mt_logo

సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే కాళేశ్వరం- హరీష్ రావు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనత సాధించిందని, మూడేళ్ళలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ. హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద రంగస్వామి గుట్టపై శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఏళ్లయినా పూర్తికాని ప్రాజెక్టులను కేవలం మూడేళ్ళలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? మనకు ఈ నీళ్ళు కనిపించేవా? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ లో మొదటి పదమే నీళ్ళు అని, సీఎం కేసీఆర్ రాత్రింబవళ్ళు ఒక ఇంజినీర్ లా కష్టపడి ఈ ప్రాజెక్టును పూర్తిచేశారని హరీష్ రావు ప్రశంసించారు. కాళేశ్వరం విషయంలో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మహారాష్ట్రను ఒప్పించడంతో పాటు కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఈ గొప్ప ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతం అని, రైతుల కన్నీళ్లు తుడిచే ప్రాజెక్టుకు పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ ప్రాజెక్టు అత్యంత వేగంగా పూర్తయ్యేందుకు ఇంజినీర్లు, రెవెన్యూ ఉద్యోగులు, కార్మికులు ఎంతో శ్రమించారని, ఎర్రటి ఎండలో 44 డిగ్రీల వేడిని కూడా లెక్క చేయకుండా వారు శ్రమించిన తీరు అద్భుతమని హరీష్ రావు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *