mt_logo

గతంలో కాంగ్రెస్ దగాకోరు రాజ్యం సృష్టించిన పెద్ద సమస్య ఉంది: మహేశ్వరం సభలో సీఎం

బడంగ్‌పేట, మీర్‌పేట, జల్‌పల్లి, తుక్కుగూడలలో గతంలో కాంగ్రెస్ దగాకోరు రాజ్యం సృష్టించిన పెద్ద సమస్య ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మహేశ్వరం ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. వర్షాలొచ్చినప్పుడు ఇక్కడి చెరువుల్లోని నీళ్లను విడిచిపెడితే లోతట్టు ప్రాంతాలు కొట్టుకుపోతాయి. విడువకుంటేనేమో పైభాగంలోని కాలనీలు మునుగుతాయి. ముందు నుయ్యి..వెనుక గొయ్యి లాగా తయారైంది. సబితమ్మ పుణ్యమాని హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెయ్యి కోట్ల రూపాయలతో నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకుని బాగుచేసుకున్నం అని తెలిపారు. సబితమ్మ చొరవతోనే బడంగ్ పేట, మీర్ పేట, జల్ పల్లి తదితర ప్రాంతాల్లో రూ.100 కోట్లతో నాలాలు, చెరువులను అద్భుతంగా సుందరీకరణ చేసుకున్నాం. ఈ విషయాన్ని మీరెప్పుడూ మరిచిపోవద్దన్నారు. 

ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేని సబితమ్మ

‘భూదేవి’కి ఎంత ఓపిక ఉంటుందో..‘సబితమ్మ’కు అంతే ఓపిక ఉంటుందని అన్నారు. ప్రతిరోజూ ప్రజలతో కలిసి ఉండే వ్యక్తి సబితమ్మ. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం సబితమ్మకున్నది. ఆమెకు ప్రజాసేవ తప్ప వేరే వ్యాపకం లేదని అన్నారు. సబితమ్మకు అందుబాటులో ఉన్న ప్రజల పనులను వెంటనే చేస్తారు. ఆపై ఉంటే నా దగ్గరికి వచ్చి మంజూరు చేయిస్తారని తెలిపారు.

సబితమ్మ కందుకూరు వరకు మెట్రో రావాల్సిందేనని..  

హైదరాబాద్‌లోని మహేశ్వరం, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ మొత్తం, సబర్బన్ ఏరియా ప్రాంతమంతా తాగునీటి కోసం చాలా సమస్యలు ఉండె. రూ.670 కోట్ల రూపాయలతో నగర శివారు ప్రాంతాలన్నింటికి కూడా తాగునీటి సమస్యను సబితమ్మ ఆధ్వర్యంలో తీర్చుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రత్యేకంగా వచ్చే పైప్ లైన్ కూడా పూర్తయితే మహేశ్వరంతో పాటు ఇతర సబర్బన్ ఏరియాలోను మంచినీటి సమస్య శాశ్వతంగా సమసిపోతుందని పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీలు, లా కాలేజీలను సబితమ్మ ఏర్పాటు చేయించింది. ఇవ్వాల కందుకూరులో మెడికల్ కాలేజీ వచ్చిందంటే కేవలం సబితా ఇంద్రారెడ్డి, రంజిత్ రెడ్డి ల పట్టుదల వల్లనే సాధ్యమైందని వివరించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 500 పడకల హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీలు వస్తాయి. కందుకూరు మంచి డెవలప్మెంట్ హబ్‌గా మారనున్నన్నది. కందుకూరు వరకు మెట్రో రావాల్సిందేనని కేబినేట్ మీటింగ్‌లోనే సబితమ్మ పట్టుబట్టి సాధించుకున్నది. మహేశ్వరం నియోజకవర్గంపై ఆమెకు అంత ప్రేమ ఉందని చెప్పారు. 

ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్ష మందికి ఉద్యోగాలు

మన బీఆర్ఎస్ ప్రభుత్వం  ప్రత్యేక చొరవతో తుక్కుగూడలో 52 కొత్త పరిశ్రమలు వచ్చాయి. జిల్లా కలెక్టరేట్ కూడా సమీపంలోనే ఉంది. ఇక్కడి ఫాక్స్ కాన్ పరిశ్రమ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఫాక్స్ కాన్ కంపెనీ వాళ్లు మన దగ్గర మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తయితే రెండు, మూడు లక్షల మందికి ఉద్యోగాలొస్తయని తెలిపారు. పరిశ్రమలు తేవడం, మౌలిక వసతుల మెరుగు, రోడ్లు, తాగునీరు పనుల అభివృద్ధిలో సబితమ్మ పడే తపన మామూలుగా ఉండదు.

సబితమ్మ ఒక సామాన్య కార్యకర్త 

సబితమ్మ ఎప్పుడు కూడా మంత్రినని గర్వపడే మనిషి కాదు. తాను ఒక సామాన్య కార్యకర్త అనుకొంటూనే పనిచేస్తుందని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాలా హుందాతనంగా, గౌరవంగా, పద్ధతిగా ఉంటూ మహేశ్వరం నియోజకవర్గాన్ని, హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తున్నది. మహేశ్వరంలో సబితమ్మ మాదిరిగా ప్రజా అభివృద్ధి సంక్షేమాలను పట్టించుకునే ఎమ్మెల్యే ఇప్పటివరకు రాలేదని స్పష్టం చేసారు. సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి.. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.