mt_logo

జయశంకర్ సార్ అమర్ రహే!

తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది, కడదాకా రాష్ట్రం కొరకు మడమ తిప్పని పోరు సల్పిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు ఇవ్వాళ హనుమకొండలో కన్నుమూసారు.

గత ఏడాది కాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నా వీలైనప్పుడల్లా తెలంగాణ సభల్లో ఆయన పాల్గొంటూనే ఉన్నారు. చివరిసారిగా జూన్ 6 నాడు జరిగిన “నమస్తే తెలంగాణ” పత్రిక ప్రారంభోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు.

ఆగస్టు 6, 1934 న హనుమకొండలో జన్మించిన జయశంకర్ తెలంగాణా ఉద్యమానికి స్ఫూర్తి. 1952 నుంచి సాగుతున్న తెలంగాణ ఉద్యమం మూడు దశలకు జయశంకర్ గారు సాక్షి. ఇంటర్మీడియట్ విద్యార్ధిగా 1952లో నాన్-ముల్కీ ఉద్యమంలోకి ఉరికి, 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఫజల్ అలీ కమీషన్ ను కలిసిన విద్యార్ధి బృందంలో జయశంకర్ ఒక సభ్యుడు.

అధ్యాపకునిగా, పరిశోధకునిగా 1968-71 ఉద్యమంలో క్రియాశీల పాత్ర నిర్వహించారు. తెలంగాణ డిమాండును 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతి రోజూ రచనలు, ఊరూరా ప్రసంగాల ద్వారా తెలంగాణ నినాదాన్ని సజీవంగా నిలబెట్టిన నిరంతర తపస్వి. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలలో, సమావేశాలలో తెలంగాణ రణన్నినాదాన్ని వినిపించిన పోరాటశీలి. 1996లో తెలంగాణ ఉద్యమానికి పునరుజ్జీవనం  అందించిన వారిలో అగ్రగణ్యులు.

అమెరికాలో 1999లో తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (టి.డి.ఎఫ్) స్థాపనకు కృషి చేయడంతో పాటు అమెరికాలోని ప్రసిద్ధ నగరాల్లో తెలంగాణ సమస్యపై విస్తృతంగా పర్యటించి అంతర్జాతీయ మద్ధతు కూడగట్టిన వ్యూహకర్త. 2001లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన మార్గదర్శి.

ఒక వైపు తెలంగాణ సాధన స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి అనునిత్యం ఆరాటపడుతూనే ఎన్నో శిఖరాలను అధిరోహించిన విద్యావేత్త. బనారస్ హిందూ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల నుండి ఎం.ఏ (ఎకనామిక్స్), ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డి పొంది, వరంగల్ సి.కె.ఎం. కళాశాల ప్రిన్సిపాల్ గా, సీఫెల్ రిజిస్ట్రార్ గా, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా, ఉప కులపతిగా, అసంఘటిత క్షేత్రంపై జాతీయ కమీషన్ సభ్యుడిగా అత్యున్నత పదవులను అందుకున్న మేధావి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, హిందీ భాషలలో ప్రవీణులు.

వివాహం కూడా చేసుకోకుండా తన పూర్తి జీవితాన్ని తెలంగాణ సాధన కొరకే అంకితం చేసిన త్యాగశీలి జయశంకర్ గారు.

తెలంగాణ చరిత్రలో మొదటి పేజీలో జయశంకర్ సార్ ఉంటారు.

తెలంగాణ సాధించడమే మనం ఆయనకివ్వగల నివాళి.

జయశంకర్ సార్ అమర్ రహే!

(courtesy: mallepalli rajam memorial trust)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *