ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు మధ్యాహ్నం నగరంలోని ఐడీహెచ్ కాలనీలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న రెండు బెడ్రూంల ఇళ్ళ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండు లోగా గృహ సముదాయాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత నాలుగునెలల క్రితం సీఎం ఈ కాలనీలో పర్యటించి అక్కడ నివాసం ఉంటున్న పేదలకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు ఐడీహెచ్ కాలనీలో ఇళ్ళ నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ అంటే పేదల కళ్ళలో ఆనందం చూడడమేనన్నారు. రెండు పడక గదుల ఇళ్ళను రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్రంలోనే ఉత్తమ నమూనాగా ఐడీహెచ్ కాలనీ ఉంటుందని మంత్రి చెప్పారు. అక్టోబర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాలనీ నిర్మాణానికి పునాది రాయి వేశారని, జనవరిలో పనులు ప్రారంభం అయ్యాయని, జూన్ రెండవ తేదీలోపు నిర్మాణం పూర్తి చేస్తామని తలసాని పేర్కొన్నారు.