mt_logo

కలెక్టర్లతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

నగరంలోని హోటల్ మారియట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయ్యింది. రెండు రోజులపాటు ఈ సమావేశం జరగనుంది. తొలిరోజు కార్యక్రమం ఉదయం పదిన్నరకు ప్రారంభమై రాత్రి ఎనిమిదిన్నర వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారులు కూడా అదే బాటలో నడవాలని సూచించారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గత ప్రభుత్వాలు వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం రూ. 8700 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 27వేల కోట్లు ఖర్చు చేస్తుందని సీఎం చెప్పారు. సంక్షేమ పథకాల ఫలాలు నూటికి నూరుశాతం అందాలి.. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే. ప్రజల్లో మనం మమేకం కావాలి.. పాలు-నీళ్ళలా కలిసిపోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు పిలుపునిచ్చారు..

ఇంటింటికీ నల్లా నీళ్ళు అందించాలనే మాటకు కట్టుబడి ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం అమలుకోసం పంచాయితీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, జిల్లా, ఇతర శాఖల అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. మిషన్ కాకతీయ కార్యక్రమం మరింత స్ఫూర్తితో కొనసాగాలని, చెరువులను పూర్తి స్థాయిలో నింపితే మూడు సంవత్సరాల వరకు తెలంగాణలో ఎక్కడా కరువు ఛాయలు కనిపించవని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని కొందరన్నారు. కానీ విద్యుత్ అధికారులు, ఆ శాఖ మంత్రి విశేషంగా కృషి చేసి అందరి అంచనాలు తలకిందులు చేశారని, ఎక్కడా పంటలు ఎండలేదని, విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగిందని, పరిశ్రమలకు కూడా నిరంతర విద్యుత్ ఇస్తున్నామని సీఎం గుర్తుచేశారు.

జూలై రెండవ వారంలో హరితహారం వారోత్సవం జరపాలని, ప్రతినెలలో ఒక రోజు అర్బన్ డేగా, ఒక రోజు రూరల్ డేగా పాటించాలని, పట్టణాల్లో డంపింగ్ యార్డులు, కూరగాయల మార్కెట్లు, మాంసాహార మార్కెట్లు, పార్కులు ఏర్పాటు చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. పట్టణాలకు తరలించిన గ్రామీణ బ్యాంకులను మళ్ళీ గ్రామాలకు తీసుకుపోవాలని, జిల్లాల్లో అప్పటికప్పుడు అవసరాలు తీర్చడం కోసం ప్రతి జిల్లా కలెక్టరు వద్ద రూ. 10 కోట్ల నిధి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెన్షన్లు అర్హులందరికీ అందాలని, అనర్హులను, దొంగ కార్డులను ఏరివేయాలని, ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *