mt_logo

నాడు ఎరువులు క‌రువు.. నేడు సీజ‌న్‌కు ముందే రైతు ఇంట్లో బ‌స్తాలు!

  • సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం
  •  2 లక్షల నుంచి 5 లక్షల టన్నులకు బ‌ఫ‌ర్ స్టాక్‌

స‌మైక్య పాల‌న‌లో ప్ర‌తి పంట‌కాలానికి ముందు రాష్ట్రంలో ఎరువులు కొనాలంటే ప‌డ‌రాని పాట్లు పడాల్సిందే. క్యూలైన్ లో చెప్పులు.. చేతిలో టోకెన్ల‌తో దుకాణాల ఎదుట బారులు తీరాల్సిందే. బ‌స్తాల కోసం స‌ర్క‌స్ ఫీట్లు వేస్తూ లాఠీ దెబ్బ‌లు తినాల్సిందే. ఎరువుల కోసం క్యూలైన్లోనే ప్రాణాలు వ‌దిలిన అన్న‌దాత‌లు కూడా ఉన్నారు. కానీ, స్వ‌రాష్ట్రంలో ఇదంతా ఇక గ‌త‌మే.. సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో ఎరువుల స‌మ‌స్య అన్న‌దే క‌నిపించ‌డం లేదు. సీజ‌న్‌కుముందే పెట్టుబ‌డి సాయంతోపాటు ఎరువు బ‌స్తాలు రైతు ఇంట్లో.. క‌ల్లాల‌కాడ వాలిపోతున్నాయి. అన్న‌దాత ఆనందంగా సాగుకు ఉప‌క్ర‌మించేలా ఉత్తేజాన్నిస్తున్నాయి. మ‌రి ఇందుకోసం సీఎం కేసీఆర్ ఏం చేశారు..? ఆయ‌న డైరెక్ష‌న్‌లో వ్య‌వ‌సాయ శాఖ ఎలా ప‌నిచేసింది? అన్న‌దాత‌ల క‌ష్టానికి ఎలా చెక్ చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ ఏర్పడే నాటికి ఎరువుల కొరత భారీగా ఉన్నది. కేసీఆర్‌ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించారు. రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి, నేటి శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు వ్యవసాయశాఖ అధికారులతో సుదీర్ఘ మంతనాలు జ‌రిపారు. ఎరువుల కొరత ఎందుకు వస్తున్నది? ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? కేంద్రంలో ఎరువుల నిల్వలు ఏ స్థాయిలో ఉ న్నాయి? అనే అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొన్నారు. ఈ అంశాల ఆధారంగా సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేదానిపై సీఎం కేసీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేశారు.

చిన్న లాజిక్‌తో స‌మ‌స్య‌కు చెక్‌!

మనదేశంలో ఏడాదంతా పంటల సాగు తీరు ఒకేలా ఉండదు. ఏడాదిలో నాలుగైదు నెలలు ఎరువులతో రైతులకు అవసరమే ఉండదు. ఆ సమయంలో రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎరువులు కొనవు. ఈ లాజిక్‌నే సీఎం కేసీఆర్‌ దొరకబట్టారు. ఇతర రాష్ట్రాల‌కు ఎరువులు అవసరం లేని సమయంలో ఆ ఎరువులను మన రాష్ట్రం కొనుగోలు చేయాలి. తద్వారా సీజన్‌కు ముందే రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలి’ అని అధికారులకు నిర్దేశించారు.

ఫ‌లించిన పోచారం వ్యూహం

ఎరువుల సమస్యను పరిష్కరించడంలో నాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. సీజన్‌కు ముందుగానే ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడి.. ఎరువుల సరఫరాకు లైన్‌ క్లియర్‌ చేసేవారు. ఒక సీజన్‌ పూర్తయిందంటే చాలు.. తర్వాతి సీజన్‌కోసం కేసీఆర్‌ వ్యవసాయశాఖ మంత్రికి ఎరువుల గురించి గుర్తు చేసేశారు. ‘శీనన్నా ఢిల్లీకి పోయొచ్చినవా? ఏప్రిల్‌ నెల వచ్చింది.. సీజన్‌ దగ్గరపడ్తున్నది’ అని గుర్తు చేసేవారు. భవిష్యత్తు అవసరాల కోసం (బఫర్‌ స్టాక్‌) లేకపోవడమే నాటి ఎరువుల గోసకు ప్రధాన కారణం. రాష్ట్రం ఏర్పడే నాటికి 1.5-2 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే బఫర్‌ స్టాక్‌ ఉండేది. అవి ఏ మూలకూ సరిపోయేవి కావు. దీంతో బఫర్‌ స్టాక్‌ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఏప్రిల్‌, మే నెలల్లోనే కేంద్రం నుంచి ఎరువులు కొనుగోలు చేసి బఫర్‌ స్టాక్‌ను 5 లక్షల టన్నులకు పెంచింది. ముందస్తు ఎరువుల కొనుగోలు కోసం అదనంగా దాదాపు రూ. వెయ్యి కోట్లు అందజేసేవారు. 2015 నుంచి నేటి వరకు ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు.

ఎరువుల నిల్వ‌కు రేక్ పాయింట్స్‌

ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కాస్త ఎరువులను కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు, నిల్వ చేసేందుకు కనీస వసతులు ఉండే వి కావు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా కొనుగోలు చేసిన ఎరువులను సీజన్‌కు ముందే క్షేత్రస్థాయికి పంపిణీ చేసి, సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. రైలులో వచ్చే ఎరువులను నేరుగా జిల్లా స్థాయికి చేర్చేందుకు రేక్‌ పాయింట్స్‌ను పెంచింది. రైల్వే, ఎరువులు, రసాయనాల శాఖలతో చర్చలు జరిపి రేక్‌ పాయింట్స్‌ను 15 నుంచి 20కి పెంచింది. 2014లో 7.38 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములుండగా, ప్రస్తుతం 24.66 లక్షల టన్నులకు పెంచింది.

ప‌క‌డ్బందీగా పంపిణీ వ్య‌వ‌స్థ‌

గతంలో తక్కువ ఎరువులకు తోడు గందరగోళమైన పంపిణీ వ్యవస్థతో రైతులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్ది పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసింది. ఇందుకోసం గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌)ను ఎరువుల విక్రయంలో మరింత కీలకం చేసి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఆగడాలకు చెక్‌ పెట్టింది. ఎరువుల పంపిణీని మొత్తం ఆన్‌లైన్‌ చేసింది. ఏ జిల్లాలో ఎంత ఎరువులు అవసరం? ఎంత స్టాకు ఉన్నది? ఎవరి వద్ద ఎంత ఉన్నది? ఏ రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు విక్రయించారు? అనే వివరాలను కూడా ఆన్‌లైన్‌ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీని చేపట్టింది.

వినియోగం పెరిగినా స‌మ‌స్యే లేదు..!

నేడు వ్యవసాయం పండుగైంది. పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. అయినా కొరత లేదు. 2014లో రాష్ట్రంలో 1.31 కోట్ల ఎకరాల్లో సాగైతే, 2022-23లో ఇది 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. 9 ఏండ్లలో 90 లక్షల ఎకరాలు పెరిగింది. వరి విస్తీర్ణం 2014-15లో రెండు సీజన్లలో కలిపి 35 లక్షల ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 1.20 కోట్ల ఎకరాలకు చేరింది. 2014లో అన్ని ఎరువులు కలిపి 25 లక్షల టన్నులు వినియోగించగా, 2022 లో 40 లక్షల టన్నులకు పెరిగింది.

కావాల్సినంత యూరియా

ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న ఎరువుల సమస్యలో ప్రధానమైనది యూరియా కొరత. ఏ పంటకైనా యూరియానే ప్రధాన ఎరువుగా రైతులు వినియోగిస్తారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం యూరియా కొరతను అధిగమించగలిగింది. నాడు ఏడాదికి 13 లక్షల టన్నుల యూరియా వినియోగించగా, ప్రస్తుతం 20 లక్షల టన్నులకు పెరిగింది. అయినా కొరత లేకుండా రైతులకు యూరి యా పంపిణీ చేసింది. ఇందుకోసం ఎరువుల బఫర్‌ స్టాక్‌లో ఎక్కువగా యూరియాను ఉంచేది. గతంలో కేవలం లక్ష టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌ ఉంటే ఇప్పుడు 4 లక్షల టన్నుల యూరియాను బఫర్‌స్టాక్‌గా పెడుతున్నారు.