mt_logo

కేసీఆర్ ఏం చేశారు?

By: కట్టా శేఖర్ రెడ్డి

సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు
అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు.
టిజి వెంకటేశ్, సాకే శైలజానాథ్‌లూ కేసీఆర్‌నే దుయ్యబడుతుంటారు.
దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్‌లూ కేసీఆర్‌నే విమర్శిస్తుంటారు.
తెలంగాణ బిడ్డలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి కూడా కేసీఆర్‌పైనే
ఒంటికాలుమీద లేస్తుంటారు.
తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పే కొన్ని సంఘాలవాళ్లూ
కేసీఆర్‌పైనే దాడి చేస్తుంటారు.
తెలంగాణకు హక్కుదారులుగా చెప్పుకునే డికె అరుణ, రేణుకాచౌదరి
వంటి వాళ్లూ కేసీఆర్‌పైనే విసుర్లు ఎక్కుపెడుతుంటారు.

ఎందుకిలా జరుగుతోంది? వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అందరి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ఒక్కరే కావడంలోని అంతరార్థం ఏమిటి? ఇంతమందికి కేసీఆర్ శత్రువు ఎందుకయ్యారు? కేసీఆర్ నిజంగా ఇటువంటి విమర్శలకు పాత్రుడేనా? ఇంతమంది దీవెనలతో కేసీఆర్ బలపడుతున్నారా? బలహీనపడుతున్నారా? తెలంగాణ ఆకాంక్షలకు కేంద్రబిందువు కావడమే ఆయనను విమర్శలకు కేంద్రబిందువును చేసిందా? ఇటీవల జరిగిన ఒక మిత్రగోష్టిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కేసీఆర్‌పై చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేయదల్చుకున్నాను. ఆయన రాష్ట్ర రాజకీయాలను గురించి, వివిధ పార్టీల అగ్రనేతలను గురించి వర్ణిస్తూ, ఇంతమంది విమర్శలకు కేసీఆర్ ఎందుకు కేంద్రబిందువు అయ్యాడో వివరించాడు.

‘‘కేసీఆర్ ఏం చేశాడని పదే పదే మాట్లాడతారు టీడీపీ వాళ్లు. కేసీఆర్ తెలంగాణకు పది తరాలకు సరిపోను నాయకులను తయారు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వ కేతనంగా తీర్చిదిద్దారు. మా(సీమాంధ్ర) నాయకులూ ఉన్నారు. ఒక్కడు అరగంట కూడా సరిగా మాట్లాడలేడు. చాలా మందికి నోరే పెగలదు. అసలు మా నాయకులు రెండో తరం నాయకులను తయారు చేయరు సరికదా, ఉన్నవారిని ఎదగనీయరు. కానీ కేసీఆర్ ఊరూరా వేలాదిమంది ఉపన్యాసకులను, ఉద్యమకారులను తయారు చేశారు. ఒక సామాన్య గ్రామీణ కార్యకర్త, ఒక మామూలు యూనివర్సిటీ విద్యార్థి, ఒక పణికెర మల్లయ్య కూడా ఇవ్వాళ తెలంగాణపై గణగణా గంటసేపు మాట్లాడగలరు. చంద్రబాబు వంటి వారిని పొలంగట్టుపై నిలదీసి అడగగలరు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అస్తిత్వకాంక్షల స్పృహను సార్వజనికం చేయడమే కాదు, తెలంగాణ పేరెత్తకుండా ఇవ్వాళ ఏ నాయకుడూ మనలేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక జాతి నిర్మాణానికి ఇంతకంటే ఏం కావాలి? సమకాలీన రాజకీయ చరిత్రలో ఇంతటి కృషి, ఇంతటి ప్రభావం కలిగించిన నాయకుడిని చూపించండి? ఆయనకొక నినాదం ఉంది. తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. మా నాయకులకు అసలు ఏ నినాదమూ లేదు. ఉన్నదంతా డొల్లతనమే. కేసీఆర్ పదకొండేళ్లు ఏ అధికారం లేకున్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని, ఉద్యమాన్ని పట్టు సడలకుండానడుపుకుంటూ వస్తున్నారు. ఇటీవల మనం చూడడం లేదా-చంవూదబాబు ఏడేండ్లు అధికారం లేకపోయేసరికి విలవిల్లాడుతున్నారు. విచక్షణ, సోయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు. ఏ లక్ష్యం, ఏ విధానమూ లేనప్పుడే ఇటువంటి అసహనం, దురావేశం వస్తాయి. కేసీఆర్‌కు ఒక విధా నం ఉంది. లక్ష్యం ఉంది. ఎవన్ని రకాలుగా ప్రచారం చేసినా, ఎన్ని అబద్ధాలను పత్రికల్లో కుమ్మరించినా తెలంగాణ కోసం మొక్కవోకుండా పోరాడున్నది ఒక్క కేసీఆరేనన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. వరుస ఉప ఎన్నికలన్నీ అదే విషయం రుజువు చేశాయి. అది ఆయన సంపాదించిన విశ్వసనీయత. నాయకులు బలపడినా, బలహీనపడినా విశ్వసనీయతపై ఆధారపడే జరుగుతుంది. చంద్రబాబుకు లేనిది అదే. ఆయన ప్రజల విశ్వసనీయతను పదే పదే కోల్పోతూ వస్తున్నారు. మాటమీద నిలబడనితనం ఆయనను జనం నుంచి దూరం చేస్తున్నది’’ అని ఆయన వివరించారు.

‘‘తెలంగాణ విషయంలో చంద్రబాబు చేసింది పెద్ద తప్పు. ఆయన ఇప్పటికీ సరిదిద్దుకోకపోగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. తనకెలాగూ విశ్వసనీయత లేదు కాబట్టి కేసీఆర్‌కు కూడా విశ్వసనీయత లేకుండా చేస్తే పోతుంది కదా అని ఆయన అనుకుంటున్నారు. చిన్న గీత పెద్దది కానప్పుడు, పెద్ద గీతను చెరిపేసి చిన్నదిగా చేయాలన్న కురుచబుద్ధి ఇది. అందుకే కేసీఆర్‌మీద, తెలంగాణ ఉద్యమం మీద మలినం కుమ్మరించడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మూకను అదేపనిగా ప్రయోగిస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ విజ్ఞతపై కాకుండా ఇప్పటికీ, ట్రిక్కుల మీద, టక్కుటమార విద్యలమీద ఆధారపడుతున్నాడు. అది చంద్రబాబును ఇంకా డ్యామేజ్ చేస్తున్నది. మొన్నటి ఉప ఎన్నికల్లో నామినేషన్లు పూర్తయ్యే సమయానికి తెలుగుదేశం పరిస్థితి కొంత మెరుగుగా ఉండింది. అన్ని చోట్ల డిపాజిట్లు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. తెలుగుదేశానికి అన్ని నియోజకవర్గాల్లోనూ 1 నుంచి 25 శాతం ఓట్ల దాకా వస్తాయని సర్వేలు సూచించాయి. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ చంద్రబాబుతోపాటు మోత్కుపల్లి, ఎర్రబెల్లి మరీ రెచ్చిపోయి మాట్లాడారు. పర్యవసానం ఏమంటే, మూడు చోట్ల డిపాజిట్లు పోయాయి. మిగిలిన మూడు చోట్ల ముందు ఊహించిన దానికంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కడియం శ్రీహరికి ఎర్రబెల్లి ప్రచారం మేలుకంటే కీడే ఎక్కువ చేసింది. తెలంగాణలోని ఇతర తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు ప్రయోగించిన మూకను చూసి భయపడుతున్నారు. వాళ్లు వాగే కొద్దీ తాము మరింత ఇరుకున పడతామని భావిస్తున్నారు’’ అని ఆయన విశ్లేషించారు.

‘‘ఎవన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. ఆయన వల్ల కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. కానీ తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద పడేయలేదు. కేసీఆర్ రాజకీయంగా బలపడేకొద్దీ తెలంగాణవాదం బలపడుతుంది. తెలంగాణవాదాన్ని కొట్టాలంటే కేసీఆర్‌ను కొట్టాలి. కేసీఆర్‌ను రాజకీయంగా బలహీనపర్చితే తెలంగాణవాదం బలహీనపడుతుంది. అందుకే తెలంగాణ వ్యతిరేకులకూ (సమైక్యవాదులకు), తెలంగాణ ద్రోహులకూ, తెలంగాణ రావడం కంటే రాజకీయంగా బతకడం ముఖ్యమని భావించే కొందరు తెలంగాణ మిత్రులకూ(?) ఉమ్మడి లక్ష్యం అయ్యారు కేసీఆర్. కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేస్తే తెలంగాణ కథ ముగిసిపోతుందని వారి ఆలోచన. కానీ కేసీఆర్ సక్సెస్ అయింది అక్కడే. ఆయన వందలాది మంది కేసీఆర్‌లను తయారు చేసి పల్లెపప్లూకూ వదిలారు. తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహుల పాచికలు పారకుండా నిలువరించగలిగారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం రుజువు చేశారు. తెలంగాణవాదం ఇవ్వాళ ఈ ప్రాంత ప్రజల జీవనాడుల్లో ఇంకిపోయింది. తెలంగాణ తెచ్చిన వాళ్లను, ఇచ్చిన వాళ్లను మాత్రమే తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. గోడమీది పిల్లులను, ఊసర గబ్బిలాలను ఇక్కడి ప్రజలు ఇంకేమాత్రం భరించే అవకాశం లేదు’ అని ఆయన అన్నారు.

‘మోత్కుపల్లి నరసింహులు ఆంధ్రా ప్రాంతంలో పెద్ద హీరో అయ్యారు’ అని ఒక రాజకీయ పరిశీలకుడు ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఈ మాట స్వయంగా నర్సింహులు కూడా కొంతకాలంగా చెబుతున్నారు. కేసీఆర్‌ను విమర్శించడం మొదలు పెట్టిన తర్వాత తనకు అనూహ్యంగా, అసాధారణంగా అభినందనలు వచ్చాయ ని చెప్పారు. ‘అభినందించేవాళ్లంతా ఎవరు?’ అని అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పలేదు. కానీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కులో మోత్కుపల్లి రోజూ ఉదయం వాకింగ్‌కు వస్తారు. అక్కడ ఆయనకు ఎదురుపడే వాళ్లంతా ఆయనను అహో! ఒహో! అని కీర్తించడం నాకు కూడా తెలుసు. కానీ వాళ్లంతా ఎవరు? సమైక్యవాదం సుభిక్షంగా ఇలాగే ఉండాలని కోరుకునే ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిశ్రామిక, ఉద్యోగ, మేధావి వర్గాల కు చెందిన మిత్రులు. తెలంగాణ రావద్దని కోరుకుంటున్నవాళ్లు. తెలంగాణకు అడ్డంపడుతున్నవాళ్లు. ‘తెలంగాణ రాకపోయినా ఫర్వాలేదు, కానీ మా రాజకీయ ప్రాబల్యం తగ్గకూడద’నుకునేవాళ్లు. బయటివాళ్లు నిన్ను పొగుడుతున్నారంటే నువ్వు ఇంటివాళ్లకు దూరమవుతున్నావని అర్థం. సమైక్యవాదులకు హీరోవయ్యావంటే తెలంగాణవాదులకు విలన్ వు అవుతున్నావని అర్థం. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు ఈ లెక్కలన్నీ తెలియవని అనుకోలేం. కానీ ఆయన తెలంగాణవాదం నీడలో తనకు రాజకీయ అస్తిత్వం లేదనుకుంటున్నట్టున్నాడు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్కుకు సిద్ధపడ్డాడు. ఈ పాత్రను స్వీకరించాడు.

చాలా ఏళ్ల కిందటి ముచ్చట. యూనివర్సిటీ లో స్టూడెంట్ యూనియన్ చైర్మన్‌కు పోటీ చేయాలని మా విద్యార్థి సంఘం అప్పట్లో నన్ను ఆదేశించింది. ‘నీకు విద్యార్థుల అందరి పేర్లు కంఠతా వచ్చు. నువ్వయితే గెలుస్తావ్’ అన్నారు. సరే అన్నాను. నాపై పోటీ చేయడానికి ఎవరూ ఉత్సాహం చూపించలేదు. ప్రత్యర్థులంతా చివరకు ఒక మిత్రుడిని ఒప్పించారు. ఆయన నామినేషన్ వేయగానే విద్యార్థినులంతా కట్టగట్టుకుని వచ్చారు. ‘మీరు ఇక ప్రచారం చేయవలసిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి. ఆయనకు ఎంత గొప్ప పేరు ఉందో మీకు తెలుసు’ అని చెప్పిపోయారు. నిజంగానే ఎక్కువగా కష్టపడకుండానే ఎన్నికల్లో గెలిచాం. మన సుగుణమే కాదు, ఎదుటివారి దుర్గుణాలూ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. కేసీఆర్ ఏ సుగుణాల కోసం, ఏ లక్ష్యాల కోసం నిలబడ్డాడు? చంద్రబాబునాయుడు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి, లగడపాటి, రాయపాటి… ఏ దుర్గుణాలను, ఏ అప్రతిష్ఠను మోస్తున్నారు? ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు? ఈ సూక్ష్మాన్నిగ్రహిస్తే మంచిది. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ ఇప్పటికే బాగా తెలుసు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *