mt_logo

మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాలి: హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.

జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలి. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా కోల్పోతారు అని తెలిపారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం అన్‌రిజర్వుడు కోటా అంటే 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతారు. దీంతోపాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతారు అని పేర్కొన్నారు.

ఎంబీబీఎస్/పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమైన విషయాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం దురదృష్టకరం. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నది. ప్రభుత్వ తీరుతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అని హరీష్ అన్నారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 2014 నుండి కన్వీనర్ కోటాలో 15% సీట్లకు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం పోటీపడే వెసులుబాటు కల్పించారు. ఇదే విధానం కొనసాగితే, 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది అని తెలిపారు.

దీన్ని నివారించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేసింది. దీనికోసం, ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్ మరియు ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్ మెడికల్/డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌ సవరణ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు 520 మెడికల్ సీట్లు అదనంగా లభించాయి అని గుర్తు చేశారు.

అయితే ప్రస్తుతం జూన్ 2 తో విభజన చట్టానికి కాలం చెల్లుతుందటంతో పాత మెడికల్ కాలేజీలోని 100% కన్వీనర్ కోటా సీట్లను కూడా తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది అని అన్నారు.

ఎంబీబీఎస్, పీజీ సహా ఇతర వైద్య విద్య అభ్యసించాలనుకునే తెలంగాణ బిడ్డలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే, స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలి. కన్వీనర్ కోటాలోని 100% సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చూడాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డాక్టర్ కావాలనుకునే వైద్య విద్యార్థుల అవకాశాలు మెరుగుపరచాలి అని హరీష్ సూచించారు.