అచ్చయింది మొదలు ఆంధ్ర ప్రాంతంలో సృజించిన సాహిత్యమంతా మద్రాసులోనే అచ్చయ్యేది. అట్లా భాషాభివృద్ధి, సాహిత్యాభివృద్ధి, విద్యాభివృద్ధి పేరుతో ఆంధ్రులంతా మద్రాసుకు ‘క్యూ’ కట్టిన్రు.

అందులో తూర్పుతీర ప్రాంతాలను కలుపుతూ బ్రిటీష్‌వారు కలకత్తానుండి మద్రాసుదాకా వేసిన రైల్వేలైను వారి అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడింది. 1940ల్లో సినిమా ’మూకీ’ నుండి ‘టాకీ’ దశకు మారి మద్రాసుకు చేరింది. అంతకు ముందు సినిమాలు కలకత్తా, బొంబాయిల్లో నిర్మించేవారట. అట్లా 1950 వరకే తెలుగు సినిమా రంగం, సాహిత్యరంగం మద్రాసులో వేళ్లూనుకున్నయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరిగి మద్రాసు నగరమంతా ఆంధ్రవాళ్లు ఆక్రమించుకున్నరు. ఆస్తులు పెంచుకున్నరు. మరోపక్క మనం నిజాం నుండి బంధ విముక్తులమై మనం పునర్నిర్మాణక చర్యల్లో ఉన్నపుడు భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట కేంద్రం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పూనుకుంది. ఈ దశలో ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ ఎలాగు ఏర్పడుతుంది గానీ మద్రాస్ నగరం కూడా మాకే కావాలని కుట్రపన్ని ఒక ఆంధ్రున్ని, ఒక తమిళున్ని మద్రాస్ నగరంలో ఎన్నికకు నిలబెట్టారు. ఆంధ్రుడే గెలుస్తాడు కనుక మద్రాస్ మాకు కావాలని ఆంద్రోళ్లు కుట్రతో ఉంటే చక్రవర్తుల రాజగోపాలచారి ‘క్విట్ మద్రాస్’ అని హుకుం జారీ చేస్తేగానీ వదల్లేదు వీళ్లు.

అసలు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చెయ్యకపోయినా తెలుగు వారినందరినీ ఒక గాటికి కట్టేవారే. అందులో సందేహం లేదు. కానీ, వాళ్లు పట్టు పట్టింది మద్రాస్ కోసమే. ఆ విషయంలో ఆంధ్రోళ్లు చేసిన తొండిని గమనించినోడు గనుక రాజాజీ నెహ్రు చెవిలో ఊదిన మంత్రమే ‘అమాయకపు ఆడపిల్లకూ, గడుసరి పిల్లవానికీ పెండ్లిలాంటిదీ ఆంధ్ర తెలంగాణల కలయిక. అందుకే ఎప్పుడైనా విడిపోవచ్చని’ సెలవిచ్చాడు నెహ్రూ!

ఇక, మా బాపుకు పెద్ద మనుషుల ఒప్పందాలూ తెలియవు. ఏ అభివృద్ధి మండళ్ల ఏర్పాటూ తెలియదు. కానీ, ఆంధ్రుల నైజం తెలుసు. అందుకే తన జ్ఞానానికి అందిన విషయాలను బాపు సింపుల్‌గా నిజమైన నిజాలుగా యాదికి చేసుకున్నడు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *