mt_logo

ఢిల్లీ ఆర్డినెన్స్ ను ఓడించేందుకు కేజ్రీవాల్ కు మా మద్దతు : సీఎం కేసీఆర్

జాతీయ రాజకీయాలు, భారత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్, అర‌వింద్ కేజ్రీవాల్ లు చర్చించుకున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ కోరుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్‌-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు తదితర కీలక విషయాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నది. ఇందుకోసం ఈనెల 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ ను కేంద్రం జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవటానికి జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేరొన్నారు. 

అయితే ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు మంత్రులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్‌ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని కేజ్రీవాల్‌ ఆరోపిస్తూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్‌ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. తెలంగాణ‌, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్, అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ క‌లిసి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగ్గురు ముఖ్యమంత్రులు సంయుక్త ప్రెస్ మీట్ లో ప్రసంగించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం:  

  •  దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ..గవర్నర్లు ఏంది?
  •  గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోంది
  •  వంగి వంగి కోటి  దండాలు పెట్టినా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారు

దేశంలో కేంద్రప్రభుత్వ ఆగడాలు, అరాచకాలు ఎక్కువైయ్యాయి, రాష్ట్ర ప్రభుత్వాలను సరిగ్గా పనిచేయనియ్యడం లేదు, ఆర్థికపరమైన ఇబ్బందులను కేంద్రం విపక్ష పార్టీలు ఉన్న ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దేశంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్ సీటును కైవసం చేసుకుంది. గ్రూప్-1 అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చింది అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ను కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది.  ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి…ఆ సంఘటనలు జరుగుతున్నాయి అన్నారు.

ఇందిరా గాంధీ లాంటి నాయకులకే ఓటమి తప్పలేదు, కేంద్రం ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలో ఉన్నారు. ఆర్డినెన్స్ ను ఓడించేందుకు కేజ్రీవాల్ కు మా మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్ సభ, రాజ్యసభ లో కేజ్రీవాల్ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది, మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమాణిస్తోందన్నారు.  మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలి. ఎమర్జెన్సీ వచ్చే ముందు అప్పుడు ఇలాగే జరిగింది. కర్ణాటక ప్రజలు బీజేపీ కి సరైన సమాధానం చెప్పారు..భవిష్యత్ లో దేశం అంతా నేర్పుతుంది. మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలి అన్నారు.