mt_logo

జననేత కేసీఆర్‌కు అడుగడుగునా నీరాజనాలు

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రజా ఆశీర్వాద సభలు దిగ్విజయంగా సాగుతున్నాయి. సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఎప్పుడూ మీ వెంటే మేమంటూ మద్దతు ప్రకటిస్తున్నారు. మరోసారి మీరే మా సీఎం అంటూ హర్షాతిరేకాలతో అభిమానం చాటుతున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో.. విజయ పథంలో సాగుతున్న ఈ సభలు గురువారం నాటికి 82 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతంగా పూర్తయ్యాయి. అందులో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరువులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించారు. 

ప్రతిపక్షాల వైఖరిపై విమర్శనాస్త్రాలు

గురువారం ప్రజా ఆశీర్వాదసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం వాడీవేడీగా సాగింది. ప్రతిపక్షాల వైఖరిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ఎండగట్టారు. బీఆర్ఎస్ అంటే భరోసా అని చాటి చెప్పారు. ప్రతిపక్షాల మాటల మాయలో పడి.. ఆగం కావొద్దన్నారు. ఆలోచించి ఓటు వేయాలన్నారు. దళితుల జీవితాల్లో దళితబంధు పథకం ఏవిధంగా వెలుగులు నింపిందో వివరించారు. ఏండ్ల తరబడిగా ఉన్న సాగునీటి కష్టాలు, తాగునీటి బాధలన్నింటిని దూరం చేసిన ఒకేఒక పార్టీ బీఆర్ఎస్సే నన్నారు. ఆసరా .. అభాగ్యులకు అన్నం పెడితే, హరితహారం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందన్నారు. రైతు బంధు అప్పుల పాలు కాకుండా చేసిందనీ.. రైతుబీమా.. ఆ రైతు కుటుంబానికి భరోసాగా మారిందన్నారు.  ఈ పథకాలు నిర్విరామంగా కొనసాగాలన్నా.. రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్ళాలన్నా బీఆర్ఎస్ తోనే సాధ్యమని ముఖ్యమంత్రి తెలిపారు. 

కాంగ్రెస్ వస్తే అవినీతి, లంచగొండితనం 

నిన్నటి సభల్లో భాగంగా తొలుత  మహేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే .. ధరణిని తీసేస్తామంటున్నారని.. 3 గంటల విద్యుత్తే చాలంటున్నారని మండిపడ్డారు. అదే జరిగితే మళ్లీ అవినీతి, లంచగొండితనం తప్పవని సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు. రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలు డబ్బులు నేరుగా మీ అకౌంట్లలోకి చేరాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితేనే సాధ్యమని సూచించారు.  మహేశ్వరం అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజలకోసం పనిచేసే వ్యక్తని… తనను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయని అన్నారు. కందుకూరుకు మెడికల్ కాలేజీ వచ్చిందంటే సబితా ఇంద్రారెడ్డినే కారణమన్నారు. ఎన్నో ప్రాంతాల్లోని తాగునీటి సమస్యను, ముంపు సమస్యను పరిష్కరించారని తెలిపారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కొత్త పరిశ్రమలను తీసుకువచ్చినట్లు సీఎం తెలిపారు.

ద‌ళిత స‌మాజం దోపిడీకి, అణచివేతకు, గురి 

అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వికారాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని.. ప్రసంగించారు. ద‌ళిత స‌మాజం త‌ర‌త‌రాలుగా దోపిడీకి, అణచివేతకు, వివక్షకు గుర‌య్యిందన్నారు. కాంగ్రెస్ గ‌వ‌ర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంకా పేద‌రికం ఎందుకు ఉండేది ద‌ళితుల్లో అని ప్రశ్నించారు. ఇంత అధ్వాన్నమైన ప‌రిస్థితి ఎందుకు ఉండేదన్నారు. దళితుల్ని ఓటుబ్యాంకుగా వాడుకున్నారే త‌ప్ప సంక్షేమానికి పాటు ప‌డ‌లేదని ధ్వజమెత్తారు భార‌త‌దేశంలో ఎక్కడ.. ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ, ఏ ప్రధాని ఆలోచించ‌ని ప‌ద్ధతుల్లో మేం ఆలోచించి ద‌ళిత‌బంధు పెట్టినం. మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయి అని కేసీఆర్ తెలిపారు.

ద‌ళిత కుటుంబాలు ధ‌నిక కుటుంబాలు.. 

ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో హుజురాబాద్ నియోజ‌కవ‌ర్గంలో ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు అమ‌లు చేశామ‌ని, ఇప్పుడు అక్కడ ద‌ళిత వాడ‌లు.. దొర‌ల వాడ‌ల మాదిరిగా త‌యారు అయ్యాయ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే మెతుకు ఆనంద్‌ను గెలిపిస్తే వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఒకే విడుత‌లో ద‌ళిత బంధు పెడుతానని..ఈ దెబ్బతో ద‌ళిత కుటుంబాలు మొత్తం ధ‌నిక కుటుంబాలు అవుతాయన్నారు. “ఎవ‌డో ఎల్లయ్య గెలిస్తే వ‌చ్చేది ఏం లేదు. ఆనంద్ గెలిస్తే ప్రతి ద‌ళిత కుటుంబం బంగారు కుటుంబం అయిత‌ది కాబ‌ట్టి నా మేసేజ్‌ను ప్రతి గ‌డ‌ప‌కు తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిపించండని”కోరారు. వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని కుటుంబాల‌కు ద‌ళిత‌బంధు ఇచ్చి వికారాబాద్ ద‌రిద్రాన్ని తీసి అవ‌త‌ల ప‌డేద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

నమ్మి ఓటేస్తే కర్నాటకలో గతే.. 

అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు నమ్మి ఓటేస్తే కర్నాటకలో గతే చేస్తారని, మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తారని హెచ్చరించారు. అక్కడ ఐదు గంటల కరెంటు ఇస్తున్నారని.. తెలంగాణలోనూ అదే పరిస్థితిని తీసుకువస్తారన్నారు. ‘దబ్బన కాంగ్రెస్‌ గెలిస్తే మిమ్మల్ని కర్నాటక గతే చేస్తమని వాళ్లు ఓపెన్‌గా చెబుతున్నరు. మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోలించి ఓటు వేయాలి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చర్చ పెట్టాలని సూచించారు. ఎన్నికలకు ఐదారు రోజులు టైమ్‌ ఉంది. అన్ని గ్రామాల్లో ఈ విషయాలపై చర్చ జరిగితే.. క్యూ కట్టి మనకు ఓట్లు గుద్దుతరు. కాబట్టి ఆ పని చేయాలని కోరుతున్నానన్నారు. మాణిక్‌రావును మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.

కాలుష్యం త‌గ్గేందుకు కాలుష్య ర‌హిత ప‌రిశ్రమ‌లు 

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరులో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఇస్నాపూర్ వ‌ర‌కు మెట్రో వ‌స్తద‌ని కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోట‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు కూడా మెట్రో వ‌చ్చేస్తే ప‌టాన్‌చెరు ద‌శ‌నే మారిపోత‌ది అని కేసీఆర్ పేర్కొన్నారు. ప‌టాన్‌చెరులో ప‌రిశ్రమ‌ల కాలుష్యం వ‌ల్ల ఎటువంటి నీళ్లు తాపారు కాంగ్రెస్ రాజ్యంలో అని గుర్తు చేశారు. ఎలాంటి జ‌బ్బులు వ‌చ్చేవి. ఎలాంటి చ‌ర్మ వ్యాధులు వ‌చ్చేవి. ఈరోజు మ‌న సొంత రాష్ట్రం కాబ‌ట్టి, మ‌న‌కు క‌డుపు నొప్పి ఉంట‌ది కాబ‌ట్టి.. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ప్రతి రోజు ప‌రిశ్రుభ్రమైన నీళ్లు అందిస్తున్నాం. ఇప్పుడు ఆ జ‌బ్బుల బాధ త‌ప్పింది. రోగాల బాధ త‌ప్పిందని తెలిపారు. ప‌టాన్‌చెరులో కాలుష్యం త‌గ్గేందుకు కాలుష్య ర‌హిత ప‌రిశ్రమ‌లను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం ప్రజలను కోరారు. అప్పుడే అభివృద్ధి ప్రగతి పథంలో సాగుతుందని తెలిపారు.