mt_logo

అమ్మకు ‘అమ్మఒడి’ సాయం (పూర్తి వివరాలు)

  • కేసీఆర్‌ కిట్‌.. ఉచిత డెలివరీలు
  • 13.91 లక్షల మంది గర్భిణులు కేసీఆర్‌ కిట్‌
  • గర్భిణులు చెకప్‌ కోసం అమ్మ ఒడి వాహనాల్లో ఉచిత ప్రయాణం
  • కేసీఆర్‌ కిట్‌ పథకం కింద గర్భిణులకు రూ.15 వేల వరకు నేరుగా లబ్ధి
  • దేశంలో సగటు ప్రసవ ఖర్చు రూ.12,899 : ఐసీఎంఆర్‌ నివేదిక

హైదరాబాద్‌: తెలంగాణలో గర్భిణి కావడం నుంచి ప్రవసం అయ్యి ఇంటికి చేరాక కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నది. ఉచిత ప్రసవాలతో పాటు తల్లీబిడ్డ క్షేమం కోసం ప్రభుత్వం కిట్ల రూపంలో సామగ్రిని అందజేస్తూ రక్షణ కవచంగా నిలుస్తున్నది. ఇలా ఒక్కో మహిళకు వివిధ పథకాల కింద రూ.30 వేల వరకు లబ్ధి చేకూరుతున్నది. ఇది దేశంలో మహిళ సగటు ప్రసవానికి అయ్యే ఖర్చుకంటే అధికంగా ఉండటం విశేషం. దేశంలో ఒక్కో మహిళ ప్రసవానికి వైద్య ఖర్చుల వివరాలను ఇటీవల ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అధ్యయనం చేసింది. ఓపీ మొదలు సూపర్‌ స్పెషాలిటీ సేవల వరకు సగటు వ్యయాన్ని గణించి నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో సగటున ప్రసవానికి రూ.12,899 ఖర్చవుతున్నట్టు నివేదిక ఇచ్చింది.

మొత్తంగా రూ.1,525 కోట్లు ప్రత్యక్షంగా నగదు సాయం

రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రసవాలు జరుగుతున్నాయి. పైగా కేసీఆర్‌ కిట్‌ పథకం కింద గర్భిణులకు రూ.15 వేల వరకు నేరుగా లబ్ధి చేకూరుతున్నది. ఇందులో రూ.13 వేల వరకు ఆర్థిక సాయం, రూ.2 వేలు విలువైన కిట్‌ను బాలింతలకు అందజేస్తున్నారు. ఇందులో తల్లీబిడ్డకు కావాల్సిన 16 రకాల వస్తువులు ఉంటాయి.రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 13.91 లక్షల మంది గర్భిణులు కేసీఆర్‌ కిట్‌ను అందుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరికి మొత్తంగా రూ.1,525 కోట్లు ప్రత్యక్షంగా నగదు సాయం అందింది. ఈ లెక్కన పరోక్షంగా మరో రూ.1,500 కోట్ల సాయం అందినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.

గర్భిణులకు రూ.30 వేల వరకు  సాయం

టిఫా స్కానింగ్‌ మెషీన్లు లేక గర్భిణులు చెకప్‌ కోసం ప్రైవేటుకు వెళ్తున్నారని తెలుసుకొని కేవలం కొద్దికాలంలోనే ప్రభుత్వం 44 స్కానింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇలా రవాణా, టిఫా స్కానింగ్‌ల ద్వారా సుమారు రూ.2 వేల వరకు ఒక్కొక్కరికీ ఆదా అవుతున్నాయి. ప్రసవ ఖర్చులు, కేసీఆర్‌ కిట్‌ ప్రయోజనం, ఇతర ఖర్చులు కలిపితే రాష్ట్రంలో గర్భిణులకు ప్రభుత్వం చేస్తున్న సాయం రూ.30 వేల వరకు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.గర్భిణులు చెకప్‌ కోసం దవాఖానకు వెళ్లే సమయంలో రవాణాకు ఇబ్బందులు పడొద్దని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ వాహన పథకాన్ని అమలు చేస్తున్నది. ఏఎన్సీ చెకప్‌లు, ప్రసవం కోసం, డెలివరీ అయిన తర్వాత ఈ వాహన సేవలను వినియోగించుకుంటున్నారు.