mt_logo

తెలంగాణ భూమి పుత్రిక

తన చరిత్రను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త్యాగధనుల్ని తలకెత్తుకుంటున్నది. వివక్షాఫూరిత సీమాంధ్రుల  పాలనలో స్మరణకు నోచుకుండా పోయిన సాహస వీరులకు, వనితలకు సలాం చేస్తున్నది. భూమికోసం, భుక్తి కోసం, పాలకుల పీడన నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఈ పోరాటానికి నిట్టాడుగా నిలిచి, ఉద్యమ స్ఫూర్తిని ఊరూరా పంచి తమ సర్వస్వాన్ని తెలంగాణ కోసం ధారపోసిన ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ.

1946- 51 మధ్యకాలంలో సాగిన సాయుధ పోరులో ఐలమ్మ భర్త జైలు పాలయ్యిండు. కొడుకు ఉద్యమంలో అమరుడయ్యిండు.

బిడ్డ దొరల దాష్టీకానికి బలయ్యింది. అయినా సుత ఐలమ్మ ధైర్యం చెడకుండ తన భూమికోసం, పండించిన పంట దక్కించుకునేందుకు కమ్యూనిస్టులతో కలిసి కొట్లాడింది. ప్రాణహాని ఉన్నప్పుటికీ ఒక్కతే అటు జనగాం, ఇటు హైదరాబాద్ వరకు తిరిగి అర్జీలు ఇచ్చింది. న్యాయం కోసం బరిగీసి నిలిసింది. చాకలి ఐలమ్మ , ఆమె కుటుంబం మొత్తం తమ భూమి తమకే దక్కాలని, పంట తమకే దక్కాలని విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. జైలుకు పోయింది. రక్తాలు కారేలా దెబ్బలు తిన్నరు. ఇంతజేసినా ఈ మట్టి మనుషుల గురించి, వీరి త్యాగాల గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన ఉండదు. నిస్వార్థ త్యాగానికి ప్రతీక అయిన ఆమె ప్రతిమకు ట్యాంక్‌బండ్‌పై స్థానం దక్కలేదు. ఇన్నాళ్లు, ఇన్నేండ్లు తెలంగాణ తన చరిత్ర తాను నమోదు చేసుకోలేకపోయింది. ప్రాంతేతరులు రాసిన రాతలే ప్రామాణికమయ్యాయి.

తెలంగాణ ఇప్పుడు ఒక్కొక్కటి లెక్కగట్టి మరీ రికార్డు చేస్తోంది. 1944లో ఆంధ్ర మహాసభ సమావేశాలు రావి నారాయణడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో జరిగిన నాటి నుంచే ఉద్య మం అతివాదుల చేతుల్లోకి పోయింది. బద్దం ఎల్లాడ్డి, దేవులపల్లి వెంక వంటి ప్రముఖులు ముందుండి ప్రజాచైతన్యానికి పునాదులు వేసిండ్రు. కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం అనేక కళారూపాల్ని వాడుకున్నరు. బుర్రకథ, ఒగ్గు కథ, గొల్లసుద్దులు ఇట్లా ఎట్లా వీలైతే అట్లా ప్రజలను పోరుకు సన్నద్ధం చేసే కార్యక్షికమం ప్రారంభమైంది. వీటి ద్వారా ప్రభావితులైన చిట్యాల (చాకలి) ఐలమ్మ 45 ఏండ్ల వయసులో జనగామ తాలూకాలోని పాలకుర్తిలో విసునూరు దేశ్‌ముఖ్ గూండాలకు ఎదురుతిరిగింది.

1946 జూలై నాలుగున దొడ్డి కొముర య్య అమరత్వంతో అప్పటి నల్లగొండ జిల్లాలోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోసినయి. పాలకుర్తి, విసునూరు, కడ ఉద్యమ కేంద్రాలుగా రగిలినయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచిండ్రు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథలు చెబుతుండగా విసునూరు దేశ్‌ముఖ్ గుండాలు మిస్కీన్ అలీ, గుమస్తా అబ్బాస్ అలీ, వుత్తాలం రామిడ్డి, ఒనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించిండ్రు. అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి తప్పతాగి ఉన్న గూండాలకు శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్‌ముఖ్ ప్రేరణతో పోలీసులు ఒనమాల వెంకటి మీద హత్యాయత్నం చేసింవూడనే నేరం ఆరోపిస్తూ చిట్యాల ఐలమ్మ భర్త నర్సింహ్మను ఆయన ఇద్దరు కొడుకుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు.

జనగామ మున్సిఫ్ కోర్టు, మెదక్ సెషన్స్ కోర్టుల్లో విచారణ జరిగింది. విచారణ ఏడాది కాలంపాటూ సాగింది. నర్సింహ్మతోపాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న 12 మంది ఆ కాలమంతా జైళ్లలోనే మగ్గిపోయారు. బెయిలు కూడా దొరకలేదు. ఇదే అదనుగా విసునూరు దేశ్‌ముఖ్ ఐలమ్మ పంటను స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. అయితే ఈ పంటకు నిర్మాల, కడ సీతారాంపురానికి చెందిన ఆంధ్రమహసభ కార్యకర్తలు కాపలాగా నిలిచిండ్రు. మూడు,నాలుగు నెలలపాటు కాపలా ఉన్న వీరందరికీ ఊరోళ్లందరి నుంచి బువ్వడొక్కొచ్చి పెట్టింది ఐలమ్మ. అయితే వీళ్లు కాపలా మానుకున్న వెంటనే దొర గూండాలొచ్చిండ్రు. అందిన కాడికి దోచుకోవడమే గాకుండా ఇంటి కి నిప్పుపెట్టిం డ్రు. తను, తన భర్త, కొడుకులు కష్టపడి పండించిన పంటను విసునూరు దేశ్‌ముఖ్ తరలించుకు పోదామని ప్రయత్నిస్తే ‘సంగం’ అండతో ఐలమ్మ అడ్డుకున్నది.

తరతరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న నాలుగెకరాల భూమి ఐలమ్మ కుటుంబం ఆస్తి. (మల్లంపల్లి దేశ్‌ముఖ్ (కరణం) నుంచి కౌలుకు తీసుకున్నది) వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సంగం నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆ బాధను అనుభవిస్తున్న ఐలమ్మ కుటుంబం కూడా సంగంలో చేరి వాటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్న ది. ఇది గిట్టని విసునూరు దేశ్‌ముఖ్ ఐలమ్మ భూమిపై కన్నేసి దానిని కాజేయాలని ప్రయత్నించిండు. విసునూరు పోలీసులు ఐలమ్మ ఇంటిమీద దాడి చేసి కొడుకును అరెస్టు చేసి చిత్రహింస పెట్టడమేకాకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటిని పలగ్గొట్టి మొత్తం ఇంటికే నిప్పుపెట్టిండ్రు. న్యాయం కోసం ఆమె హైదరాబాద్‌లో ఉన్న అధికారులను కలిసి విన్నపాలు జేసుకున్నది. ఎక్కడికైనా ధైర్యంతో ఒక్క తే పోయి వచ్చేది.

ఆమె ప్రాణానికి హాని ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ న్యాయం కోసం జనగాం నుంచి హైదరాబాద్ వర కు వెళ్ళి అధికారులను కలిసింది. పోలీసు దెబ్బలకు భర్త కాలు చేయి పనిజెయ్యకుంటయి తర్వాత చనిపోయిండు. ఐలమ్మకు మొత్తం అయిదుగురు కొడుకులు, ఒక బిడ్డ. పచ్చి బాలింతగా ఉన్న బిడ్డపై దొరల తాబేదార్లు అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. ఉద్యమంలో పాల్గొన్న ఒక కొడుకు అమరుడయిండు. అయినా ధైర్యం కూడగట్టుకొని సంఘానికి అండగా నిలిచింది. ఈమెకు అండగా ఆరుట్ల లక్ష్మీనరసింహాడ్డి, ఆరుట్ల కమలాదేవి నిలిచిండ్రు. కమలాదేవిపై కూడా ఇదే విషయంలో కోర్టులో కేసు దాఖలు కావడంతో ఇద్ద రు కలిసే పేషీలకు హాజరయ్యేటోళ్ళు.

1900 ప్రాంతంలో పుట్టిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరుమీద సంగం వాళ్లు పాటలు రాసిండ్రు. పాడిండ్రు. ఉయ్యాల పదం పాడిండ్రు. ఆమెను బాల నాగమ్మ అని వర్ణించిండ్రు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, పంట కోసం, అందరి బాగు కోసం, సంగం రాజ్జెం కోసం తమ సమస్తాన్ని ధారపోసిన ఐలమ్మ త్యాగం అనితర సాధ్యం. ఆమె సాహసం నేటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి . నాటి మహిళల ‘సంగం’ ఉద్యమానికి ఊపిరులూదిన ఐలమ్మ పోరాట పటిమ నిరంతరం తెలంగాణ ఉద్యమానికి దారి చూపుతూనే ఉన్న ది. జీవితకాలంలోనే భర్తను ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకున్న ఐల మ్మ 1985 సెప్టెంబర్ పదిన తనువు చాలించింది.

ఇన్ని త్యాగాలు చేసిన వీరనారి ఐలమ్మ విగ్రహం ఆంధ్ర సర్కార్ ట్యాంక్‌బండ్ మీద పెట్టలేదు. పాఠ్య పుస్తకాలల్ల పెట్టలేదు. ఇప్పుడు మనం తెలంగాణ వచ్చేవరకు తెగించి కొట్లాడాలె. ఐలమ్మ అసువంటోల్లకు చరిత్రలో తగిన స్థానం కల్పించాలె. ప్రతి ఒక్కరూ పట్టుబట్టి పనిచేయాలె. తెలంగాణ సాధించాలె. అమరుల ఆశలను నెరవేర్చాలె. సబ్బండ జాతికి సంపద దక్కాలె.

-సంగిశెట్టి శ్రీనివాస్

(నేడు చాకలి ఐలమ్మ 26వ వర్ధంతి )

నమస్తే తెలంగాణ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *