mt_logo

మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. తెలంగాణ నవ శక మాగాణం 

హైదరాబాద్,జూన్ 7: మండు వేసవిలో చెరువులు మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణం అయ్యింది. అందుకు కారణం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు  కార్యదక్షత, దూరదృష్టి, ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ  డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది.  ఈ జల విజయంలో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక భూమిక. రికార్డు సమయంలో భారీ ప్రాజెక్టును పూర్తిచేయడం ఒక విశేషమైతే, దాని ఫలాలు తెలంగాణ అంతటికీ అందించటం మరో విశేషం. 

నేడు గరిష్ఠంగా 400 టీఎంసీ నీటి వినియోగం 

కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016 మే 2న శంకుస్థాపన జరుగగా, మూడేండ్లలోనే పూర్తి అయి  2019 జూన్ 21న ప్రారంభమైంది. అప్పటి వరకు గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేని దుస్థితి. నేడు గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా నీటిని  వినియోగించుకునే స్థాయికి ఎదిగామంటే సాధించిన ప్రగతి ఎంతో అర్ధం చేసుకోవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాల్వ చివరిభూముల వరకు గోదావరి నీళ్ళు  అందుతున్నాయి. మరోవైపు కృష్ణా నదిపై ఉన్నప్రాజెక్టులను సైతం ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పూర్తి చేస్తున్నది. 

సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపు 

పాలమూరు జిల్లాను తీసుకుంటే ఇక్కడ ఏకంగా 4 ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కోయిల్సాగర్ ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. కల్వ కుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.85 లక్షల ఎకరాలకు జీవం వచ్చింది. రాజీవ్ భీమా ద్వారా 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.కాళేశ్వరంతో కరువు ప్రాంతం నీళ్లతో కళకళలాడు తున్నది. బీడు భూముల్లో పసిడి పంటలు పండుతున్నాయి. సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపయ్యింది. 2014-15లో యాసంగి, వానాకాలం కలిపి 1.31 కోట్ల ఎకరా లుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదనంగా ఏటా 15-20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.

వానకాలం, యాసంగి కలిపి మొత్తం సాగు విస్తీర్ణం (కోట్ల ఎకరాలు)

2014-15 లో 1.31 కోట్ల  ఎకరాలు, 2015-16 లో  1.21 కోట్ల ఎకరాలు, 2016-17 లో 1.48 కోట్ల ఎకరాలు, 2017-18 లో 1.50 కోట్ల ఎకరాలు,2018-19 లో 1.43 కోట్ల ఎకరాలు,2019-20 లో 1.88 కోట్ల ఎకరాలు,2020-21 లో 2.04 కోట్ల ఎకరాలు,2021-22 లో 1.95 కోట్ల ఎకరాలు,2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.

2004 నుండి 2014 వరకు పదేండ్లలో తెలంగాణ ప్రాజెక్టులపై ఉమ్మడి సర్కారు పెట్టిన ఖర్చు. రూ.38,405.2 కోట్లు. కాగా 9 ఏండ్లలో అనగా 2014 నుండి 2023 వరకు  ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు వెచ్చించిన మొత్తం రూ.1.69 లక్షల కోట్లు. 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగు విస్తీర్ణ శాతం 7.7%. కాగా 9 ఏండ్లలో తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణ శాతం 117%. 9 ఏండ్లలో పెరిగిన సగటుభూగర్భ జల మట్టం 4.14 మీటర్లు.

9 ఏడేండ్లలో తెలంగాణ సర్కారు పూర్తి చేసిన పెండింగ్ ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయి.. 

కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, మిడ్ మానేర్, సింగూరు కెనాల్స్, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెం వాగు,కుమ్రంభీంమత్తడి వాగు, నీల్వాయి, జగన్నాథపూర్. ఇక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తున్నది. ప్రాజెక్టు నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్ వేర్, మొబైల్ యాప్ లను రూపొందించింది. పంప్ హౌజ్ లు,  జలాశయాలు, కాలువలు, చెరువులు, వర్షపాతం వివరాలు, నదుల ఇన్ ఫ్లో, భూగర్భ జలాల పరిస్థితి, తదితర సమస్త సమాచారం అంతా ఒకే చోట లభ్యం కానున్నాయి. నదుల్లోకి వచ్చే నీటిని, కిందకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని అంచనా వేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో పొందు పరిచారు. జలాశయాలు, చెరువుల్లో ఎంత నీరు ఉన్నది? ఎంత ఖాళీ ఉన్నది అన్న సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలగనున్నది. తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరువు పరిస్థితులు తలెత్తకుండా నిత్యం జలధారలతో భూములు తడిసేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. సాగువెతలు తీరాయి.నీటి కరువు ఆగిపోయింది. భవిష్యత్తులో తెలంగాణ సాగు నీటి రంగం మరింత విస్తృతమై నీటి నిల్వలు సమృద్ధిగా ఉండగలవని ఆశించవచ్చు.