mt_logo

బాబు రెండు కండ్లు ఏం కోరుకుంటున్నాయి?

By: రాజు అసరి

రెండు కండ్ల సిద్ధాంతాన్ని చంద్రబాబు రెండు రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడే వరకు వీడేట్టు లేడు. ఎందుకంటే ఆయన తెలంగాణను వ్యతిరేకించడానికి సృష్టించుకున్న కృత్రిమ వాడుక పదం. అందుకే ఆయన ఇప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవ యాత్ర చేపట్టేబోయే ముందు సీమాంధ్రుల సమస్యలో వాస్తవం, వారి ఆందోళనల్లో న్యాయం ఉందంటున్నారు. ఇంతకీ సీమాంధ్రులు చేస్తున్న ఆందోళన దేనికోసం? వారు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. వారి ఆందోళన న్యాయమైనది అంటే తెలంగాణ ప్రజల ఐదున్నర దశాబ్దాల ఆకాంక్ష అన్యాయమైనదా?

మరో విషయం ఏమంటే సీమాంధ్ర నేతలకు జాతి, జాతీయవాదం అనేవి తెలంగాణ అంశం వచ్చేసరికే గుర్తుకు వస్తాయి. అందుకే రాష్ట్ర విభజన అంశాన్ని మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్టు జాతీయ ప్రయోజనాలు అంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సమస్యను పరిష్కరిస్తే అది మరింత జటిలం అవుతుందని బాబు అంటున్నాడు.

అందరి అభిప్రాయాలు, అన్ని పార్టీల వైఖరులు తెలుసుకున్నాకే కేంద్రం తెలంగాణపై నిర్ణయం ప్రకటించింది. కానీ అవకాశవాద రాజకీయాల కోసం డిసెంబర్ 10న తెలంగాణపై అడ్డగోలుగా మాట్లాడింది చంద్రబాబు. జూన్ 30న తెలంగాణపై సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో సీమాంధ్రలో రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని బాబు మొదట ప్రకటించి వారం తిరగకుండానే సీమాంధ్రలో తమ పార్టీల అభ్యర్థుల చేత రాజీనామాలు మొదలుపెట్టించాడు.

ఇది బాబు సామాజిక వర్గ మీడియాకు అవకాశవాదంగా కనిపించదు. కానీ బాబులోని విశాల హృదయం కనిపించవచ్చు. కానీ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో తప్ప నేరుగా అధికారంలోకి రాలేడని తొమ్మిదేళ్ల తన ప్రతిపక్ష పాత్ర చూస్తే అర్థమౌతుంది. మాట మీద ఏనాడూ ఆయన నిలబడడు. నిలబడలేడు.

సందర్భం ఒకటైతే అసందర్భమైన, అసంబద్ధమైన విషయాలపై మాట్లాడుతాడు. దానికి ఉదాహరణ రాష్ట్రంలో కోట్లాదిమంది రోడ్లపైకి వస్తుంటే ప్రధాని మౌనంగా ఉండడం సరికాదని బాబు మన్మోహన్‌కు లేఖ రాశాడు. మరుసటి రోజు రాష్ట్రంలో ఏ సమస్యా లేదని రూపాయి పతనానికి యూపీఏ ప్రభుత్వ విధానాలే కారణమని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు.

నిజానికి సంవత్సరానికి పైగా ద్రవ్యోల్బణం, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనిపై ఏనాడు స్పందించని బాబు రాష్ట్ర విభజన నిర్ణయం జరిగి ఇరు ప్రాంతాల మధ్య అవకాశవాద రాజకీయ నేతల విద్వేషాలు పెరిగిపోతున్న సందర్భంలో.. అందరిని సమన్వపరచాల్సింది పోయి ఏవేవో మాట్లాడుతాడు.

యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎక్కడ చూసినా అవినీతే గురించే మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని అందుకే విభజన నిర్ణయం తీసుకున్నదని బాబు అంటాడు.

నిజమే ఇప్పుడంటే ఎన్నికల సందర్భం కాబట్టి ఆ మాట మాట్లాడవచ్చు. మరి 2009 డిసెంబర్ 9న తీసుకున్న నిర్ణయానికి అడ్డుపడింది ఎవరు? స్టేక్‌హోల్డర్‌తో చర్చించకుండా విభజన నిర్ణయం ఎలా తీసుకుంటారని బాబు మతి లేని మాటలు మాట్లాడుతాడు.

2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత తెలంగాణపై చిదంబరం, షిండేల నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాలు జరగలేదా? అప్పుడు తెలంగాణపై మీ పార్టీ వైఖరిని అడగలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు నిర్ణయం జరిగాయ ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయి? నిజంగా నీ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉండి ఉంటే శ్రీకృష్ణ కమిటీ ఒకే నివేదిక ఇచ్చేది కదా! మరి ప్రాంతాల వారీగా ఎందుకు ఇచ్చినట్టు? ఎవరిది అవకాశవాదం? ఆలోచనకో అభిప్రాయం మార్చుకునే ఆంధ్రా నేతల వైఖరితో తెలంగాణ ప్రాంతానికే కాదు ఆంధ్రా ప్రాంత ప్రజలకు కూడా ఎన్నటికీ మేలు జరగదు.

అందుకే బాబు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదు అన్నా ఈ ప్రాంత ప్రజలు విశ్వసించలేదు. విశ్వసించరు కూడా. ఎందుకంటే బాబు రెండుకండ్ల సిద్ధాంతంలో తెలంగాణకు చోటు లేదు. ఆ రెండు కళ్లు ఎప్పుడూ సీమాంధ్రుల సంక్షేమాన్నే కోరుకుంటాయి. దాన్ని తెలుగువారి సంక్షేమంగా చిత్రించే ‘కమ్మ’టి ప్రసారమాధ్యమాలు ఉండనే ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *