mt_logo

కె సి ఆర్…మహోత్తరమైన కారణజన్ముడు!

By: రఘు డోంగూర్

కెసిఆర్ ముమ్మాటికి కారణజన్ముడే. కత్తి పట్టి తెల్ల గుర్రం మీద రాక పోయినా ఆయన యుగపురుషుడు కూడా. మానవ సంరక్షణ, సృష్టి ధర్మం కొరకు పురాణాల్లో ఋషులు, రాజులు పదమూడు పద్నాలుగేళ్ళు తపస్సులు వనవాసాలు చేసేవాళ్ళట. ఇప్పడు కెసిఆర్ చేసింది కూడా అదే. పద్నాలుగేళ్ళు అకుంటిత కార్యదీక్షతో ఉద్యమవాసం చేసాడు. ఉద్యమ తపస్సులో మునిగిపోయాడు. ఈ పద్నాలుగేళ్ళు అయన చెప్పిందే ఉద్యమ వేదం, అయన పాడిందే ఉద్యమ నాదం. నేటి వరకు తెలంగాణా చరిత్రలో ఆయనే మహాత్ముడు. భవిష్యత్తులో ఏమి జరగుతుందో ఎవరు చెప్పలేరు.

మొదట్లో కెసిఆర్ ఎవరు? ఆయన ఏం జేస్తాడు అన్నవాళ్లే, కెసిఆర్ ముక్కు బాగా లేదు, భాష బాగా లేదు అన్నవాళ్లే. కాని వాళ్ళకు తెలియనిది ఉద్యమానికి కావలసినవి అవి కావు అని. ఆయన శక్తి తెలిసేలోపు పాపం వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మి గుడ్డి వాళ్ళు అయిపోయారు. చివరకు చెప్పులు చేత పట్టుకొని తమ లోకానికి పరుగెత్తుతున్నారు. బహుశా ఈ దెబ్బ నుంచి తేరుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు.

కేవలం తన రాజకీయ అవసరాల కోరకే తెలంగాణ నినాదం వాడుకోవాలంటే ఆయనకు ఇన్ని రోజులు పట్టదు. ఉద్యమాలు నడపాలంటే కొన్ని పద్దతులు వుంటాయి. పాండవులు యుద్ధం గెలిచి తమ హక్కులను పొందారంటే దానికి కావలసినంత రాజకీయ చతురత కృష్ణుడు నడిపాడు. దుష్ట శిక్షణలో రాముడు నేరుగా వెళ్లి రావణాసురుడిపై విల్లు ఎక్కుపెట్టలేదు. తన యుద్దానికి కావాల్సిన వ్యక్తులను సమీకరించి యుద్ధనీతిని పాటించాడు.

ఈ మహాపురుషులు తమకు అడ్డు తగిలిన మారీచుడు, వాలి, శిశుపాలుడు లాంటి వాళ్ళను పక్కకు నెట్టారు.

యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు దేనికి బాధ పడలేదట. అణ్యం పుణ్యం ఎరుగని ఉపపాండవులు బలి అయ్యారని బాధ పడ్డాడట. మొత్తం మహాభారతం లో ఎక్కడ ఆయనకు కోపం రాలేదు. కాని అప్పుడు వచ్చిన కోపంలో అశ్వత్థామకు అంధకారం చూపించాడట. ఇప్పుడు కూడా అంతే. అణ్యం పుణ్యం ఎరుగని వెయ్యి మంది తెలంగాణా బిడ్డలు ఆహుతి అయ్యారు. దానికి ఖచ్చితంగా సీమంధ్ర నాయకులే కారణం. వాళ్ళ స్వార్థ రాజకీయ కారణాలే. దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు.

రాముడు ఎక్కుపెట్టిన బాణం రావణుడిని చంపే వరకు ఆగలేదు. కెసిఆర్ సంధించిన ఉద్యమబాణం విజయం చేరే వరకు ఆగలేదు. రాముడు సైగ చేస్తే సముద్రం ఉవ్వెత్తున లేచిందట. కెసిఆర్ పిలుపు ఇస్తే ప్రజాసముద్రం ఎగిసి పడ్తుంది. ఒక్క సారి కళ్ళు మూసుకొని కెసిఆర్ ను ఊహించుకోండి. ఆయన వెనుక మూడన్నర కోట్ల ప్రజాసమూహం కనిపిస్తుంది. ఆ సమూహం వెనుక ఒక ఉద్యమ చైతన్యం కనిపిస్తుంది. కెసిఆర్ ఒక ఉద్యమ మాంత్రికుడు. అయన మంత్రంలో ప్రజలు తమ కష్టాలు మర్చిపోయి, భవిష్యత్తు కొరకు పోరాడారు.

కోట్లకు పడగలెత్తిన సీమాంధ్ర మీడియా, రాజకీయ విషనాగులను తలపట్టి విషం కక్కించడం అంత తేలికైన విషయం కాదు. కెసిఆర్ లో ఏదో శక్తి వుంది. ఆ శక్తే ఉద్యమ ప్రభంజనం అయ్యింది. ఉద్యమాన్ని చివరివరకు నిలిపింది. చరిత్రలో సరిఅయిన నాయకత్వం లేక ఎన్నో ఉద్యమాలు ఆదిలోనే అంతం అయ్యాయి లేదా తప్పుదోవ పట్టాయి. చైనాలో ఈజిప్ట్ లో జరిగింది అదే. కుహన సమైక్యవాదులను, అడ్డగోలుగా తెలంగాణను దోచుకున్న సీమాంధ్ర దోపిడివర్గాలను గాండ్రించి ఎదిరించిన మొనగాడు కెసిఆర్. అణగారిపోయిన తెలంగాణ ప్రజలకు పోరాటస్ఫూర్తి రగిలించాడు. దశాబ్దాల నుంచి జరుగుతున్న దోపిడిని వేదికలెక్కి లెక్కలుకట్టి బట్టబయలు చేశాడు. కెసిఆర్ రాజకీయ నినాదం తెలంగాణ ప్రజల జీవమరణ పోరాటం. ఒకటి రెండు స్వాతంత్ర పోరాటాలు తప్ప చరిత్రలో ఇంత దీర్ఘకాలంగా జరిగిన ఉద్యమాలు లేవు.

అధికారమే ఏకైక లక్ష్యంగా మీ నాయకులు ఎక్కడలేని కొత్త రాజకీయ అవకాశ అనుబంధాలకు తెరతీస్తున్నారు. రెండు కులాల పిచ్చిలో మీ జీవితం రాహుకేతువులకు అర్పణం చేసారు. మీ ఏడుపేదో మీరు ఏడవండి. కాని మీరా సమస్త కులాలని, తెగలని ఏకత్రాటిపై నడిపించిన కెసిఆర్ ను దూషిన్చేది? కెసిఆర్ తిన్న కంచంలో కక్కేడి రకమా? తిండి పెట్టిన వాడు విషం కలిపి అణచాలనుకున్నప్పుడు, కంచాన్ని, తిండి పెట్టినవాన్నైనాలేచి తంతారు. కెసిఆర్ అదే చేసాడు. కెసిఆర్ ను విమర్శించే స్థాయి, అర్హత, నీతి మీకు లేవు. ముందు మీరు మీ కుల దురహంకారం, ప్రాంతీయ అంధకారం నుంచి బయటపడండి. కెసిఆర్ సంపాదించిన విశ్వసనీయత తెలంగాణ ప్రజల గుండెల్లో భద్రంగా వుంది. దాన్ని మీరు తాకలేరు!

మీకు సమన్యాయం జరగాలంటే కెసిఆర్ ను అడగండి. సమన్యాయం అంటే ఏంది, సమన్యాయం కొరకు ఎలా ఉద్యమం చెయ్యాలో చెప్తాడు. సమన్యాయం అంటే తెలంగాణ ప్రజలకు మట్టి పోసి, మీకు మణులు మాణిక్యాలు పంచమని కాదు. కాని పొరపాటున గూడ సమన్యాయం ఏంటి అని మీ యువనేతను అడగకండి. సమానంగా దోచుకోవడం తప్ప ఆయనకు సమభావన సమన్యాయం గురించి అస్సలు తెలవదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *