mt_logo

నల్గొండలో ప్రారంభం కానున్న ఐటి టవర్

నల్లగొండ పట్టణానికి ఐటీ పరిశ్రమ రానున్నది. నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్ లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ సొనాటా సాఫ్ట్వేర్ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటి పరిశ్రమను విస్తరించాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నల్గొండ ఐటీ టవర్ లో సుమారు 200 ఉద్యోగాలను సొనాటా సాఫ్ట్వేర్ కల్పించనున్నది.

సొనాటా సాఫ్ట్వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీని వీరవెల్లి మంత్రి కేటీఆర్ తో అమెరికాలోని బోస్టన్ నగరంలో సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్య రంగము, లైఫ్ సైన్సెస్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ల కోసం సొనాటా కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీ స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో కల్పించనుంది.