mt_logo

హైదరాబాద్ అభివృద్ధి గురించి…

By: కె. కూర్మనాధ్

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేసేక హైదరాబాద్ గురించి కొందరు సమైక్యవాదులు ఒక వాదన చేస్తున్నారు. మేం రక్తమాంసాలతో నిర్మించిన నగరాన్ని విడిచిపోమ్మంటే ఎలా? మాకు అందులో భాగం ఉందికదా , ఉత్త చేతులతో వెళ్లి పోవాల్సిరావడం బాధగావుంది — అని.

ఇవి వింటుంటే, నాకూ అనిపించింది. నేను హైదరాబాద్ వచ్చి కూడా ఇరవై సంవత్సరాలవుతోంది. నాలాగే, దాదాపు నాతోపాటే వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఇలా వాదన చేస్తున్నారు. నాకు అనిపించిందీ — నాకు హైదరాబాద్ ఏమి ఇచ్చిందీ, నేను హైదరాబాద్ (లేదా తెలంగాణాకి) కి ఏమి ఇచ్చాను అని.

ఖచ్చితంగా, నేను హైదరాబాద్ నుంచి పొందినదే ఎక్కువ.

హైదరాబాద్ వచ్చిన సంవత్సరమే ప్రముఖ జర్నలిస్టు, చరిత్రకారుడు జి కృష్ణ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన కొద్ది రోజులకే అడిగారు నన్ను — ఇల్లు కొనుక్కున్నావా? అని .
చాల ఆశ్చర్య పోయాను. కోపం కూడా వచ్చింది . ఏమిటీ ఈయన ఇలా మాట్లాడుతున్నారనుకునాను.

“అదేంటి సార్, జోక్ చేస్తున్నారా? నీ జీతం వెయ్యి రూపాయలని చెప్పాను కదా మీకు,” అన్నాను.

“గుర్తుందిలే, కానీ ఇలా ఆంధ్రా నుంచి వచ్చినవాళ్ళు మొదట చేసే పని అదే.,” అన్నారు.

అప్పుడు కాదు కానే మరో 10 సంవత్సరాలకు ఇల్లు కొనుక్కున్నాను. బ్యాంకు లోన్ తోనే అనుకోండి .

ముందో, తర్వాతో నాతో పాటు వచ్చిన చాల మంది మంది ఇళ్ళు, లేదా ప్లాట్ కొనుక్కున్నారు. ఇది హైదరాబాదు మాకు ఇచ్చిందే.

ఎంత ఆలోచించినా నేను హైదరాబాద్ నిర్మాణానికి ఏమి చేసెనో గుర్తు రావడం లేదు . లెఫ్టిస్ట్ ని కాబట్టి ప్రజలు చేసిన శ్రమను తక్కువ అంచనా వెయ్యడం లేదు. నేను, ఇంకా మిగతా మిత్రులు, మిత్రులు కాని వాళ్ళు చేసిన శ్రమ ఖచ్చితంగా నగరం అభివృద్ధిలో వుంది వుంటుంది . కానీ, అది మా శ్రమకు ఉప-ఉత్పత్తి మాత్రమే. ఎందుకంటే, మా శ్రమ మాకు జీతాలిచ్చిన కంపెనీల అభివృద్ధికి దోహదపడింది. అంతే తప్ప హైదరాబాద్ ని అభివృద్ది చేద్దామన్న బృహత్ సంకల్పంతో నేను రాలేదు, మా మిత్రులు కూడా రాలేదు.

ఎలాగంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు అమెరికాను అభివృద్ధిని చెయ్యడానికి వెళ్ళనట్టే.

ఇక రామోజీలు, మురళీ మోహన్లు, లగడపాటి , జగన్లు — వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసమే అన్ని వ్యాపారాలూ చేసేరన్నది కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.

హైదరాబాద్ లాటి నగరాన్ని నిర్మించాలనే డిమాండ్ న్యాయబద్ధమినదే. ఉద్యోగ ఉపాధి అవకాశాల పెన్నిధి ఆంధ్రా-రాయలసీమకు కూడా తప్పని అవసరం. దాని కోసం తప్పక పోరాడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *