mt_logo

ఇప్పటికీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలి: కేటీఆర్

మేడిపల్లిలో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో మాదిరిగా జీవితంలో అన్ని రకాల రుచులు ఉంటాయి. రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుస్తాం, ఓడిపోతాం, సంతోషాలు, బాధలు ఉంటాయి. ఓడిపోయినంతా మాత్రాన కుంగిపోయేది లేదు.. ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వరిస్తాం అని స్పష్టం చేశారు.

చావునోట్లో తలపెట్టి చావు అంచుకు వెళ్లి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్. పదేళ్లు ప్రజలు అవకాశం ఇస్తే తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు పరిష్కరించినాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త మెడికల్ కాలేజ్‌లు, గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.

ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు  నిర్ణయించుకొని వారిని గెలిపించారు. 420 అబద్దాల హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఇవ్వాళ గద్దెనెక్కిండు.. ఇంట్లో ఇద్దరు ముసళోళ్లు ఉంటే ఇద్దరికి రూ. 4 వేలు ఇస్తా అన్నాడు..మా తమ్ముళ్లకు ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిండు రేవంత్ రెడ్డి అని అన్నారు.

100 రోజుల్లో చేస్తానన్న హామీలను 4 నెలలు గడిచిన అమలు చేస్తలే. లంక బిందెలు ఉంటాయని అనుకొని వచ్చినా అని సీఎం అంటున్నాడు. అసలు లంకబిందెల కోసం దొంగలు కదా తిరిగేది.. రుణమాఫీ అంటే మెడలో పేగులు వేసుకుంటా అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని సీఎం తిరుగుతాడా? జేబు దొంగలు మాత్రమే కత్తెర పెట్టుకొని తిరుగుతారు అని పేర్కొన్నారు.

హామీల గురించి అడిగితే మానవ బాంబు అవుతా అంటాడు. రేవంత్ రెడ్డి గారు ఐదేళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలె.. మానవ బాంబులు నీ పక్కనే ఉన్నాయి.. నల్గొండ, ఖమ్మం మానవబాంబు నీ పక్కనే ఉన్నాయి. నీ కూడా తెలుసు ఇచ్చినా హామీలను నెరవేర్చటం సాధ్యం కాదని.. అందుకే ఎంత సేపు ఈ స్కాం, ఆ స్కాం అంటూ లీకులు ఇస్తూ కాలం గడుపుతున్నవ్ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

ఫోన్ ట్యాపింగ్లపై పెట్టిన శ్రద్ధ.. వాటర్ ట్యాపింగ్లపై పెట్టు..చేవెళ్లలో పనికి రాని చెత్తను మల్కాజ్‌గిరిలో పడేశారు. కాంగ్రెస్ ఖచ్చితంగా డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకపోయినా ప్రజలు నాకే ఓటు వేశారంటారు అని అన్నారు.

ఏమీ చేయకపోయినా మమ్మల్నే గెలిపిస్తారని ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తారు. కోటి 67 లక్షల మంది మహిళలకు 2500 రూపాయలు వచ్చాయా? రుణమాఫీ అయ్యిందా? 4 వేల రూపాయల ఫించన్ వస్తుందా? బీజేపీ కోసం కాంగ్రెస్ సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో డమ్మీ అభ్యర్థిని పెట్టింది.. కరీంనగర్‌లో ఇంకా అభ్యర్థిని పెట్టలె అని విమర్శించారు.

కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్‌ను ఖతం చేయాలనే పంతంతో ఉన్నాయి. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోన్ని చేస్తున్నాడు.. రాహుల్ గాంధీ ఏమో మోడీని చౌకి దార్ చోర్ అంటే మోడీ బడే భాయ్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హై అని రాహుల్ గాంధీ అంటే.. అదానీ హమారా ఫ్రెండ్ అంటున్నాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అంటే.. రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు అని ధ్వజమెత్తారు.

లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం సరికాదు అని రాహుల్ గాంధీ అంటే.. కేసీఆర్ కూతురు ను అరెస్ట్ చేయటం కరెక్టే.. లిక్కర్ స్కాం జరిగిందని రేవంత్ రెడ్డి అంటాడు. కాంగ్రెస్‌కు ఓటు వేసే మిత్రులు ఒక్కసారి ఆలోచించాలె. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొట్టమొదటిగా వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు.

అయితే జేబులో ఉండాలె.. లేదంటే జైల్లో ఉండాలనేదే మోడీ సిద్ధాంతం. మోడీ ఏం చేస్తాడోనన్న భయానికి ముందే బీజేపీలో చేరేందుకు రేవంత్ రెడ్డి ముందే ప్లాన్ చేసుకుంటున్నాడు.. బీఆర్ఎస్ పార్టీకు ఒక్క సీటు రాదని సవాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం రా అంటే సడి సప్పుడు లేదు అని కేటీఆర్ సవాల్ విసిరారు.

ఇప్పటికీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేయ్. రెండు లక్షల రుణమాఫీ పొందినోళ్లు మాకు వేయండి.. మిగతా వాళ్లు కాంగ్రెస్‌కు వేయండి.. రూ. 15 వేలు వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు.. రూ. 10 వేలు వచ్చినోళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. రూ. 4 వేల పెన్షన్ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి.. రూ. 2 వేలు వచ్చినోళ్లు మాకు ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.

మల్కాజ్‌గిరిలో మనకు పోటీ బీజేపీతోనే.. ఓడిపోయిన తర్వాత ఈటల మళ్లీ హుజురాబాద్‌కు పోవటం ఖాయం. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పాలె. ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చిన్రు.. వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? 15 లక్షల రూపాయలు వచ్చినోళ్లు అందరూ బీజేపీకీ ఓటు వేయండి.. రానోళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి అని అన్నారు.

ఒక్కంటే ఒక్క పని చేయనది మోడీ సర్కార్.. పైగా అన్ని ధరలు పిరం చేసిన్రు.. గ్యాస్, పెట్రోల్, డిజీల్, పప్పు, ఉప్పు అన్ని ధరలు పెంచిండు.మా ఆడబిడ్డలు ఆలోచించాలె.. మోడీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. రామునితో మనకు పంచాయితీ లేదు.. రాముడు అందరివాడు అని పేర్కొన్నారు.

రాముడు బీజేపీ మనిషి కాదు.. నా పేరులోను రాముని పేరు ఉంది. రాముని పేరు చెప్పుకోని రాజకీయం చేసే బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలె.. ఈటల రాజేందర్ అన్న గుర్తు పెట్టుకో.. మీ మోడీయే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామిక వేత్తలకు మాఫీ చేసిండు. రైతులకు మాత్రం రూపాయి రుణమాఫీ చేయనిది మోడీ.. కరోనా సమయంలో కాళ్లు కాలిన రోడ్లపై వెళ్తున్న కార్మికులకు  కనీసం ఫ్రీగా రైళ్లైనా పెట్టిండా మోడీ? కేసీఆర్ మాత్రం ఫ్రీ గా రైళ్లు పెట్టి, వాళ్లకు పైసలిచ్చి, బువ్వ పెట్టింది కేసీఆర్ అని గుర్తు చేశారు.

మానవత్వం లేని ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి గుంపుమేస్త్రీ, ప్రధాన మంత్రి తాపి మేస్త్రీ. ఇద్దరు కలిసి బీఆర్ఎస్‌ను లేకుండా చేసే పనిలో ఉన్నారు. ఉంటే జేబులో ఉండాలె.. లేదంటే జైల్లో అన్నట్లు అందరిపై కేసులు పెడుతున్నారు అని కేటీఆర్ విమర్శించారు.

చివరికి ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా మోడీ వదలటం లేదు. పార్లమెంట్‌లో మన గొంతు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.. గులాబీ జెండా మాత్రమే మన ప్రాంత ప్రయోజనాలను కాపాడగలుగుతది. భద్రాద్రి రామునికి, ఘట్కేసర్ రాముని దేవాలయానికి రూపాయి ఇయ్యని కిషన్ రెడ్డికి ఓటు వేద్దామా? అని అడిగారు.

యాదగిరిగుట్ట కట్టింది మనమే.. కానీ లక్ష్మి నరసింహా స్వామిని రాజకీయాలకు వాడుకున్నామా? దేశంలో విద్వేషాలు, మతోన్మాదం, నిరుద్యోగం పెంచిపోషిస్తున్న బీజేపీని పాతర పెట్టాల్సిన అవసరముంది అని స్పష్టం చేశారు.