mt_logo

అలుపెరగని అజాతశత్రువు!

ఫొటో: తెలంగాణ మానవహారంలో పాల్గొంటూ – ఫిబ్రవరి 2010 

రెండు వారాలు ఉద్యమంలో పాల్గొని, తెలంగాణలో తమని మించిన మొనగాడు లేడనుకునేవాళ్లకు; ఉద్యమ నాయకత్వాన్ని విమర్శించడమే ఉద్యమం అనుకునేవాళ్లకు; ఒక్క కార్యక్రమం చేసి వంద ఫొటోలు, వీడియోలు, మీడియా క్లిప్పింగులు ఫేస్ బుక్కులో షేర్ చేసేవాళ్లకు “ఉద్యమం అంటే ఆచరణ “అని సైలెంటుగా చెప్తున్నాడు డీపీరెడ్డి.

ఆరుపదులు దాటినా ఆ తెలంగాణ ఉద్యమకారుడు అలసిపోలేదు. నాలుగు దశాబ్దాల పైచిలుకు ఉద్యమంలో మమేకమై ఇప్పటికీ తన వయసులో సగం కూడా లేని యువకులను ఉత్సాహపరుస్తూనే ఉన్నాడాయన. పెద్దగా ప్రచార, పటాటోపాలు లేకుండానే ఉద్యమ విజయానికి కీలకమైన కార్యక్రమాలన్నెటినో చక్కబెడుతున్న ఆ ఉద్యమకారుడి పేరు దోమ పాండురంగారెడ్డి అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ డీపీ రెడ్డి అంటే తెలవని వారు తెలంగాణ ఉద్యమంలో అరుదుగా ఉంటారు.

వికారాబాద్ మండలంలోని పాటూర్ గ్రామంలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన డీపీ రెడ్డి కెమికల్ ఇంజినీరింగులో ఎంటెక్ చేశారు.

ఇంజినీరింగ్ విద్యార్ధిగా ఉన్నప్పుడే 1969 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలుకు కూడా వెళ్లారాయన. ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు 1970లో మర్రి చెన్నా రెడ్డి మేనకోడలు అయిన రేఖగారిని వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి చెన్నారెడ్డే పెళ్లి పెద్దగా వ్యవహరించారు. “జై తెలంగాణ” అని ముద్రించి ఉన్న ప్యాకెట్లలో అక్షింతలు ఉంచారాయన పెళ్లిలో.

వివాహానంతరం ఒక బహుళజాతి చమురు కంపెనీలో ఉద్యోగం కొరకు ఇరాన్ వెళ్లారు డీపీ రెడ్డి. ఆయన అక్కడున్నప్పుడే ఇరాన్ లో షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్నది. దేశమంతా అల్లకల్లోలంగా ఉన్న ఆ పరిస్థితిలో కంపెనీవారు డీపీ రెడ్డి కుటుంబాన్ని ఏథెన్స్ కు తరలించారు. అక్కడ మూడు వారాలున్న తరువాత అక్కడి నుండి నైజీరియా వెళ్లారు ఆయన.

మూడు దశాబ్దాల ప్రవాస జీవితం తరువాత 1990ల్లో ఇండియాకు తిరిగి వచ్చి తన స్వంత గడ్డకు ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక ఆగ్రో పరిశ్రమను నెలకొల్పారు ఆయన. 2007లో ఆ వ్యాపారం నుండి వైదొలగి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడిఎఫ్) – ఇండియా విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తూ తన పూర్తి సమయాన్ని ఉద్యమానికే అంకితం చేశారు.

ఫొటో: తెలంగాణ మిలియన్ మార్చ్ లో కదం తొక్కుతూ – మార్చ్ 2011 

టీడిఎఫ్ కార్యక్రమాలను తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా నిర్వహించడంలో డీపీరెడ్డిదే ప్రధాన పాత్ర.

జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ వేసినప్పుడు దాదాపు యాభై మంది తెలంగాణ మేధావులను ఒకచోటికి తెచ్చి తెలంగాణకు జరిగిన అన్యాయంపై శాస్త్రీయ ఆధారాలతో కమిటీకి ఒక సమగ్ర నివేదిక ఇచ్చారు. అంతే కాకుండా శ్రీకృష్ణ కమిటీ సభ్యులను స్వయంగా కలుసుకుని తమ వాదన వినిపించారాయన.

ఇక శ్రీకృష్ణ కమిటీ ఒక అన్యాయమైన, తప్పుల తడకల రిపోర్టు ఇచ్చినప్పుడు మరొకసారి ఆ రిపోర్టులోని తప్పులను ఎత్తి చూపుతూ “Justice Srikrishna’s Injustice” పేరుతో ఒక పుస్తకం ప్రచురించడానికి చొరవ తీసుకున్నారు డీపీ రెడ్డి. పుస్తక ప్రచురణతో ఆగిపోకుండా ఆ పుస్తకాన్ని డిల్లీ వరకూ వెళ్ళి అక్కడి పార్టీ పెద్దలకు స్వయంగా అందజేసి వచ్చారాయన.

శ్రీకృష్ణ కమిటీలోని రహస్య అధ్యాయాన్ని వెలికితీయడంలో కీలకపాత్ర పోషించి, ఆ అధ్యాయంపై వచ్చిన కోర్టు తీర్పును వెంటనే తెలుగులో ప్రచురించి తెలంగాణలో అందరికీ తెలిసేలా చేశాడాయన.

తెలంగాణ విద్యార్ధులకు ఉద్యోగాలు పొందడానికి అవసరమైన శిక్షణ ఇప్పించడంలో, ఉద్యమంలో అరెస్టయిన విద్యార్ధులకు బెయిల్ ఇప్పించడంలో, తెలంగాణ ప్రజాసంఘాలవారికి సహాయం చేయడంలో, ఇలా ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతిరోజూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు.

మలిదశ ఉద్యమం మొదలైన తరువాత కరీం నగర్ ఉప-ఎన్నికలు మొదలుకొని , 2009 నుండి ఉధృతమైన ఉద్యమంలోని ప్రతి ఘట్టంలోనూ ఆయన ముఖ్య భూమిక పోషించాడు. అటు జేయేసీ, ఇటు రాజకీయ పార్టీలతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ వివిధ ఉద్యమ కార్యక్రమాలను రూపొందించడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడాయన.

ఉద్యమ నాయకత్వానికి ఏమాత్రం దగ్గర అయినా, ఆ “అనుబంధాన్ని” ఏదో ఒక విధంగా క్యాష్ చేసుకోవాలనుకునే వారు కోకొల్లలుగా ఉన్న నేటిరోజుల్లో, ఏమీ ఆశించకుండా ఒక సామాన్య కార్యకర్తలా నిబద్ధతతో ఉద్యమంలో పాల్గొనే డీపీ రెడ్డిలాంటి వారు చాలా అరుదు.

నలుగురు కలిసి ఒక ఉద్యమ సంస్థ పెట్టి, నాలుగు రోజులు గడవకుండానే వ్యక్తిగత ఎజెండాలు, అహాల వల్ల అయిదు ముక్కలు అయ్యే నేటిరోజుల్లో, ఇన్నేళ్లుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం – ఇండియా సంస్థను సమర్ధవంతంగా నడపడం ఆయన కార్యదీక్షకు గీటురాయి.

ఒక పార్టీ వారికి కొమ్ము కాయకుండా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్న రాజకీయ, రాజకీయేతర నాయకులని, సంస్థలనూ నిరంతరం సమన్వయం చేసుకునే డీపీరెడ్డి, మన ఉద్యమంలో ఒక అరుదైన అజాతశత్రువు!

(గత యేడాది “కందెన” పత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసానికి కొద్దిగా తాజా సమాచారం జతచేశాను.)

(By: కొణతం దిలీప్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *