తెలంగాణకు రాజకీయ అస్తిత్వం లేకుండా చేయడానికే టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా ఆలోచించారు. అది సాధ్యం కాకపోగా, తెలంగాణ ప్రజలు తమ సొంత పార్టీని గెలిపించుకొని అభివృద్ధిపథంలో సాగిపోవడాన్ని కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులలో అనేక కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కాదా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలె. కానీ అబద్ధాలతో తెలంగాణ ప్రజలను నమ్మించలేరు.
తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమాత్రం లేదని, ఆ ఘనత అంతా కాంగ్రెస్ పార్టీదే అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ చెప్పుకోవడంతో, ఎవరి పాత్ర ఏమిటో మరొకసారి మాట్లాడుకోవలసిన అవసరం ఏర్పడ్డది. అసెంబ్లీ ఎన్నికల సందర్భం కనుక కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఆజాద్ ఏవో కొన్ని గొప్పలు చెప్పుకుంటున్నాడని అనుకోవచ్చు. కానీ కండ్ల ముందటి చరిత్రను మొత్తంగా వక్రీకరించి తెలంగాణ ప్రజలను మోసగించడం మాత్రం సాధ్యం కాదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ను కనీసం సంప్రదించలేదని అంటూనే, రాష్ట్ర ఏర్పాటు తరువాత తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత మోసం చేశారని కూడా ఆజాద్ అనడం ఆశ్చర్యకరం. ఆయన మాటలే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడం నిజమే అనుకుందాం. దీనిని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే షరతును కేసీఆర్ విధించారని ఆజాద్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసారో, పార్లమెంటులో, బయటా ఎన్ని నాటకాలు ఆడారో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఉద్యమం ఉధృతమయినప్పుడల్లా కేసీఆర్‌తో రాయబారాలు సాగించారో, ఎన్నిసార్లు మాటలు మార్చారో, ఎన్ని మడత పేచీలు పెట్టారో ఎవరూ మరిచిపోని ఇటీవలి చరిత్రే. తెలంగాణ ఏర్పాటులో ఎవరి పాత్ర ఏమిటంటూ చరిత్రను తవ్వడం ద్వారా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రను మరోసారి గుర్తు చేసినట్టయింది.
దశాబ్దాల పాటు కాంగ్రెస్ నాయకులను నమ్ముకొని మోసపోవడం వల్లనే తెలంగాణ ప్రజలు తమకంటూ ఒక సొంత రాజకీయశక్తి అవసరమని భావించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ సాధనకు తగిన వ్యూహాన్ని రచించుకొని అలుపెరుగని పోరాటం సాగించారు. చంద్రబాబును ఎదుర్కొనడానికి బెంబేలు పడుతున్న కాంగ్రెస్ నాయకులు 2004 ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి వీలుగా తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఏరు దాటాక తెప్ప తగులబెట్టినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాగానే తెలంగాణ ప్రజలకు మొండిచేయి చూపించి, తన నైజాన్ని మరోసారి చాటుకున్నది. ఇటు కాంగ్రెస్, పార్టీ అటు టీడీపీ దగాకోరు రాజకీయాల మధ్య, తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆయన నిరాహార దీక్ష చేపట్టడంతో తెలంగాణ అట్టుడికి పోయింది. అసెంబ్లీలోని పార్టీలన్నీ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించాయి. పార్లమెంటు దద్దరిల్లింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తూ, అప్పటి హోంమంత్రి చిదంబరం నోట కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడ్డది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న ఆజాద్‌కు ఈ విషయాలు తెలువవా? తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రా నాయకులు రాజీనామా డ్రామాలు ఆడుతుంటే, అందుకు పోటీగా తెలంగాణ నాయకులు రాజీనామాలు సమర్పించడానికి ముందుకురాలేదు. దీంతో తెలంగాణ ఏర్పాటు వెనుకకుపోయింది. టీఆర్‌ఎస్ నాయకులు రాజీనామా చేసిన నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికలలో ఇతర పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో తమ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడ్డది. నాడు తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ఆమోదం తెలిపాయంటే, అందుకు కారణం టీఆర్‌ఎస్ సృష్టించిన అనివార్యతే.
గత ఏడు దశాబ్దాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన మేలు ఏమీ లేకపోగా, ద్రోహాల చిట్టా చాంతాడంత పొడుగు ఉంటుంది. తరతరాల తెలంగాణ విషాదమంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీయే కాదా? ధర్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ నివేదికలకు విరుద్దంగా, ప్రజాభిష్టాన్ని ఖాతరు చేయకుండా, తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ఏర్పాటు కోసం 1969లో విద్యార్థులు ఉద్యమిస్తే, పిట్టలను కాల్చినట్టు కాల్చి అణగదొక్కింది కాంగ్రెస్ పాలకులే కాదా? పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కింది, సుప్రీంకోర్టు సమర్థించిన తరువాత కూడా ముల్కీ నిబంధనలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పాలకులే కాదా? దశాబ్దాలపాటు తెలంగాణకు నీళ్ళు, నిధులు, నియామకా లు దక్కకుండా చేసి, విధ్వంసం సృష్టించింది ఈ కాంగ్రెస్ పెద్దలే కాదా? విభజన చట్టంలో అనేక తెలంగాణ వ్యతిరేక నిబంధనలను చేర్చి ఇప్పటికీ అరిగోస పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణకు రాజకీయ అస్తిత్వం లేకుండా చేయడానికే టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా ఆలోచించారు. అది సాధ్యం కాకపోగా, తెలంగాణ ప్రజలు తమ సొంత పార్టీని గెలిపించుకొని అభివృద్ధిపథంలో సాగిపోవడాన్ని కాంగ్రెస్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులలో అనేక కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే కాదా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలె. కానీ అబద్ధాలతో తెలంగాణ ప్రజలను నమ్మించలేరు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో