mt_logo

హంతకుడి జాడ….!

– అల్లం నారాయణ

ఆ కాగితం ముట్టుకున్నప్పుడు వేళ్లలోకి దుఃఖం వ్యాపించినట్టయింది. వెన్నుపూస భయంతో గజగజా వణికింది. నరనరాన జ్వరం. బహుశా అతనింకా చనిపోయి ఉండకూడదు. అతను బతకాలి. ఆ కాగితం ఒక ఈ-మెయిల్. నమస్తే తెలంగాణ టెక్ ఇన్‌చార్జి శ్రీనివాస్ అపుడే ఆ కాగితం తెచ్చిచ్చి ‘ఇది మీకు పంపారు సార్. సూసైడ్ నోట్’ అనగానే నిలువెల్లా భయం. అయిదూ ముప్పై ఏడు నిమిషాలకు పంపిన మెయిల్ అది. కింద ఫోన్ నెంబర్ .9052559413. గది చల్లబడిపోయింది. మృత్యు శీతలం. గదిలో మా ఎండీ దామోదర్‌రావు, సీఈఓ కట్టా శేఖర్‌డ్డి , రాజం గారు, ఆర్ విద్యాసాగర్. ఒక్కసారిగా కమ్ముకున్న నిశ్శబ్దం. అతనింకా చచ్చిపోకూడదు. ఫోన్ చేశాను… నమ్ముతారా! దుఃఖంలో దుఃఖం కలిసినట్టు శ్రీకాంత్ చెల్లెలి శోకం విన్నానా ఫోన్‌లో “మా అన్న సచ్చిపోయిండు”.

అయిపోయింది.

ఆశ ఆరిపోయింది. ఆ పిల్లవాడి గొంతు విని, మాట్లాడి, నిలబెట్టి… ఊహ ఛిద్రమైంది. గది గంభీరమై పోయింది. ఏం చేయగలం ఇప్పుడు. ఎట్లా స్వీకరించాలి దీన్ని.. చిదంబరం వ్యాఖ్యలకు రోసి మరణించిన శ్రీకాంత్. హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి అతనిట్లా రాశాడు.

‘డియర్ సర్! నేను శ్రీకాంత్. జేఎన్‌టీయూలో ఎంటెక్ చేస్తున్నాను. నా తల్లిదంవూడులకు నేనొక్కణ్నే కొడుకుని. నేనిప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగం అవుతున్నా. యాదిరెడ్డి ఆత్మహత్య గురించి పార్లమెంటులో చిదంబరం చేసిన ప్రకటన పట్ల నేను నిజంగా బాధపడుతున్నాను. నా ఆత్మహత్యను కూడా ఇట్లా తప్పుడు ఆత్మహత్య చేయొద్దు. నా ఆత్మహత్య వాంగ్మూలాన్ని పొందుపరుస్తున్నా.

పాస్ వర్డ్. జై తెలంగాణ’

ఇదీ నమస్తే తెలంగాణ సంపాదకునికి శ్రీకాంత్ మరణానికి కొన్ని నిమిషాల ముందు పెట్టిన నోట్ సారాంశం.

ఈ మెయిల్ అందుకున్న వెంటనే అతను చనిపోవద్దని కోరుకున్నా… కుదరలే. మరో ఆత్మహత్య.

అయినా వీటిని ఆత్మహత్యలే అనాలా?

ఇది హత్య కాదా!

హంతకులు పోల్చుకోలేని వారు కాదు. హంతకులు మహాసౌధాల్లో ఉన్నారు. హంతకులు ఎవరు? యాదిరెడ్డి మరణాన్ని శంకించిన వారెవరు? మనసు పూడుకు పోతుండగా.. చిక్కదీసుకున్న ధైర్యంతో అమ్మను కూడా యాదిచేసుకుని రాసిన ఒక ఆర్తరావాన్ని ఎందుకని శంకించారు. హోంమంత్రి చిదంబరం మనసు స్థానంలో ఏమి ఉండి ఉంటుంది. వేదాంత కంపెనీ కాదు చావు అంటే. టూజీ స్పెక్ట్రమ్‌లు, కామన్ వెల్త్‌లూ, రాజాలు, బాజాలు, భవంతులు కాదు మృత్యువంటే.

సాదాసీదా మనసుల , మనుషుల ఆర్తరావం ఎన్నడూ వినపడని పార్లమెంటు స్ట్రీట్‌లో జరిగిన ఒక ఆత్మహత్యను శంకించినందుకు మరో ఆత్మహత్య జరిగింది. ఎవరు బాధ్యులు.

చిదంబరం యాదిరెడ్డి ఆత్మహత్యను అవమానించినందుకు మరో అవమానపు హత్య. ఎవరు బాధ్యులు?

శ్రీకాంత్‌కు కలలున్నాయి. శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్కూ, పెరిగిన ప్రపంచం, స్నేహితులు, పుట్టిన రోజులు, హైదరాబాద్‌లో విశాలంగా భాసిల్లే జేఎన్‌టీయూ క్యాంపస్ , చిట్ చాట్లు , జీవితం నిండుగా ఉన్నది శ్రీకాంత్‌కు. అతను సాంకేతిక అంశాల మాస్టర్‌గిరీ చేసినా.. మనసు ఉన్న చోట పదిలంగా ఉన్నట్టున్నది. స్పందించే గుణమూ కాపాడుకున్నడు కనుకనే శ్రీకాంత్‌లో తెలంగాణ ఉన్నది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి ఉన్నడు. ఎవరు చెప్పాలి. శ్రీకాంత్‌కు కళ్లూ, చెవులూ, నోరు, పడిపోయిన ప్రభుత్వాలకు శ్వాస ఆగి అంపశయ్యపై తీసుకుంటున్న ప్రజాస్వామ్యాలకు, ఏ మొరా వినపడదని. ఆత్మహత్యలు వద్దేవద్దు.

చిదంబరం ప్రకటనకు, కావూరి కావరాలకు, లగడపాటి జగడాలకు, సోనియాగాంధీ పట్టనితనాలకు, ప్రణబ్‌ముఖర్జీ నటనలకూ, మోసాలకు, దుర్మార్గాలకు, ఆడిన మాట తప్పినందుకు, మాట ఇచ్చి మోసం చేసినందుకు… హంతకుడెవరు? అని ప్రశ్నిస్తూనే హతమైపోతున్న వారికీ.. దేనికీ రంది పడకూడదు.

నిజమే తెలంగాణ ఒక కలే. నిజమే తెలంగాణ ఒక ఒడువని తీరని దుక్కమే. నిజమే కానీ తెలంగాణ ఒక ధిక్కార భూమి కూడా. శ్రీకాంత్ నువ్వు బతికి ఉంటే చిదంబరం, రెండు నాల్కల మీద, చంద్రబాబు రెండు కళ్ల మీద, ప్రజాస్వామ్యపు రుజాక్షిగస్థత మీద నువ్వూ, నేనూ సబ్బండ జాతీ దండెత్తి ఉండేవాళ్లం కదా!

శ్రీకాంత్. మందమర్రి ఊరు. ఫోన్‌లో గుడగుడమని దుఃఖం ప్రహహించడం ఎవరికైనా ఎప్పుడైనా అవగతమయిందా.. సంపాదకుడా. ఏడువు. కరువుదీరా.. కల్మషం లేనిదొక కంటినీరే. శ్రీకాంత్ చెల్లెలు ఏడుస్తున్నది. చెవుల్లో మోగుతున్న చావు బాజా.. ఏమి ఖర్మమీ తెలంగాణది. ఒక్కడే కొడుకు. సింగరేణి సిగలో మెరిసిన చదువుల మేలిముత్యం. అయిపోయింది.

‘అన్న సచ్చిపోయిండు’ ఆ ఒక్క మాటే వద్దు. ఏది వినపడకూడదో.. అది. అంతా ఇక క్రితం తర్వాతే. కొంచెం ఆగితే.. కొంచెం కాలం జరిగితే. శ్రీకాంత్‌తో మాట్లాడగలిగితే.. శ్రీకాంత్.. తెలంగాణ గురించి నీతో సంభాషించాలనుంది. ఇరాముగా. మొత్తం పనులన్నీ బందుపెట్టి.. నా డెడ్‌లైన్లు పక్కనపెట్టి చాలా తీరికగా. నీ ఒక్కనికోసమే. మా అందరి కోసం జయశంకర్ మాట్లాడినట్టుగా.. గద్దర్ పాడ్తున్నట్టుగా.. అవును. తెలంగాణకు కేసీఆర్ మామయ్య అన్నవుగదా.. ఆయన మాట్లాడ్తున్నట్టుగా.. రందిపడొద్దు.. రణం చెయ్యాలె. అన్నట్టుగా.. శ్రీకాంత్‌ నువ్వే లేవు. దగాపడ్డ తెలంగాణ.. సంగతులు ఎవరికి చెప్పుకోవాలి మేము. ఒక్కరొక్కరుగా.. మీరు.. ఇట్లా రాలిపోతున్నప్పుడు.. కాలిపోతున్నప్పుడు.. కూలిపోతున్నప్పుడు.. ఎవరికీ తెలంగాణ.. ఎవరి కలల కోసం తెలంగాణ..

శ్రీకాంత్‌కు అన్నీ తెలుసు. అతనొక విజ్ఞాని. తెలంగాణ వస్తే ఏమి చెయ్యాలో తెలుసు.

కానీ.. ప్రభుత్వాలు, వారిని నడిపే, దళారీలు, తాబేదార్లు, దొంగలు ప్రజాస్వామ్య సౌధాలను మలినం చేస్తున్న బేపారులు ఎట్లా దేనికి, ఎందుకు? ఆటంకం అవుతారో తెలియదు.

తెలంగాణ ఎందుకు రాదో? ఎందుకు వస్తదో? ఏమి చేస్తే వస్తుందో తెలియదు. మనసులేని, మనిషితనం లేని, ఉత్త సాంకేతిక పదాల, బోలు మనుషుల సమూహాల మధ్య ఎట్లా మెసలాలో? తెలియదు. అంబేద పిల్లలు. శ్రీకాంత్ మిమ్మల్ని ప్రేమించే తల్లితండ్రులం. మిమ్మల్ని ప్రేమించే ఉద్యమకారులం. మిమ్మల్ని ప్రేమించే తెలంగాణవాదులం. యుద్ధం మధ్యలో… నిలబడి ఉన్న వాళ్లం. ఒక్క వ్యాఖ్య కోసం. ఒక్క చర్య కోసం ప్రతిచర్య ఉంటుంది. కానీ.. ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు.

ఆత్మల స్థానంలో దయ్యాలు తిష్టవేసిన మనుషుల కోసం, గుండెల స్థానంలో రోగక్షిగస్థమైన ఉత్త తోలుతిత్తులు ఉన్న వాళ్ల కోసం ఎందుకు శ్రీకాంత్. మీ ప్రాణాలు పోవడం.

మీ చెల్లెలు ఏడుస్తున్నది.

ఇప్పుడిక ఒకే ఒక ప్రశ్న. యాదిరెడ్డిది ఆత్మహత్య. అవును నిజమే.

కానీ ఎందుకని యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నడు?

సరే. శ్రీకాంత్ ఉరిపోసుకున్న శిరసునడుగు. అప్పటి దాకా సుచేతనంగా ఉద్వేగాల ఊయలలూగి కొట్టుమిట్టాడిన అతని ఆలోచనా అంతరంగాలను దర్శించు. అతను చిదంబరం వ్యాఖ్యలకు కలతబారాడు.

ఈ బలవన్మరణానికి కారకులెవరు?

ఇంతకీ హంతకులెవరు?

తొమ్మిదో తేదీన మహాభారత దేశపు మహా ఘనత వహించిన ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటిస్తూ, చిదంబరం అదే పార్లమెంటులో ‘ మీది మీరే తెల్చుకోండి’ అన్నప్పుడు, ఒక రాష్ట్రం విడిపోయే సమస్య మీద మీది మీరే చూసుకోండని అంటే పార్లమెంటులెన్దుకు? రాజ్యాంగాలెన్దుకు? ఆర్టికల్ 3 అలంకరణలెన్దుకు? దీనికి యూపీఏలు, కోర్ కమిటీలు, మతులు తప్పిన వృద్ధ జంబూకాలు, తక్తుల మీద కూచొని మాటలెన్దుకు?

అసలు మనకు ఒక కేంద్ర ప్రభుత్వం ఉందా? ఉంటే అది పనిచేస్తున్నదా? పనిచేస్తే ఏం చేస్తున్నది? తెలంగాణ ఇంకేం జెయ్యాలె. శాంతిగానూ, సామరస్యంగానూ, ఒక మహా యుద్ధం నడుస్తున్నది. పద్దెనిమిది నెలలు ఉధృత పోరాటం. ఆరువందల బలిదానాలు.

పార్లమెంటు సౌధానికి దగ్గరా యాదిరెడ్డి బలిదానం. ఇదిగో ఇవ్వాళ్ల మీ మురికి మనసులను బద్దలు కొడ్తూ, మీ వక్ర భాష్యాలు, వంకర మాటలు, చేతలు బద్దలుకొడుతూ ఉరికొయ్యను వేలాడిన శ్రీకాంత్.

తెలుసా! ఇది ఆరని కుంపటి. నిజమే అప్పటి దాకా శానిగా మాట్లాడిన వాడు, అప్పటి దాకా సమజ్‌దార్‌గ మాట్లాడినవాడు. గుండెల్లో పచ్చల పిడిబాకు దిగేసినప్పుడు కలిగే ఒక భంగపాటులో ఉంది.

ఒక ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటును, రాజకీయ ప్రక్రియను, ఆర్టికల్ 3ని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నది తెలంగాణ. కానీ.. కానీ..
మిస్టర్ చిదంబరం. న్యాయం విఫలమయిన చోట, ధర్మం ఓడిపోయిన చోట, ప్రజాస్వామ్యం పరాధీనమైనచోట, రాజ్యాంగం విఫలమయిన చోట ఇప్పుడు ఆత్మహత్యలు, బలిదానాలున్నయి. వాటి తర్వాత ఏముంటాయో? తెలుసా? తెలంగాణకు ఆయుధమూ తెలుసు.

ఇంకేం చెయ్యాలె తెలంగాణ. శ్రీకాంత్… ఈ దుక్కాన్ని రాస్తున్న చోట, వేళ్లు వణుకుతుండగా ఫోన్‌లోంచి శ్రీకాంత్ చెల్లెలు వెక్కిళ్లు వినపడుతుండగా, ఇదే సమయాన నా ముందొక మరో ఆత్మహత్య నోటు.. మరో మరణ వాంగ్మూలం.

తెలంగాణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, నేను కే.రమేశ్; పీఎస్ మనోహరాబాద్, మండలం తూప్రాన్, జిల్లా మెదక్ వాసిని.. తెలంగాణ ప్రకటన ఆగస్టు 30 లోపు ప్రకటించాలి. లేనిచో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆంధ్రవూపదేశ్ శాసనసభ వద్ద ఆత్మహత్య చేసుకుంటాను’.

ప్రజాస్వామ్యం విఫలమయింది. ఇక ఆత్మహత్యలు చాలించాలి. రంది వద్దు రణానికి దిగాలె. మిస్టర్ చిదంబరం.. హంతకులెవరో?తెలంగాణ పోల్చుకున్నది.
ఇంకేం చేస్తుంది తెలంగాణ చావో.. రేవో.. చచ్చి సాధించలేం. బతుకాలె. బతుకాలె… బతుకాలె.

బలిదానాలు కాదు. తెలంగాణ బలికోరే రోజులచ్చినప్పుడు మీ మహా సౌధాలు ముక్కలయ్యే ప్రమాదం పొంచి వుంది.. జాగ్రత్త… జాగ్రత్త..

శ్రీకాంత్ నువ్వు చనిపోకుండా ఉంటే.. నీ ఒక్కడితోనే, దివారారాత్రులూ తెలంగాణ గురించి మాట్లాడాలని ఉంది.

నువ్వే లేవు.

తెలంగాణ బతికే ఉంది. మిగిలే ఉంది.

అది తన కలను సాకారం చేసుకుని తీరుతుంది.

ఆత్మహత్యలు వద్దు. శ్రీకాంత్ మేం పోరాడతాం. శ్రీకాంత్ నీకు ఇదే నీ మందమర్రిలో బతికిన మనుషుల గురించి చెప్పాలని ఉన్నది. ఇక్కడ పారాడి,పోరాడిన వాళ్ల సంగతి చెప్పాలని ఉన్నది. ఉత్త చేతులతో మట్టికాళ్ల మహారాక్షసి మీద యుద్ధం ప్రకటించిన వాళ్ల గురించి చెప్పాలని ఉన్నది. గొంతు గుడగుడమంటున్నది. పెద్ది శంకర్ గురించి, బెల్లంపల్లిలో కన్నాలబస్తీలో వెలిగిన గజ్జెల గంగారాం గురించి, పులి మధునయ్య గురించి, ఎగిరే లోహ విహంగాలను గురి చూసి కొట్టగలిగిన గెరిల్లా యోధురాలి గురించి చెప్పాలని ఉన్నది.

నువ్వే లేవు. శ్రీకాంత్ నువ్వుండాలి. తెలంగాణ గెలవాలి. శ్రీకాంత్‌లు, యాదిరెడ్డిలు బతకాలి. బతకాలి. బతకాలి.

[నమస్తే తెలంగాణలో సంపాదకీయం]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *