mt_logo

అసెంబ్లీలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్!!..

శాసనసభలో చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు, పేదలకు సరళీకృతమైనటువంటి కొత్త చట్టాన్ని ఈ సభలో ప్రతిపాదిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బిల్లు వర్తిస్తుంది. భూమిని ఉత్పత్తి సాధనంగా గుర్తించడంతో దాని విలువ పెరిగింది. నేటికీ భూ సమస్యలు చాలా ఉన్నాయి. భూ సంస్కరణల్లో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తీసుకువస్తున్నామని, ప్రజలకు మేలు చేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్ధేశమని అన్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వీఆర్ఏలకు తీపి కబురు అందిస్తున్నామని, వారిని స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేషన్, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖల్లో భర్తీ చేస్తామని, రెవెన్యూ సంస్కరణల వల్ల వారికి ఎలాంటి సమస్య ఉండదని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గత మూడేళ్లుగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 5,485 మంది వీఆర్వోలు వర్కింగ్ లో ఉన్నారు. వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వీరి ఉద్యోగాలు ఎక్కడికీ పోవు. రాబోయే రోజుల్లో వారికి ఆప్షన్లు ఇస్తాం. తాసీల్దార్లు, ఆర్డీవోలు అలాగే ఉంటారు. భూ వివాదాలపై తాసీల్దార్లు, ఆర్డీవో, జేసీలు ఆర్డర్లు ఇస్తారని చెప్పారు. ఆర్డర్లు ఇచ్చిన రెవెన్యూ అధికారుల వద్దే కోర్టులు ఉండడం సరైన పద్దతి కాదని, ఇకనుండి రెవెన్యూ కోర్టులు ఉండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇకనుండి తాసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని, వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే అధికారం వారికి ఉంటుందన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తామన్నారు. ధరణి పోర్టల్ లో పంచాయితీ, పురపాలిక, నగరపాలిక, జీహెచ్ఎంసీ ఆస్తుల వివరాలు ఉంటాయని, ఎవరు ఎక్కడున్నా ఉన్న చోటినుండే వారి ఆస్తుల వివరాలు చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందే అలాట్ చేయాలి. అలాట్ చేసిన వివరాలు వెబ్ సైట్ లో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం ముందే ప్రజలు స్లాట్ అలాట్మెంట్ కోరాలి. విద్యావంతులైతే డాక్యుమెంట్లు వాళ్ళే రాసుకోవచ్చు. కావాలంటే ఫీజు చెల్లించి డాక్యుమెంట్ రైటర్ సాయం తీసుకోవచ్చు. క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే పోర్టల్ లో అప్ డేట్ అవుతాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సహా అన్ని సేవలు ఏకకాలంలో పూర్తవుతాయని సీఎం కేసీఆర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *