mt_logo

కిషన్ రెడ్డి బాబు పక్షమా? ప్రజల పక్షమా?- హరీష్ రావు

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధర్నా చేయాల్సింది వరంగల్ లోకాదని, నిధులకోసం ఢిల్లీ యాత్ర చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు కట్టాలా? వద్దా? స్పష్టం చేయాలని, తెలంగాణ బిడ్డవైతే కేంద్రం నుండి రావలసిన నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కిషన్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని, తెలంగాణను ముంచే పోలవరానికి నిధులిస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం రూపాయి ఇవ్వట్లేదని విమర్శించారు. తెలంగాణపై చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఏనాడైనా కిషన్ రెడ్డి స్పందించారా? కిషన్ రెడ్డి చంద్రబాబు పక్షమా? లేక ప్రజల పక్షమా? తేల్చుకోవాలని హరీష్ రావు సూచించారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంటున్న బాబుకు కిషన్ రెడ్డి ఎలా మద్దతిస్తాడని, ఆంధ్రా నేతల చేతిలో కిషన్ రెడ్డి కీలుబొమ్మలా మారాడని అన్నారు.

తోటపల్లి ప్రాజెక్టుపై మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు దళారుల పక్షాన పనిచేస్తున్నారని, కాంగ్రెసోళ్ళ కోసమో, దళారుల కోసమో ప్రాజెక్టులు కట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత డిజైన్ తో తోటపల్లి ప్రాజెక్టు కడితే 6 గ్రామాలు ముంపుకు గురవుతాయి. అదే రీడిజైన్ చేస్తే ఎకరం మునగకుండా 40 వేల ఎకరాలకు నీరు అందించవచ్చని హరీష్ రావు తెలిపారు.

మిషన్ కాకతీయ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని, ఫేజ్-2 అమలు చేస్తూనే ఫేజ్-1 పెండింగ్ పనులు పూర్తిచేస్తామన్నారు. వరంగల్ జిల్లాలో 1075 చెరువులను రూ. 418 కోట్లతో పునరుద్ధరించామని, నిండిన చెరువులు, పచ్చటి పొలాలను చూస్తుంటే కడుపు నిండుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనులతో మాదన్నపేట చెరువు జలకళ సంతరించుకుందని, త్వరలో మాదన్నపేట చెరువును ఫేజ్-2 లో 12 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *