mt_logo

సల్లంగ బతుకు బిడ్డా!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17న తన 67వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పాలకుర్తి మండలం ముంజంపల్లి వేదికగా పచ్చని పంట పొలాల్లో ఆ పల్లె ప్రజలు “సీఎం కేసీఆర్ సల్లంగుండు బిడ్డా” అంటూ స్థానిక జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ తెలంగాణను దేశంలోనే ముందుండేలా కృషి చేస్తున్నారు. కాళేశ్వర జలాలతో బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చిన సీఎం తమ బాధలు తీర్చారని, బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ళ కోసం ఎదురుచూసిన తమకు తెలంగాణ పల్లెల్లోని కరువును తరిమి తెలంగాణను అన్నపూర్ణగా మారుస్తున్న భగీరథుడికి ఆర్తితో “సల్లంగ బతుకు బిడ్డా” అంటూ దీవెనలు అందిస్తున్నారు.

మరోవైపు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇటీవల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు, ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సినీ ప్రముఖులు చిరంజీవి, ఎమ్మెల్యే రోజా తదితరులు కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా ఈరోజు ఎంపీ సంతోష్ కుమార్ శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ పనికర్ తో కలిసి ప్రయాణీకులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జలవిహార్ లో రేపు ఉదయం 10.30 గంటలకు ఘనంగా జరగనున్నాయి. సీఎం కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో త్రీ డీ గ్రాఫిక్స్ తో రూపొందించిన 30 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారు. సీఎం 67 వ జన్మదినం సందర్భంగా 67 కిలోల కేకును శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కట్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను చాటిచెప్పడం, కుల వృత్తులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేలా రూపొందించిన పాటలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తదితరుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. మరోవైపు కళాకారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *