mt_logo

మన రాష్ట్రం వచ్చింది కాబట్టే సాయం అందింది!!

ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గోకుల్ చాట్ పేలుళ్ళ ఘటనలో తీవ్రంగా గాయపడి జీవచ్చవంలా బతుకుతున్న తెలంగాణ బిడ్డ, యువ ఇంజినీర్ సదాశివరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. తక్షణ సహాయం కింద రూ. 10 లక్షలను అతడి తల్లిదండ్రులు జీ మోహన్‌రెడ్డి, వసంతలకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ గురువారం సచివాలయంలోని సీ బ్లాకులో అందజేశారు. ఈ సందర్భంగా సదాశివరెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తమకు ఆర్ధికసాయం అందిందని, సమైక్య రాష్ట్రానికి సీఎంలుగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలు తమను అసలు పట్టించుకోలేదని అన్నారు. మనవాళ్ళు అధికారంలో ఉన్నారు.. మన రాష్ట్రం వచ్చింది కాబట్టే మాకు సహాయం అందిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఆర్ధికసాయం చేసి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

గోకుల్ చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్ళలో ఆనాడు 49మంది చనిపోగా, సుమారు 67మంది తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన ఘటనలో సదాశివరెడ్డి తీవ్రంగా గాయపడి జీవచ్చవంలా మారాడు. కేవలం వైద్య సేవలు మాత్రమే చేయించి గత సీమాంధ్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నెలకు రూ. 30 నుండి రూ. 40వేలతో సదాశివరెడ్డికి వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వారి గోడును చెప్పుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణ ఆర్ధికసాయం కింద రూ. 10 లక్షలు అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం వారికి రూ. పది లక్షలు మంజూరు చెయగా, సీఎం తరపున ఐటీ మంత్రి కేటీఆర్ సదాశివరెడ్డి కుటుంబానికి చెక్కును అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *