mt_logo

సీమాంధ్రలో ఆందోళనల్లో అరాచకత్వం – మహిళా ఉద్యోగిపై పెండతో దాడి

ఫొటో: కాకినాడ వీధుల్లో సమైక్యాంధ్ర అరాచకశక్తుల వీరంగం 

సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనల్లో అరాచకత్వం రాజ్యమేలుతోంది. నిన్న కాకినాడలో మంత్రి తోట నరసింహం భార్య తోట వాణి దీక్షా శిబిరం వద్ద అల్లరిమూకలు వేసిన వీరంగం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. మహిళ అని కూడా చూడకుండా సాక్షాతూ జిల్లా వైద్యాధికారిణిపైనే దాడికి దిగారు మంత్రి అనుచరులు.

మంత్రి అనుచరులు బుధవారం రాత్రి కాకినాడ వీధుల్లో అరాచకం సృష్టించారు. వీరి దౌర్జన్యంతో దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. దారినపోయేవారిని కూడా మంత్రి అనుచరులు చితకబాదారు.

కాకినాడ భానుగుడి సెంటర్లో గత అయిదురోజులుగా మంత్రి భార్య తోట వాణి సమైక్యాంధ్ర కొరకు నిరాహారదీక్ష చేస్తున్నారు. బుధవారం వాణి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి జిల్లా వైద్యాదికారి పద్మావతి వచ్చారు. వాణి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే వైద్య సహాయం అందించాలని ఆమె చెప్పారు. అంతే ఆగ్రహించిన మంత్రి అనుచరులు జిల్లా వైద్యాదికారి మీద మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఆమె మీద చెత్త, పెండను కుమ్మరించారు. ఈ హటాత్ దాడితో నివ్వెరపోయిన జిల్లా వైద్యాధికారి పద్మావతి కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. పోలీసులు అతికష్టం మీద పద్మావతిని రక్షించి అక్కడినుండి తప్పించారు.

ఫొటో: జిల్లా వైద్యాధికారి నెత్తి మీద పెండ వేసిన సమైక్యాంధ్ర అరాచకశక్తులు 

ఆ తరువాత కూడా మంత్రి అనుచరుల వీరంగం కొనసాగింది. ఒక కుర్చీని రోడ్డు మీదకు విసరగా అటుగా బైక్ మీద వెళ్తున్న ఒక జంటకు గాయాలయ్యాయి. భానుగుడి సెంటర్, పిఠాపురం రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులని దిగ్బంధించిన మంత్రి అనుచరులు రోడ్డునపోయే వాహనదారులు, పాదచారుల మీద కూడా దాడికి తెగబడ్డారు. స్థానికంగా ఉన్న సోడా హబ్ షాపు మీదపడి దాన్ని ధ్వంసం చేశారు.

సాయం చేయడానికి జిల్లా వైద్యాధికారి  వస్తే ఇట్లా అవమానించడం ఏమి సంస్కృతి అని అక్కడున్న పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యమం పేరిట అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నారని కాకినాడ పౌరులు ఆవేదన చెందుతున్నారు.

ఇదంతా జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సీమాంధ్రలో ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇస్తున్న పరోక్ష మద్ధతుకు నిదర్శనం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *