శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు మంత్రి కేటీఆర్, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. జీరో అవర్ లో కోమటిరెడ్డి మాట్లాడుతూ చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలకు ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిందని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడం లేదని చెప్పడం సత్యదూరమని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మున్సిపాలిటీలకు రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నామని, ఈ విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గమనించాలని అన్నారు.
ఇటీవల 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే, అందులో 122 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవులు కైవసం చేసుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయకపోతే ఈ గెలుపు సాధ్యమయ్యేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మీరు చెప్పేది విన్నారు.. తాము చెప్పేది కూడా విన్నారు.. సత్యదూరమైన మాటలు మాని వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారని, శాసనసభలో జీరో అవర్ లో మైక్ ఇచ్చినా హీరో గిరీ చేస్తామంటే సరికాదని కోమటిరెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.