రాష్ట్రంలో ప్రచండ పరిణామాలు
(రాష్టప్రతి పాలనా సమయంలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై జనవరి 23, 1973న ఆంధ్రభూమి (గోరా శాస్త్రి) సంపాదకీయం)
–
ఇటు తెలంగాణా కాంగ్రెస్‌వాదుల సదస్సు హైదరాబాదులో. అటు కాకినాడలో ఆంధ్ర కాంగ్రెస్ వాదుల సమావేశం. రెండూ ఒక రోజున జరిగాయి. ఉభయ వర్గాలవారూ తత్‌క్షణం విభజించాలనే ఏకాభిప్రాయాన్ని ఘంటాపథంగా ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాలను వెంటనే ఏర్పాటు చెయ్యాలని కేంద్ర నాయకత్వాన్ని అభ్యర్థించారు, హెచ్చరించారు. డాక్టర్ చెన్నారెడ్డిగారి ఆధ్వర్యాన హైదరాబాద్‌లో సమావేశమైన ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ వాదులు, రాష్ట్రాన్ని విభజించాలని ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీగారినీ, కాంగ్రెస్ అధిష్ఠాన వర్గాన్నీ కోరుతూ తీర్మానించారు. కాకినాడలో కలుసుకున్న ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ వాదులు రేపటి ఫిబ్రవరి 5వ తేదీలోగా ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచెయ్యాలనీ, లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర విప్లవం తప్పదనీ కేంద్రాన్ని హెచ్చరిస్తూ ‘‘అల్టిమేటమ్’’ (చివరి హెచ్చరిక) తీర్మానించారు. భాషా, కొంతవరకూ వైఖరీ తేడాగా ఉన్నా, ఉభయులకూ కావలసినదీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టీకరించినదీ ఒక్కటే. తత్‌క్షణం రాష్ట్ర విభజన. తెలంగాణా సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ వాదులలో, 34గురు ఎమ్.ఎల్.ఏలు, 9గురు ఎమ్.ఎల్.సిలు, పార్లమెంటు సభ్యులు 9గురు, జిల్లా పరిషత్తుల అధ్యక్షులలో 7గురూ, సమితుల ప్రెసిడెంట్లలో 81మందీ హాజరైనారు. కాకినాడ ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ వాదులలో 85గురు ఎమ్.ఎల్.ఏలు, 17గురు పార్లమెంటు సభ్యులు, జిల్లా పరిషత్తుల అధ్యక్షులు 11 గురు, సమితుల ప్రెసిడెంట్లు 188 మంది. వీరందరూ ఇంకొక్క అడుగు ముందుకు వేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పత్రాలను శ్రీ బి.వి.సుబ్బారెడ్డిగారికి సమర్పించారు. ఫిబ్రవరి 5 గడువులోగా కేంద్రం ప్రత్యేకాంధ్ర రాష్ట్రం నిర్మాణాన్ని అంగీకరించకపోతే రాజీనామా పత్రాలన్నింటినీ సరాసరి ఢిల్లీకి బట్వాడా చేసి కాంగ్రెస్ పార్టీనుండి నిష్క్రమిస్తారు. సదస్సులో పెట్టుకున్న పేరుతోనే వేరే పార్టీగా వ్యవహరిస్తారన్న మాట.
రెండు సదస్సుల తీర్మానాల అనంతరం కూడా, ఆంధ్రప్రదేశ్ అనే సమైక్య రాష్ట్రం ఒకటుందనీ, అందులో కాంగ్రెస్ పార్టీ అనేది సమైక్యంగా ఉందనీ, వేళాకోళానికి కూడా ఎవరైనా అనగలరా?- అంటే నగుబాటుపాలవుతారు. లేదా ఆత్మవంచన చేసుకున్నవారవుతారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఛిన్నాభిన్నమైనది. ఐతే, రెండు సదస్సులవారూ కొత్త పేర్లతో వ్యవహరించడానికి తీర్మానించినా, నామకరణంలో ‘‘కాంగ్రెస్’’ అనే మాటను కూడా జొప్పించారు. మాతృ సంస్థతో పూర్తిగా తెగతెంపులు చేసుకోలేదు- ఐతే రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ‘‘సమైక్యతావాదుల’’ సంఖ్య మైనారిటీ స్థాయికి దిగజారింది. అత్యధికులు కేంద్ర నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారనేది దాచినా దాగని సత్యం. 1971 అర్ధాంతర ఎన్నికల తరువాత, ప్రధాని శ్రీమతి గాంధీ నాయకత్వాన ముందుకు సాగుతున్న కేంద్ర పాలక వర్గాన్ని యింతవరకూ ఏ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులూ పరోక్షంగానైనా ఎదిరించలేదు. అంతటి సాహసం ఎవరికుంది. ప్రధాని శ్రీమతి గాంధీ నాయకత్వం ‘‘కోటిసూర్య ప్రభాకలితంబై’’ విరాజిల్లుతున్న దశలో చిన్న విషయాన్ని కూడా కాదనడానికి ఎన్నివేల గుండెలుండాలి? మొట్టమొదటి సవాల్ మన రాష్ట్రం నుండి వచ్చింది. దీని పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో ప్రస్తుతం ఊహించలేము గాని ఇంతటితో ఆగవనేది ఖాయం.
ఆంధ్రప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ‘‘పనీ’’పాటూ లేని కొందరు రాజకీయ నాయకులు ప్రారంభించారనీ, దానంతటదే కొద్ది రోజులలో నామరూపాలు లేకుండా చల్లారిపోతుందనీ మొన్నటివరకూ రాష్ట్రాన్ని అవకతవకగా పరిపాలించి యిటు రాష్ట్రాన్ని అన్ని విధాలా వేధించి, అటు కేంద్ర నాయకుల ప్రతిష్ఠ సైతం దెబ్బతినేటట్లుచేసిన శ్రీ ‘‘పి.వి.’’గారు మొదట్లో వ్యాఖ్యానిచారు. ఉద్యమం యివాళ తారాస్థాయినందుకుంది. ఉద్యమం యింకా భీకరంగా కొనసాగుతున్నందుననే ఆయన ముఖ్యమంత్రి పదవి కాస్తా ఊడిపోయింది. ఆయన మాటలు నమ్మిన కేంద్ర నాయకత్వం, చివరకు తమ పరువు పోగొట్టుకుంది. నరసింహారావుగారు చేసిన నిర్వాకం అది. కేంద్ర నాయకత్వం యింకా మొండికేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. డాక్టర్ చెన్నారెడ్డిగారు ఓ చక్కని మాట అన్నారు. ఒకే భాష కలవారికి ఒక రాష్ట్రం ఉండడమూ, ఒక భాష మాట్లాడేవారందరికీ ఒకే ఒక రాష్ట్రం మాత్రమే ఉండాలనడమూ- రెండింటికీ ఎంతో తేడా ఉందన్నారు.
ఆంధ్ర తెలంగాణాల కలయిక మంచి ఫలితాలను యివ్వకపోగా, వైషమ్యాలకూ, అనర్థాలకూ దారితీసింది. ఇవాళ ఉభయ ప్రాంతాలవారూ ఐక్యకంఠంతో విభజన కోరుతున్నారు. కేంద్రానికి అభ్యంతరం దేనికి?- ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే, కేంద్ర ప్రభుత్వం దేశంలో తక్కిన చోట్ల చిక్కుల్ని ఎదుర్కొంటుందంటే, అదొక సంజాయిషీ ఎలా అవుతుంది? కేంద్రానికి దేశంలో ఎక్కడా చిక్కులు రాకండా ఉండడం కోసం తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు నిర్బంధ సమైక్యంతో నిరంతరం బాధపడుతూండాలా? ఇదెక్కడి వాదన? ఇదెక్కడి న్యాయం? కేంద్రం తన తిప్పలేవో తను పడాలిగాని తెలుగువారిని బాధించరాదు. యధార్థానికి తెలంగాణ – ఆంధ్ర ప్రాంతాలు రెండూ యివాళ అనధికారికంగా విడిపోయాయి. పరిస్థితిని ఇంకా దిగజార్చి తీవ్ర పరిణామాలను కల్పించకుండా ప్రత్యేక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కేంద్రం ఎంత త్వరగా ఏర్పాటుచేస్తే అంత మంచిది. లేదా సంక్షోభం తప్పదు. ఉభయ ప్రాంతాలవారికీ కేంద్రంమీద విశ్వాసం హరించింది.
***
[గోరా శాస్త్రిగారి పరిచయం www.pustakam.net నుండి]
గోరాశాస్త్రి అన్న పేరుతోనే అందరికీ తెలిసిన కీర్తిశేషులు శ్రీ గోవిందు రామశాస్త్రి ప్రముఖ జర్నలిస్టు, సంపాదకుడు, సాహితీవేత్త. ఖాసా సుబ్బారావుగారి వద్ద తెలుగు స్వతంత్రలో ప్రారంభించి, తర్వాత ఆ పత్రికకే సంపాదకులయ్యారు. ఆతర్వాత 1961 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు, వారపత్రికకు 1982లో ఆయన మరణం వరకు సంపాదకులుగా పనిచేశారు. నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి… సునిశిత విమర్శతో హాస్యాన్నీ, వ్యంగాన్నీ, ధర్మాగ్రహాన్నీ, సాహితీ వైదుష్యాన్నీ సమపాళ్లలో మేళవించే గోరాశాస్త్రి సంపాదకీయాలంటే పాఠకులు చెవికోసుకునేవారని ఆరోజులు తెలిసిన వారు చెపుతుంటారు.