mt_logo

బలుపు పనికిరాదు..జర జాగ్రత్త

By: అల్లం నారాయణ

బొడిగె శోభ ఒక దళిత స్త్రీ. ఒక ఎమ్మెల్యే. దళాల్లో తిరిగిన మాజీ. సామాన్యురాలయిన శోభ కొంత చైతన్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలో ప్రజల సమస్యల వెంట తిరిగింది. బొడిగె శోభ తెలంగాణ స్త్రీ. ఉద్యమంలో ముందు నిలిచింది. కేసీఆర్ అరెస్టయినప్పుడు ఆ తర్వాత తీవ్రంగా స్పందించింది. కేసీఆర్‌కు గుర్తుండిపోయింది. ఉద్యమానంతరం ఆరు దశాబ్దాల కల సాకారమయింది. కేసీఆర్ శోభకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.

బాల్క సుమన్‌కు అనుకున్న టికెట్ పోరాడి శోభ సాధించుకున్నది. గెలిచింది. ప్రజాస్వామ్యం, ఓట్ల పతనపు విలువలు, ఎన్నికల కంపు, పలుకుబడి, ప్రతిష్టలనన్నింటినీ ఎడమ చేతి చిటికెన వేలుతో పక్కకు తోసి, గత కాలపు క్షీణ విలువలను తొక్కి బొడిగె శోభ అసెంబ్లీకి చేరింది. ప్రమాణ పత్రం చదువుతూ నాకు భయమైతంది అన్నది. నాకెందుకో దిగులు కలిగింది. నాకెందుకో చెమ్మ గిల్లింది. నాకెందుకో పట్టరాని సంబురమేసింది. నాకెందుకో ధైర్యం కలిగింది. ఇప్పటి నా హీరోయిన్ బొడిగె శోభ. తెలంగాణ ఉద్యమం సాధించిన గొప్ప విజయం ఇది. ఒకవేళ తెలంగాణ ఉద్యమమే లేకపోతే, అది సాకారం కాకపోతే బొడిగె శోభ ఎమ్మెల్యే కాదు. కానీ… శోభ భయాన్ని వెకిలిగా చిత్రించిన మీడియాకు ఎంత మదం. ఎంత దురహంకారం. ఎంత మిడిసిపాటు.

టూరింగ్ టాకీస్‌ల పాత సినిమాలను సూశెటోళ్లను పట్టుకచ్చి మల్టీఫ్లెక్స్‌ల హాలీవుడ్ సినిమా సూపెడితె ఎట్లుంటది ఇగో ఇట్లనే ఉంటది అంటది మదమెక్కిన మీడియా. మనుషులకు, ప్రవర్తనలకు సున్నితత్వాలు ఉంటాయి. ఉద్వేగాలు ఉంటాయి. మనసూ ఉంటుంది. అవి స్పందిస్తాయనే కనీస స్పహ కొరవడిన మదం మీడియాది. ఏదైనా చెల్లుబాటు అవుతుంది. ఏదయినా చెలామణి అవుతుంది. ప్రమాణ స్వీకారం ఎపిసోడు కూడా కామెడీ కామెడీ అయిందట. కోట్లు కొల్లగొట్టినోళ్లు, లంగలు, లఫంగులు, దొంగలు, తెల్లబట్టలేస్కోని లోపట దొంగ దందాలను దాచుకునే క్రూరులు, నేరస్తులు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ మాటలు చదువుతుంటే కామెడీ అనిపించలే.

పాశికల్లు తాగెటోనికి ఫారెన్ మందు ముందలబెట్టినట్లే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కథ. ఇంత పరాకాష్ట. ఇంత వికృతమా? పాశికల్లు తాగెటోడు మందిని ముంచడు. రెండెకరాలోడు వేలకోట్ల అధిపతి కాలేడు. వేల కోట్లా? లక్షల కోట్లా ముంచిందెంత? మూడగట్టుకున్నదెంత? తేలక జైలుకు పోడు. ఓటుకు అయిదువేలిచ్చి గెలిచొచ్చి పదివేలు సంపాదించడు. ఎవని పాశికల్లు వాడే తాగుతడు. కష్టపడి సంపాదించిన పది రూపాలు రొండి నుంచి తీసి ఇసిరిపారేసి బాజాప్తా తాగుతడు.

ఫారెన్ విస్కీ తాగెటోడు మంది రక్తం తాగుతడు. వాడు ముద్దుగా అనిపించి పాశికల్లు తాగెటోడు చట్టసభలో అడుగుపెట్టేందుకు అంటరానివాడిగా, కనిపించే మీడియాలో కుళ్లు పేరుకుపోయింది. తొలగించవలసిన విషం పేరుకుపోయింది. హేల్ ప్రొలటేరియట్. అవును ఉత్త మట్టి కాళ్లతో అసెంబ్లీ తివాచీల మీద మరకలు పడేలా తొక్కుకుంటూ నాట్యం చేసి పాటలు పాడే రసమయి బాలకిషన్‌లే నిండుతరు. ఒక రోజొస్తుంది. ప్రపంచం తలకిందులయ్యే రోజు. కపటం, దురన్యాయం, దౌర్జన్యం, దోపిడీ దొంగల స్థానంలో కల్లా కపటమెరుగని మట్టి మనుషులు నిండే రోజొకటి వస్తుంది. గుర్తుంచుకోండి. అప్పుడు మీ టీవీలు భళ్ళున బద్దలవుతవి. మీ అచ్చోసిన అచ్చులు చెల్లా చెదురవుతవి జాగ్రత్త.

లంగోటి కట్టుకునెటోనికి లాప్‌టాప్ ఇస్తే మడిశి ఏడ్నో పెట్టుకున్నరంట ఎంత మదం బలిసి కొట్టుకుంటే ఈ మాటలు రాసినవాడు ఒకడు మీడియాలో ఉండగలడు. ఎంత దురహంకారం లేకపోతే. తెలంగాణ అంటే ఎంత లేకి, చులకన భావం లేకపోతే ఈ మాటలను ప్రసారం చేసిన బాధ్యుడొకడు మీడియాలో కొనసాగుతడు. ఏమి వికృతమిది. ఇది మామూలు అంశం కాదు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. ఇదెట్లా రూపుదిద్దుకుంటున్నదో? ఎంత పాతుకుపోయిందో? విగ్రహ విధ్వంసంలా దీన్ని విధ్వంసం చెయ్యకపోతే తెలంగాణ వచ్చినా ఎట్లా మనం మన రాష్ట్రంలో బిక్కుబిక్కుమంటూ గడపవలసి ఉంటుందో? ఆలోచించాల్సింది మనం. స్పందించాల్సింది మనం. సర్దుకొని, సవరించాల్సింది మనం.

రాంగోపాల్ వర్మ అనే ఒక ఒంటరివాడు. తను తప్ప మరే ప్రపంచమూ లేదనుకునేవాడు. హైదరాబాద్ అంతటా అందగాని పోస్టర్లని ట్వీట్ చేస్తడు. పవన్ కళ్యాణ్ అనే చంచలుడు తాటతీస్తా అంటడు. ఒక టీవీ వాడు నీ సిలుము మొఖం ఎప్పుడన్న అద్దంల చూసుకున్నవా? అని అంటడు. ఏమి అహంకారం ఇది. ఒక ఉద్యమానికి నాయకత్వం వహించి, కొట్లాడి, గెలిచి, ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టి, మెజారిటీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ అవమానం. ఎక్కడిదీ ధైర్యం. ఎవడిచ్చిండు వీళ్లకీ హక్కు. అసలు ఎవరు వీళ్లు. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. తెలంగాణ బానిసలు కొందరు ఇచ్చిన అండతో, కీలుబొమ్మలు కొందరు శత్రు శిబిరాల్లో దూరి దొంగలకు సద్దులు మోస్తుండడంతో, కొందరు రాజకీయ బానిసలు, కొందరు మీడియా బానిసలు, కొందరు తొత్తులు ఆంధ్ర చిలుకపలుకులు పలుకుతుండడంతోనే ఇంతా జరుగుతున్నది. ప్రతిఘటన కావాలి. తప్పదు.

ఇప్పుడు ఇది తెలంగాణ. మన రాష్ట్రం. ఖబడ్దార్ అని చెప్పగలగాలి. దళిత వ్యతిరేకత, పేదల పట్ల విముఖత, పెద్దలు, దోపిడీ దొంగలు, రాబందుల లాంటి సీమాంధ్ర పెత్తందారుల పట్ల ప్రేమ, ఇదీ మీడియా అవలక్షణం. దీన్ని అరికట్టకపోతే, మొదట్లోనే తుంచకపోతే…. ఎప్పుడన్నా మీ మీ నాయకుల మొఖాలు అద్దాల్లో చూయించగలరా? అని అడగవలసే ఉన్నది. నిలువెల్లా మూర్తీభవించి ఇంకిపోయి, నరనరానా జీర్ణించుకున్న ఆంధ్ర దురహంకార, ఆధిపత్యం నశించాల్సిందే. లేదా?….

తెలంగాణ ఉద్యమం సాధించిన ఫలం సామాన్యుడు చట్టసభల్లో అడుగుపెట్టడం. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనక కూచున్న నల్ల సూర్యుడి లాంటి గాదరి కిశోర్. అతనొక విద్యార్థి నాయకుడు.

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముంగట శిబిరాల్లో ప్రసంగాలు చేస్తూ, క్యాంపస్‌ను కాగడాగా వెలిగించిన వారిలో ఒకడు. బాల్క సుమన్ ఏకంగా ఢిల్లీ పార్లమెంటులో తేలినవాడు. గుర్తున్నదా? మెట్‌పల్లి నుంచి వచ్చిన ఈ దళితుల పిల్లవాడి నెత్తికి పడ్డవి పదకొండు కుట్లు. ఉస్మానియాలో లాఠీచార్జి చేసి, దౌర్జన్యంగా, క్రూరంగా ప్రవర్తించి ఉద్యమానికి పరోక్ష ఊపునిచ్చిన స్టీఫెన్ రవీంద్ర చేతిలో లాఠీకి, తలకాయ అడ్డంపెట్టినవాడు బాల్క సుమన్. పీహెచ్‌డీ స్కాలర్. రాజకీయ కుటుంబం నుంచీ, వేల కోట్ల కంపెనీకి అధిపతి అయిన, స్వయంగా తెలంగాణ కోసం కొట్లాడే తత్వం కూడా కలిగిన వివేక్‌ను ఓడించి, పార్లమెంటులో అడుగుపెట్టడం మాటలు కాదు.

వివేక్‌కు వేల కోట్లు ఉంటే.. నాకు వందల కేసులు ఉన్నవి. అని ప్రకటించి మరీ గెలిచి వచ్చినవాడు. ఆర్ట్స్ కాలేజీలో పూసిన మోదుగుపూలు వాళ్లు. ఒక గువ్వల బాలరాజు, ఒక రేఖా నాయక్, ఒక రసమయి బాలకిషన్, ఒక బూర నర్సయ్యగౌడ్, ఒక సాదాసీదా ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఒక శ్రీనివాస్ గౌడ్, ఉద్యమంలో వికసించిన వజ్రాలై పాటలు పాడి, ధూమ్ ధామై, మోర్చాలు కట్టి, లాఠీలు మింగినవాళ్లు. ఉద్యమం వీళ్లను చట్టసభలకు నడిపించింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యం మీద దేశ ప్రజలు కోల్పోయిన ఒక నమ్మకాన్ని కొంతన్నా మళ్లీ పాదుకొల్పింది. అవును గర్విస్తున్నది తెలంగాణ. ఒక రంధి. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అసెంబ్లీలో కూచుంటే తెలంగాణ ఉద్యమం పొడవునా ఒక ప్రేరణగా నిలిచిన శ్రీకాంతాచారి కూచున్నట్టే ఉండేది. ఆమె గెలిస్తే దుఖ్కం తీరేది. కానీ అడ్డం పడ్డది కొందరు. అదొక్కలోటు.

అవును మధుసూధనాచారి మా నల్ల పొద్దు. ఏ శాసనసభలోనైతే తెలంగాణ పదం నిషేధించిన స్పీకర్ స్థానం దురహంకారానికి, ఆధిపత్యానికి చిహ్నంగా నిలిచిందో? ప్రతీక అయిందో? ఆ ప్రతీకను, చిహ్నాన్ని తారుమారు చేసి కూచున్నడు మా తెలంగాణ స్పీకర్. వీళ్లు మీకు పాశికల్లు తాగెటోళ్ల లెక్క కొడితె మాకు పొడిచిన పొద్దుల లెక్క అగుపడుతున్నరు.

తెలంగాణ ఉద్యమం మిమ్మ ల్నీ, మీ ఆధిపత్యాలను బండకు సరిసికొట్టి, మీమీ కుళ్లు, దోపిడీ, పీడన రాజకీయ నాయకులను శంకరగిరి మాన్యాలు పట్టించి నిలిచింది. గెలిచింది. జాగ్రత్త. కుక్కతోకలు వంకరే. ఆ వంకర తనాలు ఇట్లాగే ఉంటే, మీమీ అహంకారాలు మా స్వాభిమానాలను, అభిజాత్యాలను అగౌరవపరిస్తే, అవమానపరిస్తే చరిత్ర పెంటకుప్పల మీద విసిరేస్తాం. మీ రాజకీయ అధిగణాన్ని విసిరేసినట్టుగానే మిమ్మల్నీ విసిరేస్తుంది తెలంగాణ. జాగ్రత్త. జాగ్రత్త. తెలంగాణ అనే నిప్పుతో చెలగాటం మంచిది కాదు. భవిష్యత్ మాదే. మీరు కొంచెం మర్యాదగా ఉంటే మంచిది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *