mt_logo

సేవచేయాలనే ప్రజాక్షేత్రంలోకి…

– 2004 నుంచే ఎన్నికల్లో పాలుపంచుకుంటున్నా
– జీవో 111కు శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ
– జాతీయ పార్టీలు కాదు.. జాతీయ భావం కలిగిన కేసీఆర్ అవసరం
– చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థ్ధి డాక్టర్ రంజిత్‌రెడ్డితో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ

మహానగరం, ఐటీ కారిడార్, పారిశ్రామిక రంగం, సెమీ అర్బన్, గ్రామీణం, వెనుకబడిన ప్రాంతం, వైవిధ్యమైన వ్యవసాయం. అన్నిమతాలు, కులాలు, రాష్ట్రాలవారు నివసిస్తున్న ప్రాంతం. ఓ వైపు ఫ్లైఓవర్లు, మల్టీ ఫ్లైఓవర్లు, ఎత్తయిన, అందమైన భవంతులు, మరోవైపు పల్లెటూర్లు.. ఇలా కలబోసిన పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ల. జీహెచ్‌ఎంసీ, మున్సిపాల్టీలు, పంచాయతీలు కలిగిన ఈ ప్రాంతంలో ఎవరు పాగా వేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. అయితే టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడనున్నదని అన్ని సర్వేలు, విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, కష్టించేతత్వం, తెలంగాణ భావాన్ని పుణికిపుచ్చుకున్న డాక్టర్ రంజిత్‌రెడ్డిని టీఆర్‌ఎస్ బరిలో నిలిపింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా.. మాటతీరు, అన్నిఅంశాల్లో స్పష్టత ఓటర్లను ఆకట్టుకుంటున్నది. అందరినీ కలుపుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. కేంద్రంలో జాతీయ పార్టీలు కాదు. జాతీయ భావం కలిగిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావులాంటి మహనీయులు అవసరం అంటున్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్ధి డాక్టర్ రంజిత్‌రెడ్డితో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.

రాజకీయ ప్రవేశం ఎలా ఉన్నది?
రాజకీయాలకు నేను కొత్తేమీ కాదు. 2004 నుంచి మంత్రి ఈటల రాజేందర్ వెంట నడిచా. ఎన్నో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నా. ప్రజలు, కార్యకర్తల మనోభావాలు తెలుసు.

పౌల్ట్రీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు?
నా చిత్తశుద్ధి, క్రమశిక్షణతో పౌల్ట్రీ పరిశ్రమలో ఎదిగి స్థ్ధిరపడ్డా. 1990లో నెలకు రూ.3 వేల జీతానికి పనిచేశా. 1995లో రూ.5 వేలు జీతం అయ్యింది. 1996లో నా స్నేహితుడు తిరుపతిరెడ్డితో కలిసి రూ.2 లక్షలతో పౌల్ట్రీ పరిశ్రమలోకి ప్రవేశించా. బాగా కష్టపడ్డా. కష్టం తెలుసు, సుఖం తెలుసు. డబ్బుల విలువ తెలుసు. ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయంతోనే రాజకీయాల్లోకి వచ్చా.

పౌల్ట్రీ రంగానికి ఏం చేశారు?
1990 నుంచి ఈ రంగంలోనే ఉన్నా. బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆరేండ్ల నుంచి కొనసాగుతున్నా. అంతకు ముందున్న వాళ్లు అభివృద్ధి చేశారు. నా అదృష్టం కొద్దీ తెలంగాణ వచ్చింది. సీఎంగా జననేత కేసీఆర్ అయ్యారు. పౌల్ట్రీ రంగానికి అదృష్టం. పౌల్ట్రీ రంగానికి ఎంతో చేయూతనిచ్చారు. సబ్సిడీతో విద్యుత్, దాణాకు అవసరమైన మక్కజొన్నలు సరఫరా వంటి అనేకం చేశారు. దేశంలో రూ.లక్ష కోట్ల టర్నోవర్ పరిశ్రమలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంచాలని సీఎం కేసీఆర్ నన్ను ఆదేశించారు. పౌల్ట్రీ రంగాన్ని గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్. ఆయన అడుగు జాడల్లోనే ఎంతో అభివృద్ధిని సాధించినం. అంతకు ముందు మా అసోసియేషన్ ద్వారా కాంగ్రెస్, టీడీపీ మంత్రులను, నాయకులను ఎంతో మందిని కలిశాం. ఎవరూ మా పరిశ్రమను గుర్తించలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే మమ్మల్ని గుర్తించి ప్రోత్సహించారు.

మొదటిసారిగా పోటీ చేస్తున్నారు. రాజకీయ అనుభవం ఉన్నదా?
పోటీ చేస్తున్నది మొదటిసారే. కానీ రాజకీయ అనుభవం పుష్కలంగా ఉన్నది. ఎన్నో ఎన్నికలను చూశా. క్యాంపెయిన్‌లో పాల్గొన్నా. ఎలా ప్రచారం చేయాలో తెలుసు. ప్రజలకు ఏం చేయాలో తెలుసు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని అధ్యయనం చేశారా?
అందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఎన్నోసార్లు కూర్చున్నా. నియోజకవర్గంపై స్టడీ చేశా. ఇంతటి వైవిధ్యమైన నియోజకవర్గం మరొకటి లేదు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్, వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే గుర్తించిన సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలిశా. ఏమేం సమస్యలున్నాయో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లా. బీ ఫారం తీసుకునేటప్పుడే అన్నింటినిపైనా స్పష్టమైన హామీ తీసుకున్నా. ఎంపీగా గెలువగానే ఒక్కొక్క సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తా. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు.

కొండాను ఢీ కొట్టగలరా?
నిజమే.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అత్యంత సంపన్నుడు. కానీ నేను ఆ స్థాయిలో లేను. కొండంత అండగా సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు.. అందరి కంటే గొప్పగా టీఆర్‌ఎస్ క్యాడర్ ఉన్నది. కార్యకర్తలే నాకు కొండా కంటే ఎక్కువ బలం. వాళ్లంతా నా వెంట ఉన్నారు. కచ్చితంగా ఢీకొడుతా. చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడిస్తా. పార్లమెంట్‌లో నా గళం వినిపిస్తా. నియోజకవర్గానికి, రాష్ట్రానికి అవసరమైన నిధులు రాబడుతా. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం?
జాతీయ పార్టీలు కాదు. జాతీయతా భావం కలిగిన కేసీఆర్ దేశానికి అవసరం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశం ఆచరణలోకి తీసుకురాక తప్పని అనివార్యత ఏర్పడింది. రైతు, కార్మికుడు, ఉద్యోగి, పారిశ్రామికవేత్త, విద్యార్థ్ధులు, వృద్ధ్దులు, మహిళలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు.. ఇలా ఒక్కరా ఇద్దరా అన్నివర్గాలను ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న కేసీఆర్ వంటి సీఎం దేశంలో ఎక్కడా కనిపించరు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను రూపకల్పన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఆఖరికి ప్రధాని నరేంద్రమోదీ రైతులకు సాయం అందించేందుకు పథకాన్ని ప్రవేశపెట్టారంటే ఎవరి పుణ్యం? కేసీఆర్‌ది కాదా? అందుకే జాతీయ పార్టీల శకం ముగుస్తున్నది. జాతీయతాభావం కలిగిన టీఆర్‌ఎస్‌లాంటి ప్రాంతీయ పార్టీల ప్రాభవం దండిగా పెరుగుతున్నది.

పారిశ్రామిక రంగానికి కేంద్రం ఎలాంటి ప్రోత్సాహం అందించాలి?
కేంద్ర ప్రోత్సాహం అనివార్యం. ఏ పరిశ్రమనైనా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించినప్పుడే ఉత్పాదక శక్తి పెరుగుతుంది. దాని ద్వారా ఉపాధి కల్పన సాధ్యం. వ్యవసాయోత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. దాని ద్వారా రైతాంగానికి గిట్టుబాటు ధర లభిస్తుంది. ఎంపీలు వినోద్‌కుమార్, కవితక్కలాంటి వాళ్లు కేంద్రంతో పోరాడి నిధులు సాధిస్తున్నారు. నేనూ వారి బాటన నడుస్తా. అవసరమైన అన్నిరకాల పరిశ్రమలకు తోడ్పాటు అందేలా కృషి చేస్తా.

మీ ప్రత్యర్థుల గురించి ఏం చెప్తారు?
ప్రజలకు అందుబాటులో ఉండరు. పార్లమెంట్‌లో 95 శాతం అటెండెన్స్ ముఖ్యం కాదు. ఏం సాధించాం? ఎన్ని నిధులు తీసుకొచ్చాం? సమస్యల పరిష్కారానికి ఏ మేరకు పోరాడాం అన్నది ముఖ్యం. అవేవీ వారికి లేవు.

తక్కువ సమయం ఉన్నది. ప్రజలందరినీ కలుసుకోగలరా?
కార్యకర్తల అండదండలతో ప్రతి గ్రామం, కాలనీకి వెళ్లడానికి ప్రణాళిక రూపొందించా. అమలుకు శ్రీకారం చుట్టా. ప్రజలతో మమేకమై పనిచేసే వ్యక్తిగా రుజువు చేసుకుంటా.

మీ బలం? మీ బలహీనతలు?
టీఆర్‌ఎస్ కార్యకర్తలు. అనేక సంక్షేమ పథకాలతో కడుపు నింపిన, ఆకలి తెలిసిన సీఎం కేసీఆర్. కష్టపడి పని చేసేటోడ్ని. ఎంతటి కష్టన్నైనా ఎదుర్కొంటా. నాకెలాంటి బలహీనతలు లేవు.

జీవో 111 సడలింపుపై మీరేం చేస్తారు?
హైదరాబాద్ నగర శివార్లలో చాలా అభివృద్ధి జరిగింది. కానీ జీవో 111 పరిధిలోని గ్రామాల్లోని రైతాంగం నిరాశా నిస్పృహలో ఉన్నారు. దీనిపై నేను పోటీ చేసేందుకు ముందుగానే సీఎం కేసీఆర్‌తో చర్చించా. ప్రత్యామ్నాయ పరిస్థితుల గురించి మాట్లాడా. అయితే సీఎం మాత్రం పూర్తిగా ఎత్తేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు అవసరం లేదని చెప్పారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి వరుసగా మూడేండ్లపాటు నగరానికి మంచినీళ్లు అవసరం లేని పరిస్థితులను, సదుపాయాలను కల్పించడం ద్వారా పూర్తిగా సడలించే అవకాశం ఉన్నది. కృష్ణా, గోదావరి జలాలతో నగరవాసులకు సరిపడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. త్వరలోనే జీవో 111 నుంచి విముక్తి లభిస్తుంది. రైతులు, ఆయా గ్రామాల వాళ్లకు ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ పనిని తప్పక పూర్తిచేస్తా. మాటలు చెప్పి తప్పించుకునే మనిషిని కాదు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *